Bihar:కులాల కోటా పెంపుదల బిల్లుకు సర్కార్ ఆమోదం.. ఎవరికి ఎంత శాతమంటే?
ABN , First Publish Date - 2023-11-09T15:24:04+05:30 IST
బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో క్యాస్ట్ కోటా రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన రిజర్వేషన్ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిహార్ లో రిజర్వేషన్ కోటా ఇకపై 65 శాతం పెరగనుంది.
పట్నా: బిహార్‌లో ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో క్యాస్ట్ కోటా రిజర్వేషన్ల పెంపుదల కోరుతూ రూపొందించిన రిజర్వేషన్ సవరణ బిల్లును రాష్ట్ర అసెంబ్లీ ఇవాళ ఏకగ్రీవంగా ఆమోదించింది. బిహార్ లో రిజర్వేషన్ కోటా ఇకపై 65 శాతం పెరగనుంది. రాష్ట్రంలోని ఇతర వెనుకబడిన తరగతులు, షెడ్యూల్డ్ కులాలు(SC), షెడ్యూల్డ్ తెగల(ST) కోటాలను పెంచే ప్రతిపాదనలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. ఇందులో భాగంగా ఎస్సీలకు 20 శాతం, ఎస్టీలకు 2 శాతం కోటా పెరగనుంది. ఇతర వెనుకబడిన తరగతులు (OBC), అత్యంత వెనుకబడిన తరగతులకు(EBC) రిజర్వేషన్లు 43 శాతం పెరగనున్నాయి.
ప్రస్తుతం బిహార్(Bihar)లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు, విద్యాసంస్థల్లో ఈబీసీలకు 18 శాతం, ఓబీసీలకు 12 శాతం, ఎస్సీలకు 16 శాతం, ఎస్టీలకు 1 శాతం, వెనుకబడిన తరగతుల మహిళలకు 3 శాతం రిజర్వేషన్లు అమల్లో ఉన్నాయి. లోక్‌సభ ఎన్నికలకు(Lokhsabha Elections) ముందు బిహార్ సర్కార్ కులాల(Caste Census) వారీగా లెక్కల్ని బయటకు తీసింది. ఇందుకు సంబంధించిన సర్వే ఫలితాలను ప్రభుత్వం కొన్ని రోజుల క్రితం విడుదల చేసింది. ఇందులోని వివరాల ప్రకారం.. రాష్ట్రంలో అత్యధిక జనాభా కలిగిన వారిలో ఓబీసీ(OBC)లు మొదటి స్థానంలో ఉన్నారు. 13 కోట్ల జనాభా కలిగిన రాష్ట్రంలో ఓబీసీలు 63 శాతంగా ఉన్నారు. ఎస్సీ(SC)లు 19 శాతం, ఎస్టీ(ST)లు 1.68 శాతంగా ఉన్నారు. అగ్ర కులాలు(సవర్ణలు) 15.52 శాతంగా ఉన్నారు. వెనుకబడిన తరగతుల ప్రజలు 27 శాతం ఉండగా, అత్యంత వెనుకబడిన వారు (EBC) 36 శాతం ఉన్నారు. రాజకీయాలను శాసించే స్థాయిలో ఓబీసీలు ఉన్నారని ఆ సర్వే సారాంశం. జనాభాలో భూమిహార్లు 2.86 శాతం ఉండగా, బ్రాహ్మణులు 3.66 శాతం, కుర్మీలు (నితీష్ కుమార్ సామాజిక వర్గం) 2.87 శాతం ఉన్నారు. ముసహర్‌లు 3 శాతం, యాదవులు(ఉప ముఖ్యమంత్రి తేజస్వి యాదవ్ వర్గం) 14 శాతం ఉన్నారు. ఈ లెక్కల ఆధారంగా కులాల కోటా పెంచే అంశంపై నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.