Assembly elections: కర్ణాటకకు బీజేపీ పెద్దలు.. నోటిఫికేషన్‏కు ముందే..

ABN , First Publish Date - 2023-03-17T13:07:28+05:30 IST

రాష్ట్రానికి బీజేపీ పెద్దల రాక జోరందుకుంది. ఇటీవలే మోదీ పర్యటనలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు నేతల వరుస పర్యట

Assembly elections: కర్ణాటకకు బీజేపీ పెద్దలు.. నోటిఫికేషన్‏కు ముందే..

బెంగళూరు, (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి బీజేపీ పెద్దల రాక జోరందుకుంది. ఇటీవలే మోదీ పర్యటనలతో ఉత్సాహంగా ఉన్న బీజేపీ కార్యకర్తలు నేతల వరుస పర్యటనలతో మరింత బిజీగా అయిపోయారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా(JP Nadda) రాఫ్ట్రంలో ఈ నెల 17 నుంచి రెండు రోజుల పాటు పర్యటించనున్నారు. ఈ విషయాన్ని పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సిద్ధరాజు గురువారం మీడియాకు వెల్లడించారు. 17న ఉదయం తోరణగల్లు విమానాశ్రయానికి చేరుకోనున్న నడ్డా అనంతరం చెళ్ళకెరెలో మధ్యాహ్నం 3 గంటలకు జరిగే విజయసంకల్పయాత్రలో పాల్గొంటారు. సాయంత్రం 5 గంటలకు మోళకాల్మూరులో బైక్‌ ర్యాలీ(Bike rally)కి శ్రీకారం చుడతారు. తదుపరి ఇక్కడ జరిగే భారీ బహిరంగ సభను ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఇక 18న ఉదయం 11 గంటలకు తిపటూరులో జరిగే రోడ్‌షోలోనూ మధ్యాహ్నం 2 గంటలకు చిక్కనాయకనహళ్ళిలో జరిగే రోడ్‌షోలోనూ నడ్డా పాల్గొంటారు. సాయంత్రం బెంగళూరుకు చేరుకునే ఆయన పార్టీ రాష్ట్ర ఎన్నికల నిర్వహణా కమిటీ, పార్టీ ఎన్నికల ప్రచార కమిటీ పదాధికారులతో సమావేశమై దిశానిర్దేశం చేస్తారు. ఈ కార్యక్రమాలను ముగించుకుని ఆయన అదేరాత్రి ఢిల్లీకి బయల్దేరి వెళతారని సిద్ధరాజు వివరించారు. కార్యకర్తలు కదిలి రావాలని ఆయన పిలుపునిచ్చారు.

Updated Date - 2023-03-17T13:07:28+05:30 IST