Gun Culture: తుపాకీ సంస్కృతిపై సీఎం కొరడా..813 గన్ లైసెన్సుల రద్దు

ABN , First Publish Date - 2023-03-12T13:40:22+05:30 IST

పంజాబ్‌లో రోజురోజుకూ పెరుగుతున్న తుపాకీ సంస్కృతిపై భగవంత్ సింగ్ మాన్..

Gun Culture: తుపాకీ సంస్కృతిపై సీఎం కొరడా..813 గన్ లైసెన్సుల రద్దు

ఛండీగఢ్: పంజాబ్‌ (Punjab)లో రోజురోజుకూ పెరుగుతున్న తుపాకీ సంస్కృతి (Gun Culture)పై భగవంత్ సింగ్ మాన్ (Bhagwant Singh Mann) సారథ్యంలోని ఆ రాష్ట్ర సర్కార్ కొరడా ఝళిపించింది. రాష్ట్రంలోని 813 తుపాకుల లైసెన్సులు రద్దు చేసింది. లూథియానా రూరల్‌లో 83 తుపాకుల లైసెన్సులు రద్దు చేయగా, సహీద్ భగత్ సింగ్ నగర్ నుంచి 48, గురుదాస్‌పూర్ నుంచి 10, ఫరీద్‌కోట్ నుంచి 84, పఠాన్‌కోట్ నుంచి 199, హోషియాపూర్ నుంచి 47, కపుర్తలా నుంచి 6, ఎస్ఏఎస్ కస్బా నుంచి 235, సంగ్రూర్ నుంచి 16 తుపాకుల లైసెన్సులను రద్దు చేశారు. అమృత్‌సర్ కమిషనరేట్‌లోని 28 మంది, జలంధర్ కమిషనరేట్‌, ఇతర జిల్లాల నుంచి 11 మంది లైసెన్సులు రద్దయ్యాయి. పంజాబ్ ప్రభుత్వం ఇంతవరకూ 2,000కు పైగా ఆయుధాల లెసెన్సులను రద్దు చేసింది.

గన్‌ల విషయంలో నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లోకి తుపాకులు తీసుకు వెళ్లడం, ప్రదర్శించడంపై ప్రస్తుతం నిషేధం ఉందని, రాబోయే రోజుల్లో విస్తృతంగా తుపాకుల తనిఖీలు ఉంటాయని తెలిపింది. తుపాకీ సంస్కృతిని తుదముట్టించేందుకు చర్యలు కొనసాగుతాయని స్పష్టం చేసింది.

పంజాబ్‌లో 3,73,053 ఆయుధాలకు లైసెన్సులు ఉన్నాయి. 28 ఏళ్ల పంజాబ్ సింగర్ సిద్ధు మూసేవాలాను గత ఏడాది పట్టపగలే దుండగులు కాల్చిచంపిన ఘటన పంజాబ్‌‌లో కలకలం రేపింది. తుపాకీ సంస్కృతిపై మరోసారి చర్చకు దారితీసింది. ఇన్‌స్టాగ్రామ్‌లో 8.11 మిలియన్ల ఫాలోయర్లు ఉన్న సిద్ధూ మూసేవాలాపై కూడా గన్ కల్చర్‌ను ప్రోత్సహించారనే ఆరోపణలు వచ్చాయి. ఆయన ఆయుధాలు పట్టుకున్న ఫోటోలు, వీడియోలు వైరల్ కావడంతో కేసు కూడా నమోదు చేశారు.

Updated Date - 2023-03-12T13:40:32+05:30 IST