Amritpal Singh: అమృత్‌పాల్ దేశం విడిచిపెట్టాడన్న అనుమానాలు.. మెర్సిడెస్ స్వాధీనం
ABN , First Publish Date - 2023-03-19T20:17:14+05:30 IST
ఖలిస్థాన్ సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే చీఫ్ అమృత్‌పాల్ సింగ్..

న్యూఢిల్లీ: ఖలిస్థాన్ (Khalistan) సానుభూతిపరుడు, వారిస్ పంజాబ్ డే (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amritpal Sing) దేశం విడిచిపెట్టి పారిపోయడనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పోలీసులు ఛేజ్ చేయడం తో కార్లు మారుతూ చివరకు మెర్సిడెస్ కారులో తప్పించుకున్నట్టు చెబుతున్నాడు. మెర్సిడెస్ కారును స్వాధీనం చేసుకున్నట్టు అమృత్‌సర్ పోలీసులు ఓ ట్వీట్‌లో తెలిపారు.
అమృత్‌పాల్‌ను ఛేజ్ చేస్తుండగా పోలీసుల దృష్టి మళ్లించేందుకు ప్రయత్నాలు జరిగినట్టు డీజీపీ జలంధర్ స్వపన్ శర్మ మీడియాతో మాట్లాడుతూ చెప్పారు. అమృత్‌సర్ రూరల్ ఏరియాలో అమృత్‌పాల్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇంతవరకూ 10 మందిని పట్టుకున్నట్టు తెలిపారు. పది ఫోన్లు స్వాధీనం చేసుకుని టెక్నికల్ అనాలసిస్‌కు పంపినట్టు చెప్పారు.
పరారీలో ఉన్న నేరస్థుడిగా అమృత్‌పాల్ సింగ్‌ను పంజాబ్ పోలీసులు ప్రకటించి, ఆయనను పట్టుకునేందుకు శనివారం నుంచి పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. ఆయన పూర్వీకుల గ్రామం జల్లు ఖేదాలో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేశారు. హింసాత్మక సంఘటనలు జరగకుండా నిరోధించేందుకు రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల్లో సెక్షన్ 144 నిబంధనలను అమలు చేస్తున్నారు. అదేవిధంగా మొబైల్ ఇంటర్నెట్ సేవలపై ఆంక్షలను పొడిగించారు. పంజాబ్‌తోపాటు పొరుగున ఉన్న హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కూడా హై అలర్ట్ ప్రకటించారు. ఈ కేసులో దర్యాప్తు బాధ్యతలను జాతీయ దర్యాప్తు సంస్థ (NIA) చేపట్టే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది.