Arvind Kejriwal: బీజేపీలో చేరిన వారే అసలైన అవినీతిపరులు.. ప్రధాని మోదీపై నిప్పులు చెరిగిన అరవింద్ కేజ్రీవాల్
ABN , First Publish Date - 2023-11-05T22:43:39+05:30 IST
తాము అవినీతికి, అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రచారమంటూ ఓ బూటకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఈడీ దాడులకు...
తాము అవినీతికి, అవినీతిపరులకు వ్యతిరేకంగా పోరాడుతున్నామని ప్రధాని నరేంద్ర మోదీ చేస్తున్న ప్రచారమంటూ ఓ బూటకమని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నిప్పులు చెరిగారు. ఈడీ దాడులకు భయపడి బీజేపీలో చేరిన వారే అసలైన అవినీతిపరులని ఆయన ధ్వజమెత్తారు. తప్పులు చేసి బీజేపీలో చేరిన వారికి క్యాబినెట్ పదవులు లభిస్తాయని అన్నారు. ఎంత అవినీతిపరులైనా సరే.. బీజేపీలో చేరితే మాత్రం వారిని ఈడీ, సీబీఐ, ఐటీ వంటి కేంద్ర దర్యాప్తు సంస్థలు సంప్రదించడానికి సాహసం చేయరని పేర్కొన్నారు. హర్యానాలోని రోహ్‌తక్‌లో జరిగిన పార్టీ కార్యక్రమంలో.. కేజ్రీవాల్ ఈ మేరకు బీజేపీ, ప్రధాని మోదీపై విరుచుకుపడ్డారు.
‘‘అవినీతిపరులంటే ఈడీ పట్టుకుని కటకటాల వెనక్కి పంపిన వారు కాదు, ఈడీకి బెదిరిపోయి బీజేపీలో చేరిన వారు. ఈడీ పట్టుకుని బీజేపీలో చేరని వారు చాలా నిజాయితీగా ఉన్నారు. ఎందుకంటే.. ఈరోజు కాకపోయినా రేపైనా బయటకు వస్తామని వారికి తెలుసు. కానీ.. నిజాయితీగా లేని వారిని అరెస్ట్ చేస్తే తాము జీవితాంతం జైలులో ఉండాల్సి వస్తుందని, ఆ వెంటనే బీజేపీలో చేరాల్సి ఉంటుందని వారికి తెలుసు. కాబట్టి.. ఎవరు అవినీతిపరుడో, ఎవరు నిజాయితీపరుడో అర్థం చేసుకోండి’’ అని కేజ్రీవాల్ పేర్కొన్నారు. మోదీ ఒక రాష్ట్రంలో పర్యటించి కొంతమంది రాజకీయ నాయకులను టార్గెట్ చేశారని.. వాళ్లు అవినీతికి పాల్పడ్డారని చెప్పి జైలుకు పంపించారన్నారు. అయితే.. ఆ నాయకులు చివరికి బీజేపీలోకి చేరారని.. వారి పేర్లు బయటపెట్టకుండా జరిగిన విషయాన్ని బట్టబయలు చేశారు. ఇదేనా అవినీతిపై పోరాటమంటే? అని ప్రశ్నించారు.
ప్రధాని మోదీ కేవలం తన స్నేహితుడి కోసం మాత్రమే పని చేస్తారని అందరూ చెప్పుకుంటున్నారని, ప్రధాని కాకుండా అతడే ఈ దేశాన్ని నడుపుతున్నాడని అంటున్నారని కేజ్రీవాల్ వ్యాఖ్యానించారు. చట్టాలు అతని కార్యాలయం నుండి తయారు చేయబడి, ఆమోదించబడతాయని.. నిర్ణయాలన్నీ అతడే తీసుకుంటాడని అన్నారు. ఇది నిజంగా ప్రమాదకరమైన పరిస్థితి అని హెచ్చరించారు. కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేస్తామని బీజేపీ వాళ్లు చెప్తున్నారని.. తనని అరెస్ట్ చేసినా, తన గొంతుని మాత్రం నొక్కలేరని చెప్పారు. తాను మోదీకి వ్యతిరేకంగా చాలా మాట్లాడుతానని వాళ్లు అంటుంటారని.. ఒకవేళ ప్రధాని ఈ దేశంలోని 140 కోట్ల ప్రజల కోసం పని చేయడం ప్రారంభిస్తే తాను మద్దతిస్తానని ప్రకటించారు. ప్రధానిని విమర్శించే వ్యక్తులపై నకిలీ కేసులు బనాయించి.. ఈడీ, సీబీఐ, ఐటీ ఏజెన్సీలతో బీజేపీ దాడులు చేయిస్తోందని ఆరోపించారు.
దేశంలో బీజేపీ, కాంగ్రెస్ తర్వాత మూడో అతిపెద్ద పార్టీ ‘ఆప్’ (ఆమ్ ఆద్మీ పార్టీ) అని.. ఈ పార్టీ ఎదుగుతున్న వేగాన్ని చూసి మోదీ భయపడుతున్నారని కేజ్రీవాల్ ఎద్దేవా చేశారు. కేజ్రీవాల్‌ని చూసి మోదీ భయపడట్లేదని.. ప్రజల శక్తిని చూసి వణికిపోతున్నారని దుయ్యబట్టారు. తమ పార్టీ అన్ని కమ్యూనిటీలను ఏకతాటిపైకి తీసుకొస్తుందని.. పాఠశాలలు, ఆసుపత్రులను అభివృద్ధి చేయడం గురించి మాట్లాడుతుందని పేర్కొన్నారు. హర్యానాలో ఆప్ పార్టీ ఎన్నికైతే.. తప్పకుండా మంచి పరిపాలన అందించి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తామని కేజ్రీవాల్ హామీ ఇచ్చారు.