Share News

Chennai: కోర్టులో తీర్పు వెలువడగానే భోరున విలపించిన మంత్రి సతీమణి.. మంత్రివర్గం నుంచి మరొకరు అవుట్..

ABN , Publish Date - Dec 22 , 2023 | 08:33 AM

ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి(Minister K. Ponmudi)కి మద్రాస్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది.

Chennai: కోర్టులో తీర్పు వెలువడగానే భోరున విలపించిన మంత్రి సతీమణి.. మంత్రివర్గం నుంచి మరొకరు అవుట్..

- పొన్ముడికి మూడేళ్ల శిక్ష విధించిన హైకోర్టు

- మంత్రి, ఎమ్మెల్యే పదవులు కోల్పోయిన పొన్ముడి

- శిక్ష అమలుకు 30 రోజుల గడువు

- ఈలోపు అప్పీలు చేసుకునేందుకు వెసులుబాటు

- కోర్టులో చేతులు జోడించి నిలబడిన పొన్ముడి దంపతులు

- తీర్పు వెలువడగానే భోరున విలపించిన మంత్రి సతీమణి

- పొన్ముడి శాఖలు రాజకన్నప్పన్‌కు బదిలీ

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన అక్రమాస్తుల కేసులో రాష్ట్ర ఉన్నతవిద్యాశాఖ మంత్రి కె.పొన్ముడి(Minister K. Ponmudi)కి మద్రాస్‌ హైకోర్టు షాక్‌ ఇచ్చింది. ఆయనతో పాటు, ఆయన సతీమణి విశాలాక్షికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.50 లక్షల జరిమానా విధిస్తూ సంచలన తీర్పు వెలువరించింది. దీంతో పొన్ముడి ఆటోమేటిగ్గా ఎమ్మెల్యే పదవిని, మంత్రి పదవిని కోల్పోయారు. అదే సమయంలో ముఖ్యమంత్రి స్టాలిన్‌ సిఫారసు మేరకు పొన్ముడి నిర్వహిస్తున్న శాఖలను మంత్రి రాజకన్నప్పన్‌కు అదనంగా అప్పగిస్తున్నట్లు గవర్నర్‌ ఆర్‌ఎన్‌ రవి ఉత్తర్వులు జారీ చేశారు. ఈ అక్రమార్జన కేసుపై విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ జయచంద్రన్‌ రెండురోజుల క్రితమే పొన్ముడి, ఆయన సతీమణిని దోషులుగా ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే శిక్షను మాత్రం 21వ తేదీన ఖరారు చేస్తామని ప్రకటించిన ఆయన.. ఆ మేరకు గురువారం తీర్పు వెలువరించారు. పొన్ముడి, ఆయన సతీమణికి జైలుశిక్ష, జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు.

ఏమిటీ అక్రమార్జన కేసు?

