Share News

iPhone Hacking Alert: హ్యాకింగ్ అలర్ట్ వివాదం.. యాపిల్ సంస్థకు మంత్రిత్వ శాఖ నోటీసులు.. అందుకు రుజువులున్నాయా?

ABN , First Publish Date - 2023-11-02T17:28:10+05:30 IST

‘ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్’ దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. మంగళవారం నాడు ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా ఇతర విపక్ష నేతల...

iPhone Hacking Alert: హ్యాకింగ్ అలర్ట్ వివాదం.. యాపిల్ సంస్థకు మంత్రిత్వ శాఖ నోటీసులు.. అందుకు రుజువులున్నాయా?

‘ఐఫోన్ హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్’ దేశ రాజకీయాల్లో ఎంత దుమారం రేపిందో అందరికీ తెలుసు. మంగళవారం నాడు ఎంపీ శశిథరూర్, తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మోయిత్రా, ఏఐఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ సహా ఇతర విపక్ష నేతల ఐఫోన్‌లకు ఈ హ్యాకింగ్ అలర్ట్ వచ్చింది. దీంతో.. ‘స్టేట్-స్పాన్సర్డ్’ హ్యాకర్లతో కేంద్ర ప్రభుత్వం తమ ఫోన్లను హ్యాక్ చేసేందుకు ప్రయత్నిస్తోందని సంచలన ఆరోపణలు చేశారు. అయితే, ఇది తప్పుడు నోటిఫికేషన్ అని యాపిల్ సంస్థ వివరణ ఇవ్వడంతో, వివాదం కాస్త సద్దుమణిగింది. కానీ.. కేంద్రం మాత్రం దీనిపై ఇంకా సీరియస్‌గానే ఉంది. ఈ హ్యాకింగ్ అలర్ట్ దేశ రాజకీయాల్లో అల్లకల్లోలం సృష్టించడంతో.. ఐఫోన్‌ని కేంద్రం నిలదీస్తోంది.


ఈ నేపథ్యంలోనే తాజాగా ఎలక్ట్రానిక్స్ & ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ గురువారం ఆపిల్‌ సంస్థకు నోటీసులు పంపించింది. స్టేట్ స్పాన్సర్డ్ హ్యాకర్స్ ద్వారా హ్యాకింగ్‌కు ప్రయత్నిస్తున్నారని ధృవీకరించేందుకు ఏమైనా ఆధారాలుంటే, వాటిని సమర్పించాలని ఆ నోటిసుల్లో పేర్కొంది. దీనిపై వెంటనే స్పందించాల్సిందిగా ఆదేశాలు జారీ చేసింది. ఈ నోటిసుల విషయాన్ని కేంద్ర ఐటీ వాఖ కార్యదర్శి ఎస్. కృష్ణన్ కన్ఫమ్ చేశారు. మరోవైపు.. విపక్ష నేతల హ్యాకింగ్ ఆరోపణలపై భారత ప్రభుత్వం సైబర్ సెక్యూరిటీ ఏజెన్సీ ‘కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్సెస్ టీమ్ ఆఫ్ ఇండియా’ (సెర్ట్-ఇన్) విచారణ జరుపుతోందని తెలిపారు. మరి.. ఈ నోటీసులపై యాపిల్ స్పందన ఎలా ఉంటుందో చూడాలి. ఇంతకుముందు హ్యాకింగ్ అలర్ట్ నోటిఫికేషన్‌పై స్పందించినప్పుడు.. ఆ అలర్ట్ ఎందుకొచ్చిందో చెప్పలేమని, అది బయటపెడితే హ్యాకర్లను నిరోధించలేమని చెప్పుకొచ్చింది.

Updated Date - 2023-11-02T17:28:11+05:30 IST