Chief Minister: ప్రభుత్వ పథకాలపై ప్రత్యేక జాగృతి: సీఎం
ABN , First Publish Date - 2023-02-11T11:29:16+05:30 IST
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలు, అణగారిన వర్గాల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సంపూర్తిగా
బెంగళూరు, ఫిబ్రవరి 10 (ఆంధ్రజ్యోతి): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిరుపేదలు, అణగారిన వర్గాల కోసం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పలు సంక్షేమ పథకాలు లబ్ధిదారులకు సంపూర్తిగా అందేలా ప్రత్యేక జాగృతి కార్యక్రమం చేపట్టనున్నట్లు ముఖ్యమంత్రి బసవరాజ్ బొమ్మై(Chief Minister Basavaraj Bommai) పేర్కొన్నారు. శాసనసభ ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించిన అనంతరం సీఎం హుబ్బళ్లి పర్యటనకు బయల్దేరి వెళ్లబోయే ముందు మీడియాతో కొద్దిసేపు మాట్లాడారు. దేశ ప్రధానిగా మోదీ పగ్గాలు చేపట్టాక పాలనలో పారదర్శకత బాగా పెరిగిందన్నారు. ప్రభుత్వం వేల కోట్ల రూపాయలు వెచ్చించి అమలు చేస్తున్న సంక్షేమ ఫ లాలు ప్రజలకు పూర్తిగా అందేలా డీబీటీ వ్యవస్థను అమల్లోకి తెచ్చామని ఫలితంగా దళారులను నివారించగలిగామన్నారు. అవినీతికి అక్రమాలకు తావులేని వ్యవస్ధను తెచ్చామన్నారు. కాగా పీఎం స్వనిధి, రైత విద్యానిధి, రైత శక్తి పథకాల లబ్ధిదారులకు డీబీటీ ద్వారానే చెల్లింపులు చేస్తున్నామన్నారు. ప్రభుత్వ పథకాలు లబ్ధిదారుల ముంగిటకు చేరేందుకు రానున్న నెల రోజుల పాటు ప్రత్యేక అభియాన ప్రారంభించాల్సిందిగా అన్ని శాఖల ఉన్నతాధికారులకు, జిల్లా యంత్రాంగాలకు సూచించామని తెలిపారు. స్త్రీ శక్తి, స్వామి వివేకానంద యువశక్తి, అమృత పథకాలను లబ్ధిదారులు గరిష్టంగా సద్వినియోగం చేసుకునేలా కార్యక్రమాలకు రూపుకల్పన చేస్తున్నామన్నారు. దావణగెరె జిల్లా ఇన్‌చార్జి మంత్రిగా బాధ్యతలు అధికంగా ఉన్నందున అదనంగా మండ్య జిల్లా ఇన్‌చార్జిగా ఉండలేనని రెవెన్యూ శాఖ మంత్రి ఆర్ అశోక్ లేఖరాయడంతోనే ఆయనను ఈ బాధ్యతలను విముక్తి చే శామని ఇందులో ఎలాంటి రాజకీయాలు లేవన్నారు.
ఇదికూడా చదవండి: సెలబ్రిటీలు సంయమనంతో మెలగాలి