Ayodhya: అప్పుడు వివాదాస్పద స్థలంపై కేసు.. ఇప్పుడు ప్రధాని మోదీపై పూలు.. రోడ్‌షోలో అసక్తికర దృశ్యం!
ABN , Publish Date - Dec 31 , 2023 | 02:52 PM
రామమందిర ప్రారంభోత్సవానికి అయోధ్య నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. జనవరి 22వ తేదీన రామ మందిరాన్ని ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు.
రామమందిర (Ram temple) ప్రారంభోత్సవానికి అయోధ్య (Ayodhya) నగరం సర్వాంగ సుందరంగా సిద్ధమైంది. జనవరి 22వ తేదీన రామ మందిరాన్ని ప్రధాని మోదీ (PM Modi) ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే అయోధ్యలో అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ఏర్పాటు చేశారు. రైల్వే స్టేషన్‌ను పునర్నిర్మించారు. ఈ రెండింటిని శనివారం ప్రధాని మోదీ ప్రారంభించారు. అనంతరం అయోధ్య నగరంలో రోడ్ షోలో పాల్గొన్నారు.
ప్రధాని మోదీ రోడ్ షోలో ఓ ఆసక్తికర దృశ్యం చోటు చేసుకుంది. బాబ్రీ మసీదు కేసులో ముస్లిం పక్ష పిటీషనర్లలో ఒకరైన ఇఖ్బాల్ అన్సారీ (Iqbal Ansari).. ప్రధానిపై పూల వర్షం కురిపించారు. ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అనంతరం అన్సారీ మాట్లాడుతూ.. ``ఆయన మన దేశ ప్రధాని. అంటే అందరికీ ప్రధాని. అందుకే ఆయన వాహనం మా ఇంటి ముందుకు వచ్చినపుడు గులాబీ పూలతో స్వాగతం పలికా. మోదీ రాకతో అయోధ్య ఎంతగానో అభివృద్ధి చెందింది. విమానాశ్రయం వచ్చింది. రైల్వే స్టేషన్‌ను విస్తరించారు`` అని అన్సారీ పేర్కొన్నారు. కాగా, అయోధ్యలో రామమందిరం కోసం భూమి పూజ చేసినపుడు మొదటి ఆహ్వానం అన్సారీకే అందింది.