Share News

Chief Minister: మాట్లాడటం పెద్ద సమస్య కాదు.. కానీ అటువైపు చిత్తశుద్ధి ఉంటే కదా?

ABN , Publish Date - Dec 17 , 2023 | 08:59 AM

రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)తో తాను సమావేశం కావడం పెద్ద సమస్య కాదని, గవర్నర్‌ ఇకనైనా మనసు మార్చుకుని

Chief Minister: మాట్లాడటం పెద్ద సమస్య కాదు.. కానీ అటువైపు చిత్తశుద్ధి ఉంటే కదా?

- గవర్నర్‌పై సీఎం రుసరుసలు

- డీఎంకే ఎంపీలతో భేటీ

- 19న ఢిల్లీకి పయనం

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి(Governor RN Ravi)తో తాను సమావేశం కావడం పెద్ద సమస్య కాదని, గవర్నర్‌ ఇకనైనా మనసు మార్చుకుని రాష్ట్రానికి మేలు చేసేలా నడుచుకోవాలని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) అభిప్రాయపడ్డారు. ఆయన తాజాగా ఓ ఆంగ్ల పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని వెల్లడించారు. రాష్ట్ర అసెంబ్లీ పంపిన బిల్లుల ఆమోదంపై గవర్నర్‌, ముఖ్యమంత్రి కలిసి ఒక చోట కూర్చొని మాట్లాడుకుని సమస్య పరిష్కారం కోసం కృషి చేయాలంటూ ఇటీవల సుప్రీంకోర్టు చేసిన సూచనపై సీఎం స్టాలిన్‌ స్పందించారు. గవర్నర్‌తో సమావేశం కావడం పెద్ద సమస్యే కాదని కానీ అటువైపు నుంచి చిత్తశుద్ధి కూడా ఉండాలన్నారు. గవర్నర్‌గా రవి నియమితులైన తర్వాత ఆయనతో అనేక పర్యాయాలు సమావేశమయ్యాయని, అనేక కార్యక్రమాల్లో వేదికను పంచుకున్నానని గుర్తు చేశారు. తామిద్దరం కలుసుకున్న సందర్భాల్లో తనతో ఆయన సానుకూలంగా మాట్లాడేవారన్నారు. అందువల్ల తామిద్దరం కలుసుకోవడం ముఖ్యం కాదన్నారు. గవర్నర్‌ మనసు మార్చుకుని, రాష్ట్రానికి మేలు చేసేలా వ్యహరించాలన్నదే తమిళనాడు రాష్ట్ర ప్రజలందరి కోరిక అని అన్నారు. ప్రభుత్వ ఆలోచనలకు, రాష్ట్రాభివృద్ధికి వ్యతిరేకంగా కొందరి చేతుల్లో పావుగా మారి ఆయన తీరు మార్చుకోవాలన్నారు. రాష్ట్రాభివృద్ధికి ఆయన అండగా ఉండాలని కోరామన్నారు.

విధానపరమైన విభేదాలు మాత్రమే...

మూడు రాష్ట్రాల్లో భారతీయ జనతా పార్టీ అధికారంలోకి రావడంతో వచ్చే యేడాది జరిగే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ విజయాన్ని ఎవరూ అడ్డుకోలేరంటూ సాగుతున్న ప్రచారాన్ని సీఎం స్టాలిన్‌ కొట్టి పారేశారు. ఇవి కేవలం అసెంబ్లీ ఎన్నికలు మాత్రమేనన్నారు. ఈ ఎన్నికల ఫలితాలు లోక్‌సభ ఎన్నికలపై ఏమాత్రం ప్రభావం చూపవన్నారు. సాధారణంగా అసెంబ్లీ ఎన్నికల్లో ఆయా రాష్ట్రాల్లోని అంశాలు ప్రభావితం చేస్తాయన్నారు. ఇలాంటి అంశాలే ఆ రాష్ట్ర ఫలితాలను నిర్దేశిస్తాయన్నారు. రాజస్థాన్‌లో బీజేపీ అధికారంలోకి వచ్చినా, కాంగ్రెస్‌ - బీజేపీల మధ్య 10 లక్షల ఓట్ల వ్యత్యాసం మాత్రమే ఉందని గుర్తు చేశారు. చత్తీస్‏ఘఢ్‌లో ఆరు లక్షల ఓట్లను అధికంగా బీజేపీ దక్కించుకుని అధికారంలోకి వచ్చిందన్నారు. ఒక్క మధ్యప్రదేశ్‌ రాష్ట్రంలోనే 35 లక్షల ఓట్లు అధికంగా వచ్చాయని స్టాలిన్‌ చెప్పారు. అందువల్ల ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ప్రభావం సార్వత్రిక ఎన్నికలపై ఉండదని ఆయన పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ముందుచూపుతో వ్యవహరించి, అప్రమత్తంగా ఉండటం వల్లే మిచౌంగ్‌ తుఫాను నుంచి పెను ముప్పును తప్పించుకున్నామన్నారు. వరద బాధిత ప్రాంతాల్లో కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ సహా కేంద్ర బృందం పర్యటించిందని, వరద ముప్పు కారణంగా జరిగిన నష్టాన్ని అంచనా వేసిందన్నారు. ఈ వరద సాయంపై కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. డీఎంకే - బీజేపీల మధ్య కేవలం విధానపరమైన విభేదాలు మాత్రమే ఉన్నాయన్నారు. వీటిని కూడా పక్కనబెట్టి తుఫాను సహాయక చర్యల్లో ప్రభుత్వం చేపట్టిన చర్యలను రాజ్‌నాథ్‌ సింగ్‌, కేంద్ర బృందం అభినందించిందని సీఎం గుర్తు చేశారు.

