Chief Minister: సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

ABN , First Publish Date - 2023-05-27T11:16:28+05:30 IST

దక్షిణాసియాలోనే కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు, భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రం తమిళనాడేనని సీఎం ఎంకే స్టాలిన్‌(CM MK Stalin

Chief Minister: సీఎం స్టాలిన్ సంచలన వ్యాఖ్యలు.. ఆయన ఏమన్నారో తెలిస్తే..

చెన్నై, (ఆంధ్రజ్యోతి): దక్షిణాసియాలోనే కొత్త పరిశ్రమలు స్థాపించేందుకు, భారీగా పెట్టుబడులు పెట్టేందుకు అనువైన రాష్ట్రం తమిళనాడేనని సీఎం ఎంకే స్టాలిన్‌(CM MK Stalin) అన్నారు. శుక్రవారం ఉదయం జరిగిన జపాన్‌ పెట్టుబడిదారుల సదస్సులో ఆయన ప్రసంగిస్తూ.. తమ రాష్ట్రంలో ఇప్పటికే 170 జపాన్‌ సంస్థలు పరిశ్రమలు నడుపుతున్నాయని చెప్పారు. తమ రాష్ట్రానికి జపాన్‌ దేశం ఆర్థికపరంగా అందిస్తున్న సేవలను తామెన్నడూ మరచిపోలేమని, ప్రత్యేకించి చెన్నై మెట్రోరైలు ప్రాజెక్టుకు, హొగెనేకల్‌ సమగ్ర నీటి పథకం అమలుకు భారీగా నిధులు సమకూర్చిందని ఆయన కొనియాడారు. 2008లో ఆ రెండు ప్రాజెక్టులకు సంబంధించి నిధుల సేకరణకు తాను మంత్రిగా జపాన్‌లో పర్యటించానని, ప్రస్తుతం ముఖ్యమంత్రిగా పెట్టుబడుల సమీకరణకోసం వచ్చానని, ఆ దేశ పెట్టుబడిదారులంతా చెన్నైలో వచ్చే యేడాది జరుపతలపెట్టిన పెట్టుబడిదారుల సదస్సులకు తప్పకుండా విచ్చేయాలని స్టాలిన్‌ పిలుపునిచ్చారు. అప్పట్లో జపాన్‌కు చెందిన 840 సంస్థలు భారతదేశంలో పరిశ్రమలను స్థాపించాయని, వాటిలో 170 సంస్థలు తమిళనాట పరిశ్రమలు నెలకొల్పాయన్నారు. అప్పట్లో జపాన్‌ మంత్రులు కొత్త పరిశ్రమలకు తమిళనాడు దక్షిణాసియా ప్రవేశద్వారంగా ఉంటోందని కొనియాడిన విషయాన్ని స్టాలిన్‌ గుర్తు చేశారు. భారత్‌, జపాన్‌ దేశాల మధ్య దశాబ్దాల తరబడి పటిష్ఠమైన సంబంధాలు కొనసాగుతున్నాయని చెప్పారు. జపాన్‌ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి కనబరిచే జపాన్‌ సంస్థలకు తమ ప్రభుత్వం అన్ని విధాల సహకరిస్తుందన్నారు. గత రెండేళ్లుగా తమ రాష్ట్రం పారిశ్రామికంగా అభివృద్ధి చెందుతోందని తెలిపారు. ఇప్పటికే తమ రాష్ట్రంలో నిస్సాన్‌, యమహా, హిటాచి వంటి పలు జపాన్‌ సంస్థలు తమ కార్యకలాపాలను విస్తరించి విదేశాలకు తమ ఉత్పత్తులను సకాలంలో ఎగుమతి చేస్తున్నాయన్నారు. ఈ సదస్సులో జపాన్‌కు చెందిన ఐదు అంతర్జాతీయ సంస్థలు రాష్ట్ర పారిశ్రామిక మార్గదర్శక సంస్థతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. వీటిలో టైసల్‌ సేఫ్టీ సిస్టమ్స్‌ సంస్థ చెంగల్పట్టు జిల్లా తిరుప్పోరూరులో ఉన్న ఎయిర్‌బ్యాగ్‌ ఇన్‌ప్లేటర్లను ఉత్పత్తి చేస్తున్న కర్మాగారంలో విస్తరణ పనులు చేపట్టనుంది. ఈ సదస్సు ముగిసిన తర్వాత జపాన్‌ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో కలిసి ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ విందు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ విందులో జపాన్‌లోని ఒసాకా ప్రావిన్స్‌ డిప్యూటీ గవర్నర్‌ నోబుహికో యజాకుజీ పాల్గొన్నారు.

nani9.2.jpg

Updated Date - 2023-05-27T11:16:28+05:30 IST