By-election result: నేడే ఉప ఎన్నిక ఫలితం

ABN , First Publish Date - 2023-03-02T07:50:04+05:30 IST

ఈరోడ్‌ తూర్పు(Erode East) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఈరోడ్‌ సిత్తేరి ప్రాంతంలోని ఐఆర్‌టీటీ ఇంజనీరింగ్‌

By-election result: నేడే ఉప ఎన్నిక ఫలితం

- ఈరోడ్ తూర్పు విజేత ఎవరో?

- పటిష్ఠ బందోబస్తు

చెన్నై, (ఆంధ్రజ్యోతి): ఈరోడ్‌ తూర్పు(Erode East) అసెంబ్లీ నియోజకవర్గ ఉప ఎన్నిక ఫలితాలు బుధవారం వెలువడనున్నాయి. ఈరోడ్‌ సిత్తేరి ప్రాంతంలోని ఐఆర్‌టీటీ ఇంజనీరింగ్‌ కళాశాలలో ఏర్పాటైన కౌంటింగ్‌ కేంద్రంలో ఓట్లను లెక్కించనున్నారు. భారీ భద్రతా ఏర్పాట్ల నడుమ ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కృష్ణన్‌ ఉన్ని, ఎన్నికల నిర్వహణ అధికారి, ఈరోడ్‌ కార్పొరేషన్‌ కమిషనర్‌ శివకుమార్‌ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. మంగళవారం ఉదయం వీరిరువురూ ఈవీఎంలను భద్రపరచిన స్ర్టాంగ్‌ రూంను, ఓట్ల లెక్కింపు ప్రాంతాన్ని ఆ రెండు ప్రాంతాల వద్ద ఏర్పాటు చేసిన భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ కృష్ణన్‌ ఉన్ని మాట్లాడుతూ... బుధవారం ఉదయం 8 గంటలకు ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కోసం స్ర్టాంగ్‌ రూమ్‌లకు చేరువగానే రెండు ప్రాంతాల్లో 16 బల్లలపై ఈవీఎంలను ఉంచి, అభ్యర్థులు, వారి కౌంటింగ్‌ ఏజెంట్లు, ఎన్నికల సిబ్బంది సమక్షంలో వాటిని తెరిచి, లెక్కించనున్నట్లు తెలిపారు. 15 రౌండ్లుగా ఈ ఓట్ల లెక్కింపు కొనసాగుతుందన్నారు. ఉదయం 11 గంటల లోపే ఎన్నికల ఫలితం వెలువడే అవకాశం ఉందన్నారు. ఈవీఎంలలోని ఓట్లను లెక్కించడానికి ముందు తపాలా బ్యాలెట్లను లెక్కిస్తామన్నారు. తపాలా బ్యాలెట్ల లెక్కింపు పూర్తయిన అరగంటకు ఈవీఎం(EVM)లో నమోదైన ఓట్ల లెక్కింపు ప్రారంభమవుతుం దన్నారు. ఓట్ల లెక్కింపు ప్రాంతాలకు నలువైపులా సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామని, మూడంచెల భద్రత నడుమ లెక్కింపు జరుగుతుందన్నారు. ఫిబ్రవరి 27న జరిగిన ఈ నియోజకవర్గ ఉపఎన్నికలో డీఎంకే సెక్యులర్‌ కూటమి తరఫున కాంగ్రెస్‌ అభ్యర్థిగా టీఎన్‌సీసీ మాజీ అధ్యక్షుడు ఈవీకేఎస్‌ ఇళంగోవన్‌, అన్నాడీఎంకే తరఫున తెన్నరసు, డీఎండీకే అభ్యర్థిగా ఆనంద్‌, నామ్‌తమిళర్‌ కట్చి తరఫున మేఘన నవనీతన్‌ సహా మొత్తం 77 మంది అభ్యర్థులు పోటీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఎన్నికలకు అభ్యర్థుల సంఖ్య అధికంగా ఉండటంతో ఐదు ఎలక్ర్టానిక్‌ ఓటింగ్‌ యంత్రాలను ఉపయోగించారు. ఈ నియోజకవర్గానికి 2021లో జరిగిన ఎన్నికల్లో 66.23 శాతం ఓట్లు నమోదు కాగా, తాజా ఉప ఎన్నికలో పోలింగ్‌ శాతం 74.79 శాతానికి పెరిగింది.

Updated Date - 2023-03-02T07:50:04+05:30 IST