Karnataka Results: పనిచేయని బజరంగ్‌దళ్‌ అస్త్రం

ABN , First Publish Date - 2023-05-13T19:43:06+05:30 IST

శాసనసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ (Bajrang Dal)ను నిషేధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రస్తావించడాన్ని బీజేపీ ప్రధానాస్త్రంగా మార్చుకుంది.

Karnataka Results: పనిచేయని బజరంగ్‌దళ్‌ అస్త్రం

బెంగళూరు: శాసనసభ ఎన్నికల్లో తాము అధికారంలోకి వస్తే బజరంగ్‌దళ్‌ (Bajrang Dal)ను నిషేధిస్తామని కాంగ్రెస్‌ పార్టీ తన మేనిఫెస్టోలో ప్రస్తావించడాన్ని బీజేపీ ప్రధానాస్త్రంగా మార్చుకుంది. అయినా ప్రయోజనం లేకుండా పోయింది. పోలింగ్‌ రోజున ‘జై బజరంగ్‌బళి’ నినాదాలతో మీట నొక్కాలని ప్రధాని మోదీ స్వయంగా ఎన్నికల బహిరంగసభల్లో ఓటర్లకు పిలుపునిచ్చారు. దాదాపు వారం పాటు బజరంగ్‌దళ్‌ అంశంపైనే బీజేపీ (BJP) తీవ్రస్థాయిలో ప్రచారం చేసి, ఒకదశలో కాంగ్రెస్‌కు హడలు పుట్టించింది. నిషేధిత పీఎఫ్‌ఐ చేతిలో కాంగ్రెస్‌ కీలుబొమ్మగా మారిందని బీజేపీ ఆరోపించింది. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రంలో అరాచకపాలన ఖాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్‌షా (Union Home Minister Amit Shah) ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రచారం సమయంలో ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ (Uttar Pradesh CM Yogi Adityanath) మరో అడుగు ముందుకు వచ్చి అయోధ్యరాముడి రాజ్యంలో బీజేపీకి ప్రజలు అధికారం కట్టబెట్టారని, ఇప్పుడు హనుమంతుడి జన్మప్రదేశం అంజనాద్రి కొండల ప్రాంతమైన కర్ణాటకలో బీజేపీకి పట్టం కట్టబెట్టాలని పిలుపునిచ్చారు.

బజరంగ్‌దళ్‌కు, భగవాన్‌ హనుమంతుడిని పోలుస్తూ బీజేపీ చేపట్టిన సెంటిమెంట్‌ ఎక్కడ కొంప ముంచుతుందోనని భయపడ్డ కాంగ్రెస్‌ నేతలు, చివరికి బజరంగ్‌దళ్‌ నిషేధ విషయంలో వెనకడుగు వేశారు. ఆ తరువాత హనుమాన్‌ ఆలయాల ప్రదక్షిణ చేపట్టారు. కాంగ్రెస్‌ అధికారం చేపడితే వాడవాడలా హనుమంతుడి ఆలయాలు నిర్మిస్తామని భరోసా ఇచ్చారు. అయితే బీజేపీ మాత్రం హనుమాన్‌ చాలీసా పఠిస్తూ ఎన్నికల వాతావరణాన్ని బాగా వేడెక్కించింది. ఆశ్చర్యకరంగా శనివారం వెలువడిన ఫలితాల్లో బజరంగ్‌దళ్‌కు గట్టి పట్టు ఉన్న చిక్కమగళూరు, కొడగు జిల్లాల్లో బీజేపీ ఘోర పరాజయం మూటగట్టుకుంది. కోస్తా జిల్లాల్లోనూ బజరంగ్‌దళ్‌ అంశం బీజేపీకి ఏమాత్రం లబ్ధి చేకూర్చలేకపోయింది. ఒకప్పటి బజరంగదళ నేత, ప్రస్తుతం బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎమ్మెల్యే సీటీ రవి కూడా ఓడిపోవడం కొసమెరుపు.

Updated Date - 2023-05-13T19:43:06+05:30 IST