nani4.jpg

డీఎంకే ఎంపీలతో భేటీ

స్థానిక తేనాంపేటలోని డీఎంకే ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీకి చెందిన 30 మంది లోక్‌సభ, రాజ్యసభ ఎంపీలు శనివారం ముఖ్యమంత్రి స్టాలిన్‌తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు వరద సహాయ చర్యల కోసం తమ ఒక నెల జీతా న్ని సీఎం సహాయనిధికి అందజేశారు. ఆ మొత్తాన్ని స్టాలిన్‌కు కనిమొళి అందజేశారు. ఇటీవల పార్లమెంట్‌లో భద్రతా ఉల్లంఘన కారణంగా ఇద్దరు యువకులు లోక్‌సభ సమావేశ మందిరంలోకి దూసుకెళ్లి రంగుల పొగను (స్మోక్‌ క్యాన్ల నుంచి) వదిలిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ భద్రతా ఉల్లంఘన ఘటనపై ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్‌ షా హాజరై సమాధానం ఇవ్వాలంటూ విపక్ష పార్టీలకు చెందిన సభ్యులు సభలో పట్టుబట్టారు. దీంతో 14 మంది విపక్ష సభ్యులపై సమావేశాలు ముగిసేంత వరకు సస్పెన్షన్‌ వేటు వేశారు. ఈ సస్పెండ్‌కు గురైన వారిలో కనిమొళి, జ్యోతిమణి ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సీఎం స్టాలిన్‌ శనివారం స్థానిక తేనాంపేటలోని అన్నా అరివాలయంలో డీఎంకేకు చెందిన ఎంపీలతో సమావేశమయ్యారు. ఇందులో ఆ పార్టీ పార్లమెంటరీ నేత టీఆర్‌ బాలు, ఎంపీలు కనిమొళి, జ్యోతిమణి, తిరుచ్చి శివ, కళానిధి వీరాస్వామి తదితరులు పాల్గొన్నారు. ఈ సమావేశాల మొత్తానికి 14 మంది ఎంపీలను సస్పెండ్‌ చేసిన నేపథ్యంలో తదుపరి చర్యలపై చర్చించేందుకు ఆయన సమావేశం నిర్వహించారు. సోమవారం నుంచి జరిగే శాసనసభ సమావేశాల్లో డీఎంకే ఎంపీలు సభలో ఏ విధంగా నడుచుకోవాలన్న అంశంపై ఎంపీలతో కలిసి ఆయన చర్చించారు.

19న ఢిల్లీకి సీఎం

ఈనెల 19న ముఖ్యమంత్రి స్టాలిన్‌ ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆ రోజున హస్తిన వేదికగా జరిగే ‘ఇండియా’ కూటమి నేతల సమావేశంలో పాల్గొంటారు. ఈనెల 18న కోయంబత్తూరుకు వెళ్లి అక్కడ ప్రభుత్వం చేపట్టే కొత్త పథకాన్ని ప్రారంభించి, అక్కడ నుంచి ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. అక్కడ ‘ఇండియా’ కూటమి నాల్గో సమావేశంలో పాల్గొననున్నారు. ఇందులో ఇండియా కూటమి తరపున ప్రధానమంత్రి అభ్యర్థిగా ఎవరిని ఎంపిక చేయాలన్న అంశంపై చర్చించే అవకాశం ఉంది. అలాగే, ఈ కూటమి కనీస ఉమ్మడి కార్యక్రమ రూపకల్పనపై సమీక్షించనున్నారు. అదేసమయంలో ఈనెల 3వ తేదీ వెల్లడైన ఐదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు, మూడు రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి రావడం తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉంది. పార్లమెంట్‌ ప్రాంగణంలో జరిగే ఈ సమావేశంలో ఆ కూటమిలోని అన్ని పార్టీలకు చెందిన నేతలు హాజరుకానున్నారు.

Updated Date - Dec 17 , 2023 | 08:59 AM