Chennai: ఒకటికాదు.. రెండుకాదు.. రూ.వెయ్యి కోట్ల భూమి స్వాధీనం
ABN , First Publish Date - 2023-06-07T13:36:01+05:30 IST
సుప్రీంకోర్టు తీర్పుతో చెన్నై(Chennai) నడిబొడ్డున జెమిని వంతెనకు సమీపంలోని సెమ్మొళిపార్కు వద్ద రూ.వెయ్యి కోట్ల భూమిని ప్రభుత్వం స్వా
అడయార్(చెన్నై): సుప్రీంకోర్టు తీర్పుతో చెన్నై(Chennai) నడిబొడ్డున జెమిని వంతెనకు సమీపంలోని సెమ్మొళిపార్కు వద్ద రూ.వెయ్యి కోట్ల భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది. ఈ స్థలం ఇప్పటివరకు అన్నాడీఎంకేకు చెందిన ప్రముఖ నేత ఆధీనంలో ఉండేది. జెమిని వంతెనకు సమీపంలో కెథడ్రల్ సాలై అనుకుని ప్రభుత్వానికి సొంతమైన స్థలాన్ని అన్నాడీఎంకే(AIADMK) ప్రముఖుడు వి.కృష్ణమూర్తి హార్టికల్చర్ సంఘం అనే పేరుతో సంస్థను ఏర్పాటు చేసి, తన ఆఽధీనంలోకి తీసుకున్నారు. ఈ స్థలాన్ని స్వాధీనం చేసుకునేందుకు ప్రభుత్వం 1989లో మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, సర్కారుకు అనుకూలంగా తీర్పు వచ్చింది. అయితే, ఈ స్థలంలో 20 యేళ్ళ లీజుకు ప్రాతిపదిక డ్రైవ్ ఇన్ హోటల్ ఉండేది. ఇది మొత్తం 20 ఎకరాల స్థలంలో ఉండగా, దీన్ని ప్రభుత్వం స్వాధీనం చేసుకుని సెమ్మొళి పార్కును అభివృద్ధి చేసింది. ఈ పార్కుకు ఎదురుగా ఉన్న సుమారు వెయ్యి కోట్ల రూపాయల స్థలాన్ని మాత్రం కృష్ణమూర్తి ఆధీనంలోనే ఉంచుకుని, హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై పలు దఫాలుగా విచారణ జరిపిన సుప్రీంకోర్టు ప్రభుత్వానికి అనుకూలంగా ఇటీవల తీర్పునిచ్చింది. దీంతో ఈ స్థలాన్ని ప్రభుత్వం తన ఆధీనంలోకి తీసుకుంది. ఈ చర్యను నగరవాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.