Amritpal Arrest: సింహంలా లొంగిపాయాడు...అమృత్‌పాల్ తల్లి స్పందన

ABN , First Publish Date - 2023-04-23T14:48:07+05:30 IST

ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, 'వారిస్ పంజాద్ దే' చీఫ్ అమృత్‌పాల్ సింగ్...

Amritpal Arrest: సింహంలా లొంగిపాయాడు...అమృత్‌పాల్ తల్లి స్పందన

చండీగఢ్: ఖలిస్థాన్ వేర్పాటువాద నేత, 'వారిస్ పంజాద్ దే' (Waris Punjab De) చీఫ్ అమృత్‌పాల్ సింగ్ (Amrit pal Singh) మోగా జిల్లాలో పంజాబ్ పోలీసులకు ఆదివారంనాడు లొంగిపోవడంపై ఆయన తల్లిదండ్రులు (Parents) తొలిసారి స్పందించారు. మోగా జిల్లా రోడె గ్రామంలోనే ఓ గురుద్వారాలో ప్రార్థనల అనంతరం ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో అమృత్‌పాల్ లొంగిపోయారు. వెంటనే ఆయనను బఠిండా వాయిసేన కేంద్రానికి తీసుకువెళ్లి, అక్కడి నుంచి అసోంలోని డిబ్రూగర్‌కు తరలిస్తున్నారు. నేషనల్ సెక్యూరీటీ యాక్ట్ కింద అమృత్‌పాల్‌‌ను పోలీసులు అరెస్టు చేశారు.

కాగా, అమృత్‌పాల్ అరెస్టుపై ఆయన తల్లి బల్విందర్ కౌర్ స్పందిస్తూ, తన కొడుకు సింహమని (Lion), సింహంలాగే లొంగిపోయాడని, తన కొడుకును చూసి గర్విస్తున్నానని అన్నారు. దీనిపై తాము న్యాయపోరాటం చేస్తామని, త్వరలోనే తన కొడుకును కలుస్తానని చెప్పారు. మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా తన కుమారుడు పోరాటం చేసినట్టు అమృత్‌పాల్ సింగ్ తండ్రి తరసేమ్ సింగ్ అన్నారు. ఆయన చేపట్టిన మిషన్ ముందుకు సాగాలన్నారు. కాగా, అమృత్‌పాల్ అరెస్టుపై ఆయన కుటుంబం న్యాయపోరాటం సాగిస్తుందని అమృత్‌పాల్ మేనమామ సుఖ్‌చైన్ సింగ్ తెలిపారు. అమృత్‌పాల్ ఆదివారం ఉదయం లొంగిపోయినట్టు తనకు తెలిసిందని, ఆయన పోలీసు కస్టడీలో ఉన్నాడని అనుకుంటున్నామని, ఆయన ఎప్పుడూ తన కుటుంబంతో సంప్రదింపులు సాగించలేదని చెప్పారు.

పోలీసులు సరిగా పనిచేసి ఉంటే...

కాగా, పోలీసులు సక్రమంగా తమ విధులను నిర్వహించి ఉంటే అమృత్ పాల్ సింగ్ అరెస్టు ఇంతకమంటే ముందుగానే జరిగి ఉండేదని, ఇంత డ్రామా అవసరం ఉండేది కాదని 'సాద్' నేత దల్జిత్ సింగ్ చీమా అన్నారు. ఇప్పుడు అరెస్టు ప్రశాంతంగా జరిగిందని, పంజాబ్‌లో ఎలాంటి ఘటనలు చోటుచేసుకోలేదని చెప్పారు.

Updated Date - 2023-04-23T15:05:45+05:30 IST