రాష్ట్రంలో 2006 నుంచి 2011 వరకు డీఎంకే ప్రభుత్వ హయాంలో మంత్రిగా పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షి ఆదాయానికి మించి అక్రమార్జన పొందినట్లు 2011లో విల్లుపురం జిల్లా అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) డీఎస్పీ కన్నియప్పన్‌ కేసు నమోదు చేశారు. తొలుత ఆ కేసు విచారణ విల్లుపురం ప్రిన్సిపల్‌ క్రైం కోర్టులో జరిగింది. అటుపిమ్మట 2015లో ఆ కేసు విచారణను విల్లుపురం అవినీతి నిరోధక విభాగం ప్రత్యేక కోర్టుకు బదిలీ చేశారు. ఆ కేసుపై మేజిస్ట్రేట్‌ సుందరమూర్తి విచారణ జరిపారు. పొన్ముడి, ఆయన భార్య కలిసి ఆదాయానికి మించి రూ.1.36 కోట్ల మేరకు అక్రమార్జనకు పాల్పడినట్లు ఏసీబీ ఛార్జిషీటులో ఆరోపించారు. ఈ కేసు విచారణ సందర్భంగా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కొంతమంది ఉన్నతాధికారులుసహా మొత్తం 39 మంది సాక్ష్యం చెప్పారు. పొన్ముడిపై అభియోగాలకు సంబంధించిన ఆధారాలను కూడా సమర్పించారు. పొన్ముడి తరఫు న్యాయవాదులు ఆ ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తూ తమ వాదనలు వినిపించారు. ఇరుపక్షాల వాదప్రతివాదనల అనంతరం పొన్ముడి, ఆయన భార్యపై మోపిన అభియోగాలకు తగు ఆధారాలు లేవని పేర్కొంటూ మేజిస్ట్రేట్‌ సుందరమూర్తి ఇరువురిని నిర్దోషులుగా ప్రకటించారు. ఆ తీర్పును వ్యతిరేకిస్తూ ఏసీబీ అధికారులు హైకోర్టులో అప్పీలు చేశారు. ఆ అప్పీలుపై గతంలో విచారణ జరిపిన హైకోర్టు న్యాయమూర్తి జయచంద్రన్‌ తీర్పును వాయిదా వేశారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం ఆయన పాక్షికమైన తీర్పు వెలువరించారు. పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షి తదితరులు నాలుగేళ్లపాటు ఆదాయపన్నుల శాఖకు సమర్పించిన లెక్కల ఆధారంగా దిగువ కోర్టు వారిని నిరోఽ్దషులుగా విడుదల చేయడం గర్హనీయమని పేర్కొన్నారు. ఐటీ రిటర్న్స్‌ వివరాల ప్రకారం ఎవరినీ క్రిమినల్‌ కేసు నుంచి విడుదల చేసే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. అంతేకాకుండా 2006 నుంచి 2011 వరకు పొన్ముడి మంత్రిగా ఆదాయానికి మించి ఆస్తులు సంపాదించినట్లు కేసు నమోదు చేశారని, అదే సమయంలో అక్రమార్జనకు ఆయన భార్య కూడా సహకరించినట్లు స్పష్టమవుతోందని, ఆమె పేరుతోనూ కొన్ని ఆస్తులు కొనుగోలు చేయడంతో ఆమె కూడా నేరస్థురాలేనని ప్రకటించారు. పొన్ముడి, ఆయన భార్య విశాలాక్షి ఆదాయానికి మించి64.90శాతం వరకు ఆస్తులు కూడబెట్టినట్లు తగిన ఆధారాలు ఉండడంతో ఆ ఇరువురిని విడుదల చేస్తూ దిగువ (ఏసీబీ ప్రత్యేక) కోర్టు వెలువరించిన తీర్పును రద్దు చేస్తున్నామని, ఇద్దరినీ దోషులుగానే పరిగణిస్తున్నామన్నారు. పొన్ముడి, ఆయన భార్యకు శిక్ష ఖరారు చేయాల్సివున్నందున గురువారం ఆ ఇద్దరూ తన ఎదుట హాజరుకావాలని ఆదేశించారు. ఒకవేళ స్వయంగా హాజరయ్యేందుకు వీలుకాకుంటే, ఆన్‌లైన్‌ లేదా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా హాజరుకావచ్చని న్యాయమూర్తి పేర్కొన్నారు.

