Chief Minister: వాటి కోసమే నేను వెళుతున్నా...

ABN , First Publish Date - 2023-05-24T08:16:11+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) మంగళవారం మధ్యాహ్నం సింగపూర్‌కు బయలుదేరి వెళ్ళారు.

Chief Minister: వాటి కోసమే నేను వెళుతున్నా...

చెన్నై, (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌(Chief Minister MK Stalin) మంగళవారం మధ్యాహ్నం సింగపూర్‌కు బయలుదేరి వెళ్ళారు. తొమ్మిది రోజులపాటు ఆయన సింగపూర్‌, జపాన్‌(Singapore, Japan) దేశాల్లో పర్యటించనున్నారు. రాష్ట్రంలో బహుళ జాతి సంస్థల ఆధ్వర్యంలో కొత్త పరిశ్రమలు స్ధాపించే దిశగా, వచ్చే యేడాది జనవరిలో జరుగనున్న అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనాలని విదేశీ పెట్టుబడిదారులను ఆహ్వానించేందుకు, అదే సమయంలో తాజాగా వివిధ సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకునేందుకుగాను ఆయన ఈ విదేశీ పర్యటన తలపెట్టారు. ఆ సందర్భంగా పలు పారిశ్రామికవేత్తలను కలుసుకుని రాష్ట్రంలో పరిశ్రమలు నెలకొల్పాలంటూ విజ్ఞప్తి చేయనున్నారు. విదేశీ ప్రయాణానికి బయలుదేరే ముందుగా మంగళవారం ఉదయం ఆయన మెరీనా బీచ్‌లోని మాజీ ముఖ్యమంత్రి, తన తండ్రి కరుణానిధి(Karunanidhi) సమాధి వద్ద నివాళి అర్పించారు. అనంతరం అటు నుంచి అటే మీనంబాక్కంలోని అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అప్పటికే ఆ విమానాశ్రయం వద్ద వేచి ఉన్న మంత్రులు దురైమురుగన్‌, కేఎన్‌ నెహ్రూ, దామో అన్బరసన్‌, తంగం తెన్నరసు, ఎం.సుబ్రమణ్యం, పీకే శేఖర్‌బాబు, సెంథిల్‌బాలాజీ, శివశంకర్‌, పెరియ కరుప్పన్‌ తదితర మంత్రులంతా సీఎం స్టాలిన్‌కు పుష్పగుచ్ఛాలు అందించి వీడ్కోలు పలికారు. ఇదే విధంగా వివిధ శాఖలకు చెందిన ఐఏఎస్‌ అధికారులు ఉదయచంద్రన్‌, మురుగానందం, మేయర్‌ ప్రియ(Mayor Priya), డీజీపీ శేలేంద్రబాబు, నగర పోలీసు కమిషనర్‌ శంకర్‌ జివాల్‌, డీఎంకే వ్యవస్థాపక కార్యదర్శి ఆర్‌ఎస్‌ భారతి, ఎంపీలు టీఆర్‌బాలు, ఎ.రాజా, శాసనసభ్యులు పల్లావరం ఇ.కరుణానిధి, తాంబరం ఎన్‌ఆర్‌ రాజా, ఏఎంవీ ప్రభాకర్‌ రాజా, రాష్ట్ర గృహనిర్మాణ సంస్థ అధ్యక్షుడు పూచ్చిమురుగన్‌ తదితరులు కూడా సీఎంకు వీడ్కోలు పలికారు.

కొత్త పరిశ్రమల కోసమే వెళుతున్నా: స్టాలిన్‌

రాష్ట్రంలో కొత్త పరిశ్రమలు స్థాపించి ఉద్యోగావకాశాలు పెంచాలనే లక్ష్యంతోనే తాను విదేశీ పర్యటనకు బయలుదేరి వెళుతున్నట్లు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ప్రకటించారు. గతేడాది మార్చిలో యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ పర్యటన సందర్భంగా విదేశీ పెట్టుబడులను సమీకరించి, పలు సంస్థలతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నట్లే తాజా పర్యటనలోనూ పలు సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకోనున్నామని, అంతే కాకుండా వచ్చే జనవరిలో నిర్వహించే అంతర్జాతీయ పెట్టుబడిదారుల సదస్సులో పాల్గొనాలని విదేశీ పారిశ్రామికవేత్తలను కూడా ఆహ్వానించనున్నామని చెప్పారు. విమానాశ్రయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... తొమ్మిదిరోజుల పర్యటనలో విదేశీ పెట్టుబడిదారులను కలుసుకోనున్నామని, కొత్త ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటామని చెప్పారు. తనతోపాటు పరిశ్రమల శాఖ మంత్రి టీఆర్‌బీ రాజా, వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన అధికారులు పర్యటించనున్నారని తెలిపారు. ఇప్పటికే తన పర్యటన ఏర్పాట్లను పరిశీలించేందుకు మంత్రి టీఆర్‌బీ రాజా సింగపూర్‌ వెళ్లి ఉన్నారన్నారు. గతేడాది అరబ్‌ దేశాల్లో పర్యటించినప్పుడు రూ.6100 కోట్ల మేరకు పెట్టుబడులను సమీకరించగలిగామని, దాంతో 15,100 మందికి ఉపాధి అవకాశాలు లభించాయని చెప్పారు. డీఎంకే రెండేళ్ల పాలనలో 226 ప్రాజెక్టులకు సంబంధించి అవగాహన ఒప్పందాలు కుదిరాయని, రూ.2,95,339 కోట్ల మేరకు పెట్టుబడులు సేకరించగలిగామని వివరించారు. ఈ పెట్టుబడులతో పరిశ్రమలు ప్రారంభమయ్యాక సుమారు 4లక్షల మందికిపైగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. తాజా పర్యటనలో వందకు పైగా విదేశీ సంస్థల ప్రతినిధులను, పెట్టుబడిదారులను కలుసుకోనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సింగపూర్‌, జపాన్‌ దేశాల్లో పర్యటించనున్నామని, అదే సమయంలో వీలునుబట్టి ఇతర దేశాల్లో పర్యటించే అవకాశాలు కూడా ఉన్నాయని వివరించారు. ఈ పర్యటన తప్పకుండా విజయం సాధిస్తుందని స్టాలిన్‌ ఆశాభావం వ్యక్తం చేశారు.

nani3.2.jpg

హాజరైన మాజీ మంత్రి నాజర్‌

పెరంబూర్‌: పెట్టుబడుల సమీకరణలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ సింగపూర్‌, జపాన్‌ దేశాల్లో తొమ్మిది రోజుల పర్యటనకు మంగళవారం మధ్యాహ్నం నగరం నుంచి విమానంలో బయల్దేరారు. సీఎంకే వీడ్కోలు పలికేందుకు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఉన్నతాధికారులు విమానాశ్రయానికి వచ్చారు. ఇటీవల మంత్రివర్గం నుంచి తొలగించిన మాజీ పాడిపరిశ్రమ శాఖ మంత్రి నాజర్‌ కూడా విమానాశ్రయానికి వచ్చి సీఎంకు వీడ్కోలు పలికారు. ఆ సమయంలో ఆయనతో కొద్దిసేపు మాట్లాడిన సీఎం, భుజం తట్టి పంపించారు.

Updated Date - 2023-05-24T08:16:11+05:30 IST