Budget 2023-24: గంపెడాశలు

ABN , First Publish Date - 2023-02-01T02:49:13+05:30 IST

పన్ను భారం తగ్గే అవకాశాలపై వేతనజీవుల ఆశలు ఓవైపు.. తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న ద్రవ్యోల్బణం, ముంచుకొస్తున్న మాంద్యం ముప్పు మరోవైపు!

Budget 2023-24: గంపెడాశలు

నేడు పార్లమెంటులో 2023-24 బడ్జెట్‌

ప్రవేశపెట్టనున్న ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌

ఎన్డీయే-2 సర్కారు చివరి, పూర్తిస్థాయి బడ్జెట్‌ ఇదే

ఆదాయ పన్నుభారం తగ్గింపుపై వేతనజీవుల ఆశలు

గ్రామీణ ఆర్థిక వ్యవస్థ, విద్య, ఆరోగ్య సంరక్షణ,

ఉద్యోగాలు కల్పించే రంగాలపైనే కేంద్రం దృష్టి!

న్యూఢిల్లీ, జనవరి 31: పన్ను భారం తగ్గే అవకాశాలపై వేతనజీవుల ఆశలు ఓవైపు.. తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్న ద్రవ్యోల్బణం, ముంచుకొస్తున్న మాంద్యం ముప్పు మరోవైపు! ఈ పరస్పర విరుద్ధమైన పరిస్థితుల నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం లోక్‌సభలో బడ్జెట్‌ 2023-24ను ప్రవేశపెట్టబోతున్నారు. 2019లో వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చిన మోదీ సర్కారు పెట్టబోతున్న ఆఖరు బడ్జెట్‌ ఇదే! వచ్చే ఏడాది ఎన్నికల సంవత్సరం. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టి ఎన్నికలకు వెళ్లాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో.. ఈసారి పన్నుమోత నుంచి కొంతైనా ఉపశమనం దొరుకుతుందని సామాన్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా ఆదాయపన్ను పరిమితి పెంపు, కొన్నిరకాల వస్తు, సేవల పన్ను శాతాల తగ్గింపు వంటివాటిని నిర్మల ప్రకటిస్తారని, తమకు ఊరట కలిగిస్తారని బీజేపీకి అత్యంత కీలకమైన ఓటుబ్యాంకుగా ఉన్న మధ్య, ఎగువ మధ్యతరగతి ప్రజలు ఎదురుచూస్తున్నారు. అలాగే, గ్రామీణ ఉపాధి హామీ పథకం తదితర పథకాల ద్వారా చేసే వ్యయాన్ని పెంచాలని పేదలు కోరుకుంటున్నారు. వారి ఆశలు, ఆకాంక్షలకు ప్రాధాన్యం ఇస్తూనే.. ఆర్థిక క్రమశిక్షణ కట్టుతప్పని విధంగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం నిర్మలా సీతారామన్‌కు కత్తి మీద సామేనని చెప్పొచ్చు. ఈసారి బడ్జెట్‌కు మరో ప్రత్యేకత కూడా ఉంది.

1nirmala1.jpg

ప్రపంచాన్ని కుదిపేసిన కరోనా మహమ్మారి శాంతించాక.. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధం నేపథ్యంలో ప్రపంచవ్యాప్తంగా ఏర్పడిన భౌగోళిక రాజకీయ పరిణామాల నడుమ పెడుతున్న తొలి బడ్జెట్‌ ఇది. ఈసారి బడ్జెట్‌లో ఆరోగ్య సంరక్షణ, విద్య, గ్రామీణ ఆర్థికవ్యవస్థపైన, ఉద్యోగాలు ఎక్కువగా కల్పించే రంగాలపైన, మరీ ముఖ్యంగా చిన్నవ్యాపారాలపైన కేంద్రం ఎక్కువగా దృష్టి సారించే అవకాశం ఉందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. అలాగే.. గత అనుభవాల ఆధారంగా చూస్తే, చాలామంది ప్రజలు ఆశిస్తున్నట్టు మోదీ సర్కారు ఈసారి బడ్జెట్‌లో ప్రజాకర్షక నిర్ణయాలేవీ ప్రకటించకపోవచ్చని వారు అంచనా వేస్తున్నారు. మధ్యతరగతి ప్రజలపై ఒత్తిడుల గురించి తనకు తెలుసని నిర్మలా సీతారామన్‌ ఇటీవలే వ్యాఖ్యానించినందున పన్ను చెల్లింపుదారులకు కాస్తంతైనా ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు ఆమె తీసుకోవచ్చని మరికొందరు ఆర్థిక నిపుణులు పేర్కొంటున్నారు.

ఉద్యోగాల కల్పన భారం..

భారతదేశంలో నిరుద్యోగ రేటు 2022 డిసెంబరులో 16 నెలల గరిష్ఠానికి (8.3ు) చేరింది. ఇది ప్రభుత్వానికి సవాల్‌గా మారిందని.. కాబట్టి ఈసారి బడ్జెట్‌లో మోదీ సర్కారు గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపు పెంచే అవకాశం ఉందని డీబీఎస్‌ గ్రూపు ఆర్థికవేత్త రాధికారావు అభిప్రాయపడ్డారు. అలాగే పంట బీమా, గ్రామీణ రహదారులు, తక్కువ వ్యయంలో గృహనిర్మాణం వంటివాటిపైనా దృష్టిసారించే అవకాశం ఉందని పేర్కొన్నారు.

గత బడ్జెట్‌ అంచనాలు.. వాస్తవాలు

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ బుధవారం పార్లమెంటులో బడ్జెట్‌ను ప్రవేశపెట్టబోతున్న నేపథ్యంలో.. గత బడ్జెట్‌ అంచనాలు, వాస్తవ పరిస్థితిని పరిశీలిస్తే..

2022-23 ఆర్థిక సంవత్సరంలో భారతదేశ ఆర్థికాభివృద్ధి 9.2 శాతంగా ఉండబోతోందని గత బడ్జెట్‌లో నిర్మల అంచనా వేశారు. కానీ, ఆర్థిక మాంద్యం, ఉక్రెయిన్‌ యుద్ధ నేపథ్యంలో నెలకొన్న చమురు సంక్షోభం కారణంగా రిజర్వు బ్యాంకు గత డిసెంబరులో ఆ అంచనాను 6.8గా సవరించింది. ఆర్థిక మంత్రి వేసిన అంచనాతో పోలిస్తే అది తక్కువే అయినప్పటికీ.. అంతర్జాతీయ సగటుతో పోలిస్తే భారతదేశ ఆర్థిక వృద్ధి మెరుగ్గానే ఉందని ఐఎంఎఫ్‌ ఎండీ క్రిస్టలీనా జార్జియేవా అన్నారు.

ఆవాస్‌ యోజన కింద 2022-23లో దేశవ్యాప్తంగా గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో 80 లక్షల గృహాలు నిర్మించాలని 2022-23 బడ్జెట్‌లో లక్ష్యంగా పెట్టుకున్నారు. కానీ, నిర్మించినవి 40 లక్షలలోపు ఇళ్లే.

2022-23లో 3.8 కోట్ల ఇళ్లకు కుళాయిల ద్వారా తాగునీటి కల్పనకు బడ్జెట్‌లో రూ.600 కోట్లు ప్రతిపాదించారు. కానీ, వాస్తవంలో 1.7 కోట్ల ఇళ్లకే కుళాయి నీరు అందుబాటులోకి వచ్చింది.

Updated Date - 2023-02-01T08:39:15+05:30 IST