nani4.jpg

అప్పటి నుంచే విధులకు దూరం

గత మంగళవారం న్యాయమూర్తి తనను దోషిగా ధ్రువీకరించినప్పటి నుంచే మంత్రి పొన్ముడి తన విధులకు, ప్రభుత్వ కార్యాలయాలకు దూరంగా ఉన్నారు. ప్రభుత్వమిచ్చిన కారులో త్రివర్ణపతాకాన్ని తొలగించేశారు. ఈ నేపథ్యంలో గురువారం ఉదయం సైదాపేటలోని తన స్వగృహం నుంచి పొన్ముడి, ఆయన సతీమణి విశాలాక్షి కారులో బయలుదేరి పదిగంటలకల్లా హైకోర్టు ప్రాంగణానికి చేరుకున్నారు. ఇరువురూ న్యాయమూర్తి జయచంద్రన్‌ ఎదుట హాజరయ్యారు. తుది తీర్పు వెలువడడానికి ముందు పొన్ముడి దంపతుల వయసును, ఆరోగ్య పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని శిక్ష విధించాలని వారి తరఫు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. ఆ తర్వాత న్యాయమూర్తి జయచంద్రన్‌ పొన్ముడి, ఆయన భార్యకు మూడేళ్ల జైలు శిక్ష, రూ.50లక్షల జరిమానా విధిస్తున్నట్లు 85 పేజీల తీర్పులో ప్రకటించారు. అదే సమయంలో ఈ కేసుపై పొన్ముడి అప్పీలుకు వెళ్లేందుకు వెసులుబాటు కల్పిస్తూ 30 రోజుల పాటు శిక్ష అమలును నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు. నెలరోజుల్లోపున ఉన్నత న్యాయస్థానం వారికి సానుకూలమైన తీర్పు వెలువరించకపోయినట్లయితే పొన్ముడి, ఆయన సతీమణి విల్లుపురంలోని ఏసీబీ ప్రత్యేక కోర్టులో లొంగిపోవాలని ఆదేశించారు. ఇదిలా వుండగా ఆ తీర్పు వెలువడిన మరుక్షణమే పొన్ముడి ప్రజాప్రాతినిధ్య చట్టం ప్రకారం శాసన సభ్యత్వం, మంత్రి పదవిని కోల్పోయారు. ఇప్పటికే సెంథిల్‌ బాలాజీ ఈడీ కేసుల్లో ఇరుక్కుని శాఖలేని మంత్రిగా జైలు జీవితం గడుపుతుండగా, ఇప్పుడు తాజాగా పొన్ముడికి కూడా న్యాయస్థానం శిక్ష విధించడంతో డీఎంకే వర్గాలు దిగ్ర్భాంతిలో పడిపోయాయి.

తొమ్మిదేళ్లు ఎన్నికలకు దూరం?

ఈ తీర్పుపై పొన్ముడి ఉన్నతన్యాయస్థానంలో అప్పీలు చేసుకోవడానికి వీలుగా హైకోర్టు న్యాయమూర్తి శిక్ష అమలును నెలరోజులపాటు నిలిపి ఉంచుతూ ఆదేశాలిచ్చారు. ప్రజాప్రాతినిధ్యం చట్టం 8(1)ప్రకారం రెండేళ్లకుపైగా జైలు శిక్షపడితే ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుండదు. పొన్ముడికి మూడేళ్ల జైలు శిక్షపడడంతో ఆయన తొమ్మిదేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలులేదని న్యాయనిపుణులు చెబుతున్నారు.

త్వరలోనే మరికొంతమంది మంత్రులు అరెస్టు: ఈపీఎస్‌

అక్రమార్జన కేసులో మంత్రి పొన్ముడికి జైలుశిక్ష విధించటంపై అన్నాడీఎంకే ప్రధానకార్యదర్శి, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి స్పందించారు. త్వరలో మరికొంతమంది మంత్రులు అవినీతి కేసుల్లో అరెస్టు కావడం ఖాయమని అన్నారు. కృష్ణగిరిలో గురువారం ఉదయం ఆయన విలేఖరులతో మాట్లాడుతూ గత రెండున్నర సంవత్సరాలుగా డీఎంకే మంత్రులు అవినీతి అక్రమాలకు పాల్పడటం మినహా ప్రజల కోసం చేసిందేమీలేదని అన్నారు. త్వరలో మరికొంత మంది అవినీతిమంత్రులు కూడా అరెస్టవుతారని, ఈ సారి ఇండియా కూటమి సమావేశం జరుగుతుందా అనేదే అనుమానాస్పదమని ఈపీఎస్‌ యెద్దేవా చేశారు.

న్యాయం గెలిచింది : డి. జయకుమార్‌

అధికారబలంతో సాక్షులను బెదిరించి, మేజిస్ట్రేట్‌లపై తీవ్ర ఒత్తిడి చేసి అక్రమార్జన కేసు నుండి బయటపడిన మంత్రి పొన్ముడి, ఆయన సతీమణికి హైకోర్టు మూడేళ్ల జైలు శిక్ష విధించడంతో న్యాయం గెలిచినట్లయ్యిందని అన్నాడీఎంకే సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి డి.జయకుమార్‌ వ్యాఖ్యానించారు. మంత్రి సెంథిల్‌బాలాజీ తర్వాత మంత్రి పొన్ముడికి కూడా జైలు శిక్ష పడిందని, ఈ వరుసలో మరికొంతమంది డీఎంకే మంత్రులు కూడా అరెస్టవుతారని చెప్పారు. అవినీతికి డీఎంకే పెట్టింది పేరని, అవినీతి కారణంగా రద్దయిన ప్రభుత్వం డీఎంకే ప్రభుత్వమేనని ఆయన విమర్శించారు.

