Chief Minister: జనం మెచ్చేలా పథకాలు అమలు చేయండి

ABN , First Publish Date - 2023-02-10T08:24:25+05:30 IST

రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా డీఎంకే ప్రభుత్వం గత ఇరవై రోలల్లో అమలులోకి తెచ్చిన ప్రత్యేక పథకాలన్నింటినీ ఈ యేడాదిలోగా సమగ్రంగా అమలు చేసి తీరాలని

Chief Minister: జనం మెచ్చేలా పథకాలు అమలు చేయండి

- అధికారులకు సీఎం దిశానిర్దేశం

చెన్నై, ఫిబ్రవరి 9 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ప్రజలు మెచ్చేలా డీఎంకే ప్రభుత్వం గత ఇరవై రోలల్లో అమలులోకి తెచ్చిన ప్రత్యేక పథకాలన్నింటినీ ఈ యేడాదిలోగా సమగ్రంగా అమలు చేసి తీరాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) ఆదేశించారు. గురువారం సచివాలయ సమావేశ మందిరంలో వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలకు సిటీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం, బడిపిల్లలకు ఉదయం అల్పాహారం, అన్నదాతలకు ఉచిత విద్యుత్‌ కనెక్షన్లు, ఇళ్ల వద్దకే వైద్య పథకం, పుదుమై పెణ్‌ వంటి ప్రత్యేక పథకాలను ప్రవేశపెట్టిన ఘనత డీఎంకే ప్రభుత్వానికే దక్కిందన్నారు. ఈ పథకాల ద్వారా లబ్ధి పొందిన మహిళలు, విద్యార్థినులు, రైతులు, దీర్ఘకాలిక రోగగ్రస్థులు, బడిపిల్లలు రోజూ డీఎంకే ద్రావిడ తరహా పాలనను మనసారా మెచ్చుకుంటున్నారన్నారు. పదేళ్ల అన్నాడీఎంకే ప్రభుత్వ హయాంలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అథఃపాతాళానికి చేరుకుందని, డీఎంకే(DMK) ప్రభుత్వం ఆర్థిక నిపుణుల కమిటీతో ఆర్థిక పరిస్థితిని చక్కదిద్దిందని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు పెరిగాయని, పారిశ్రామిక పరంగా రాష్ట్రం అభివృద్ధి చెందుతోందన్నారు. పేద, ఽగొప్ప తారతమ్యం లేకుండా అందరికీ అన్ని సదుపాయాలు కల్పించటమే తమ ప్రభుత్వ ఆశయమన్నారు. ప్రజలకు అవసరమైన పథకాలను రూపొందించేది తామే అయినా, ఆ పథకాల ఫలితాలు రాష్ట్రంలో మారుమూల కుగ్రామాలకు కూడా చేరాలంటే ఆయా శాఖల అధికారులు అంకిత భావంతో పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. పథకాల అమలులో జాప్యం జరిగినా నిధులు సక్రమంగా అందలేదని కుంటి సాకులు చెప్పినా తాను సహించనని, పథకాలను అన్ని జిల్లాల్లోనూ అమలు చేయాలన్నదే తమ ధ్యేయమని, ఆ మేరకు ఆయా జిల్లాలకు పథకాలకు సంబంధించి నిధులు సక్రమంగా మంజూరు చేస్తున్నామని తెలిపారు. ఈ విషయంలో శాఖాధికారులకుగానీ, జిల్లా కలెక్టర్లకు గానీ ఏవైనా సమస్యలు ఎదురైతే తక్షణమే తన దృష్టికి తీసుకురావాలన్నారు. ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఇరై అన్బు, యువజన సంక్షేమం క్రీడాభివృద్ధి శాఖల మంత్రి ఉదయనిధి, వివిధశాఖలకు చెందిన ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఇదికూడా చదవండి: రెండాకులకు 5 వేల ఓట్లు కూడా రావు: దినకరన్‌

Updated Date - 2023-02-10T08:24:27+05:30 IST