Share News

Bangalore: గార్డెన్‌సిటీ బెంగళూరులో 15 కి.మీ. ఫ్లై ఓవర్‌

ABN , First Publish Date - 2023-11-23T11:56:08+05:30 IST

గార్డెన్‌సిటీ బెంగళూరు(Garden City Bangalore)లో అతి పొడవైన ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు నేషనల్‌ హైవే అథారిటీ

Bangalore: గార్డెన్‌సిటీ బెంగళూరులో 15 కి.మీ. ఫ్లై ఓవర్‌

- నేషనల్‌ హైవే అథారిటీ సన్నాహాలు

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): గార్డెన్‌సిటీ బెంగళూరు(Garden City Bangalore)లో అతి పొడవైన ఫ్లై ఓవర్‌ను నిర్మించేందుకు నేషనల్‌ హైవే అథారిటీ సన్నాహాలు చేస్తోంది. కేఆర్‌పురం పోలీస్‌ స్టేషన్‌ నుంచి కొలత్తూరు జంక్షన్‌ వరకు నిర్మించతలపెట్టిన ఈ ఫ్లై ఓవర్‌ పూర్తయితే ట్రాఫిక్‌ రద్దీని బాగా నియంత్రించవచ్చునని అంచనా వేస్తున్నారు. మేడహళ్ళి, కాటంనల్లూరు జంక్షన్‌, హొస్కోటె జంక్షన్‌, ఎంవీజే ఆసుపత్రి మీదుగా కొలత్తూరు జంక్షన్‌ వరకు ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించ తలపెట్టారు. ప్రస్తుతం బెంగళూరు ఈస్ట్‌ భాగంలో ట్రాఫిక్‌ రద్దీ అధికంగా ఉంటోంది. ఐటీబీటీ కంపెనీలు పెద్దసంఖ్యలో ఉండడమే ఇందుకు కారణం. ప్రతిపాదిత ఫ్లై ఓవర్‌ సుమారు 15 కిలోమీటర్ల పొడవు ఉంటుందని హైవే అథారిటీ ఉన్నతాధికారి ఒకరు వెల్లడించారు. బెంగళూరు - చెన్నై ఎక్స్‌ప్రెస్‌ వే(Bangalore-Chennai Expressway)తో ఈ ఫ్లై ఓవర్‌ను అనుసంధానం చేయడం ద్వారా పాత మద్రాస్‌ రోడ్డులో ట్రాఫిక్‌ను కొంతమేరకు నివారించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు.

pandu1.jpg

15 కిలోమీటర్ల పొడవైన ఈ ఫ్లై ఓవర్‌పై ఇరువైపులా మొత్తం ఆరు మార్గాలను ఏర్పాటు చేయతలపెట్టారు. 2025లో ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణ పనులు ప్రారంభమయ్యే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ఈ ఫ్లై ఓవర్‌ నిర్మాణానికి రూ.1500 కోట్లు ఖర్చు కాగలదని అంచనా వేస్తున్నారు. డిటైల్డ్‌ ప్రాజెక్ట్‌ రిపోర్ట్‌ (డీపీఆర్‌) 2024 మార్చి నాటికి సిద్ధం కాగలదని భావిస్తున్నామన్నారు. బెంగళూరు ఈస్ట్‌ ప్రాంతంలో ట్రాఫిక్‌ రద్దీ నివారణకు ఇలాంటి ఫ్లై ఓవర్‌ల అవసరం చాలా ఉందని స్థానిక ఎంపీ పీసీ మోహన్‌ అభిప్రాయపడ్డారు. కాగా చైనా తరహాలో బెంగళూరు నగరంలోనూ జంట ఫ్లై ఓవర్‌ల నిర్మాణాన్ని ఎంపిక చేసిన కొన్ని ప్రాంతాల్లో చేపట్టాలన్న ఆలోచన ఉందని దీనిపై నిపుణులతో చర్చిస్తున్నామని నగర ఇన్‌చార్జిగా ఉన్న ఉపముఖ్యమంత్రి డీకే శివకుమార్‌ బుధవారం మీడియాకు తెలిపారు.

Updated Date - 2023-11-23T11:56:09+05:30 IST