Ramacharitamanas: రామచరితమానస్‌ను 'సైనైడ్'తో పోల్చిన మంత్రి
ABN , First Publish Date - 2023-09-15T16:46:13+05:30 IST
బీహార్ విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ హిందువులకు పవిత్రమైన 'రామచరితమానస్'పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్‌ను పొటాషియం సైనైడ్ తో పోల్చారు.
పాట్నా: బీహార్ (Bihar) విద్యాశాఖ మంత్రి చంద్రశేఖర్ (Chandra Sekhar) హిందువులకు పవిత్రమైన 'రామచరితమానస్' (Ramacharitmanas)పై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రామచరితమానస్‌ను పొటాషియం సైనైడ్ (potassium cyanide)తో పోల్చారు. రామచరితమానస్‌పై మంత్రి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇదే మొదటిసారి కాదు. మంత్రి తాజా వ్యాఖ్యలపై బీజేపీ నిప్పులు చెరిగింది. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఈ మాటలు వినపడుతున్నాయా? లేదా? అని ప్రశ్నించింది.
పాట్నాలో జరిగిన 'హిందూ దివస్' కార్యక్రమంలో మంత్రి చంద్రశేఖర్ ప్రసంగిస్తూ, మీరు 55 వంటకాలు తయారు చేసి, అందులో పొటాష్ సైనైడ్ కలిపితే దానిని మీరు తింటారా? హిందూయిజం గ్రంథాల విషయంలో కూడా ఇదే జరుగుతోందని అన్నారు. బాబా నాగార్జున్, లోహియా సైతం దీనిపై విమర్శలు చేశారని చెప్పారు. ''రామచరితమానస్‌పై నాకు బలమైన అభిప్రాయాలు ఉన్నాయి. జీవితాంతం ఆ అభిప్రాయాలు కొనసాగుతుంటాయి. ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ సైతం దీనిపై వ్యాఖ్యలు చేసారు'' అని అన్నారు.
బీజేపీ ఫైర్..
రామచరితమానస్‌ను సైనైడ్‌తో పోలుస్తూ మంత్రి చంద్రశేఖర్ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ నిప్పులు చెరిగింది. రామచరితమానస్‌పై మంత్రి పదేపదే వివాదాస్పద వ్యాఖ్యలు చేస్తున్నారని, ముఖ్యమంత్రి నితీష్ కుమార్‌కు ఆ మాటలు వినిపించడం లేదా అని బీజేపీ ప్రతినిధి నీరజ్ కుమార్ ప్రశ్నించారు. నితీష్ కుమార్ సతానన ధర్మాన్ని పదేపదే అవమానిస్తున్నారంటూ విమర్శించారు. మంత్రి చంద్రశేఖర్‌కు ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఆయన మతం మార్చుకోవచ్చని నీరజ్ కుమార్ సలహా ఇచ్చారు.
మంత్రిని తొలగించండి: చిరాగ్ పాశ్వాన్
రామచరితమానస్‌పై వివాదాస్పద వ్యాఖ్యలుచేసిన చంద్రశేఖర్‌ను మంత్రివర్గం నుంచి తొలగించాలని లోక్ జన్‌శక్తి పార్టీ (రామ్ విలాస్) చీఫ్ చిరాగ్ పాశ్వాన్ డిమాండ్ చేశారు. ఇలాంటి వ్యాఖ్యల చేసిన మంత్రి సిగ్గుపడాలన్నారు. కొత్త జనరేషన్ వ్యక్తుల మనసులను కూడా వీళ్లు విషపూరితం చేస్తున్నారని మండిపడ్డారు. మంత్రి తన మానసిక పరిస్థితి బాగున్నట్టు లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సమ్రాట్ చౌదరి విమర్శించారు. ఆయన చికిత్స తీసుకోవడం మంచిదన్నారు. 2003లో తాము ఒక పిచ్చాసుపత్రి ప్రారంభించామని, మంత్రికి బీహార్ ప్రభుత్వం చికిత్స ఇప్పించకుంటే తాము ఆ చికిత్స చేయిస్తామని సూచించారు.
విద్వేష వ్యాప్తి చేసే రామచరితమానస్..!
రామచరితమానస్‌పై ఆర్జేడీ మంత్రి చంద్రశేఖర్ గత జనవరిలో కూడా ఇదే తరహా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ''ప్రేమ, ఆప్యాయతల వల్లే ఏ దేశమైనా గొప్పదేశం అనిపించుకుంటుంది. రామచరితమానస్, మనుస్మృతి, బంచ్ ఆఫ్ థాట్స్ వంటి గ్రంథాలు విద్వేష బీజాలు, సామాజిక విభజనకు దోహదపడుతున్నాయి. అందుకే మనుస్మృతిని జనం తగులబెట్టారు. దళితులు, వెనుకబడిన తరగతులవారు, మహిళలకు విద్యను దూరం చేసేలా రామచరితమానస్‌లోని కొన్ని భాగాలు ఉండటంపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు'' అని మంత్రి వ్యాఖ్యానించారు.