Bihar Teacher Kidnap: బిహార్‌లో వింత పెళ్లి.. మొదట టీచర్‌ని కిడ్నాప్ చేసి, ఆ తర్వాత తుపాకీతో బెదిరించి..
ABN , First Publish Date - 2023-12-01T16:27:45+05:30 IST
సాధారణంగా కిడ్నాప్ కథల్లో ఎక్కువగా మహిళలే బాధితులుగా ఉంటారు. కానీ.. బిహార్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. పురుషులనే కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లిళ్లు చేస్తారు. దీనిని అక్కడ ‘పకడ్వా వివాహ్’ అని అంటారు. మన భాషలో చెప్పుకోవాలంటే..
Bihar Pakadwa Vivah: సాధారణంగా కిడ్నాప్ కథల్లో ఎక్కువగా మహిళలే బాధితులుగా ఉంటారు. కానీ.. బిహార్‌లో మాత్రం అందుకు పూర్తి భిన్నం. పురుషులనే కిడ్నాప్ చేసి, బలవంతంగా పెళ్లిళ్లు చేస్తారు. దీనిని అక్కడ ‘పకడ్వా వివాహ్’ అని అంటారు. మన భాషలో చెప్పుకోవాలంటే.. పెళ్లి కాని అబ్బాయిలను టార్గెట్ చేసుకొని, అతనికి ఇష్టం లేకపోయినా బలవంతంగా ఎత్తుకెళ్లి, కిడ్నాపర్లు తమ అమ్మాయితో పెళ్లి జరిపిస్తారు. ఇప్పుడు ఇలాంటి సంఘటనే మరొకటి వెలుగు చూసింది. ఒక కిడ్నాపర్ ఓ స్కూల్ టీచర్‌ని కిడ్నాప్ చేసి, బలవంతంగా తన కూతురితో వివాహం జరిపించాడు. ఈ ఘటన బిహార్‌లోని వైశాలి జిల్లాలో చోటు చేసుకుంది.
ఆ వివరాల్లోకి వెళ్తే.. గౌతమ్ కుమార్ అనే యువకుడు ఇటీవల బిహార్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ పరీక్షల్ని పూర్తి చేసి.. ఉపాధ్యాయుడిగా ఉద్యోగం సంపాదించాడు. పటేపూర్‌లోని రేపురాలో ఉన్న ఉత్ర్కమిత్ మధ్య విద్యాలయలో టీచర్‌గా అతడు అపాయింట్ అయ్యాడు. అయితే.. బుధవారం నలుగురు వ్యక్తులు ఒక్కసారిగా స్కూల్ వద్ద ఊడిపడి, అతడ్ని కిడ్నాప్ చేశారు. 24 గంటల్లోపే.. కిడ్నాపర్లలో ఒకరి కుమార్తెతో గన్ పాయింట్ వద్ద బలవంతంగా పెళ్లి జరిపించారు. మరోవైపు.. పోలీసులు రంగంలోకి దిగి గాలింపు చర్యలు చేపట్టలోపే, గౌతమ్ కుటుంబ సభ్యులు బుధవారం రాత్రి రోడ్డును దిగ్బంధించి నిరసన వ్యక్తం చేశారు. రాజేష్ రాయ్ అనే వ్యక్తి ఈ కిడ్నాప్‌కు పాల్పడ్డాడని, తన కుమార్తె చాందినితో గౌతమ్ వివాహం బలవంతంగా జరిపించాడని వాళ్లు ఆరోపించారు.
అటు.. చాందినిని పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన గౌతమ్ కుమార్‌ని చితకబాదినట్టు తెలిసింది. అతడ్ని తీవ్రంగా కొట్టి, ఈ పెళ్లికి ఒప్పించినట్టు వెల్లడైంది. ఈ నేపథ్యంలోనే.. నవాడా ఆర్మీమాన్, లఖిసరాయ్ మహిళ మధ్య జరిగిన పదేళ్ల బలవంతపు వివాహాన్ని రద్దు చేస్తూ ఇటీవల పాట్నా హైకోర్టు ఇచ్చిన ఒక తీర్పుని గౌతమ్ కుమార్ ప్రస్తావించినట్టు పోలిసులు తెలిపారు. ఈ కిడ్నాప్ ఘటనపై తాము కేసు నమోదు చేశామని, కిడ్నాపర్లపై తదుపరి చర్యలు తీసుకునేందుకు దర్యాప్తు ప్రారంభించామని అధికారులు స్పష్టం చేశారు. కాగా.. కొన్ని సంవత్సరాల క్రితం సరిగ్గా ఇలాంటి ఘటనే బిహార్‌లో చోటు చేసుకుంది. బొకారో స్టీల్ ప్లాంట్‌లో జూనియర్ మేనేజర్‌గా పని చేస్తున్న 29 ఏళ్ల వినోద్ కుమార్‌కు కొట్టి, బలవంతంగా ఒక మహిళతో పెళ్లి చేశారు.