అవినీతి రహిత సమాజానికి తొలిమెట్టు : అన్నామలై

అక్రమార్జన కేసులో మంత్రి పొన్ముడికి జైలు శిక్ష విధిస్తూ హైకోర్టు వెలువరించిన సంచలనాత్మకమైన తీర్పు అవినీతి రహిత సమాజ రూపకల్పనకు తొలిమెట్టు లాంటిదని బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు అన్నామలై వ్యాఖ్యానించారు. ఇప్పటికే మంత్రి సెంథిల్‌ బాలాజీ అరెస్టయి సెంట్రల్‌ జైలులో ఉన్నారని, తాజాగా మంత్రి పొన్ముడి కూడా జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారని, ఈ వరుసలో మరికొంతమంది అవినీతి మంత్రులు కూడా ఉన్నారని తెలిపారు. ఇది అంతం కాదని, ఆరంభం మాత్రమేనని, వచ్చేయేడాది అవినీతి కేసుల్లో అరెస్టు కానున్న డీఎంకే మంత్రులకు సెంట్రల్‌ జైలులో ప్రత్యేక సెల్‌ ఏర్పాటు చేసే అవకాశం ఉందని అన్నామలై యెద్దేవా చేశారు. ఈ తీర్పు డీఎంకే రాజకీయ పునాదులనే కదిలించే తీర్పు అని ఆయన పేర్కొన్నారు.

చేతులు జోడించి నిలబడిన మంత్రి

న్యాయమూర్తి తీర్పు వెలువరిస్తున్న సమయంలో న్యాయస్థానంలో పొన్ముడి రెండు చేతులు జోడించి నిలబడ్డారు. అదే సమయంలో ఆయన సతీమణి విశాలాక్షి కంటతడి పెడుతూ తల్లడిల్లిపోయారు. తీర్పు వెలువడిన అనంతరం ఆమె బోరున విలపిస్తూ బయటకు వచ్చారు. దీంతో పొన్ముడి సన్నిహితులు, వారి న్యాయవాదులు కూడా తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు.

2న సుప్రీంకోర్టులో అప్పీలు

అక్రమార్జన కేసులో తనకు మూడేళ్ల జైలు విధిస్తూ హైకోర్టు జారీ చేసిన తీర్పును వ్యతిరేకిస్తూ పొన్ముడి వచ్చే యేడాది జనవరి 2వ తేదీన సుప్రీంకోర్టులో అప్పీలు పిటిషన్‌ దాఖలు చేయనున్నారు. ఆ మేరకు గురువారం మధ్యాహ్నం ఆయన తన నివాసగృహంలో సీనియర్‌ న్యాయవాదులతో చర్చించి, నిర్ణయం తీసుకున్నారు.

అక్రమార్జన కేసులో పొన్ముడికి శిక్షపడటం ఖాయమని ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ గ్రహించి అందుకు తగిన ముందస్తు ఏర్పాట్లు సిద్ధం చేసి తూత్తుకుడిలో వరద బాధిత ప్రాంతాలను పరిశీలించేందుకు వెళ్లారు. హైకోర్టు తీర్పు వెలువడిన తర్వాత పొన్ముడి శాసనసభ్యత్వాన్ని, మంత్రి పదవిని కోల్పోతారని భావించే ఆయన నిర్వర్తిస్తున్న శాఖలను ఏ మంత్రికి అప్పగించాలనే

విషయంపై కూడా ముందుగానే నిర్ణయం తీసుకున్నారు. తీర్పు వెలువడిన వెంటనే పొన్ముడి నిర్వర్తిస్తున్న శాఖలను పాఠశాల విద్యాశాఖ మంత్రి అన్బిల్‌ మహే్‌షపొయ్యామొళికి అప్పగించనున్నట్లు పుకార్లు వ్యాపించాయి. అయితే పొన్ముడి శాఖలను మంత్రి రాజకన్నప్పన్‌కు బదిలీ చేస్తూ ముఖ్యమంత్రి గవర్నర్‌కు సిఫారసు చేయగా, దానిని ఆయన ఆమోదించి, వెంటనే ఉత్తర్వులు జారీ చేశారు.

Updated Date - Dec 22 , 2023 | 08:33 AM