AIADMK: 5వసారి ఎన్నికల బ్యానర్‌ మార్చిన అన్నాడీఎంకే

ABN , First Publish Date - 2023-02-12T10:19:25+05:30 IST

ఈరోడ్డు తూర్పు నియోజకవర్గ అన్నాడీఎంకే(AIADMK) ఎన్నికల కార్యాలయంలో ఐదవసారి ఫ్లెక్సీని మార్చారు. ఉప ఎన్నికల పనులు నిర్వహించేందుకు సౌలభ్యంగా

AIADMK: 5వసారి ఎన్నికల బ్యానర్‌ మార్చిన అన్నాడీఎంకే

ప్యారీస్‌(చెన్నై), ఫిబ్రవరి 11: ఈరోడ్డు తూర్పు నియోజకవర్గ అన్నాడీఎంకే(AIADMK) ఎన్నికల కార్యాలయంలో ఐదవసారి ఫ్లెక్సీని మార్చారు. ఉప ఎన్నికల పనులు నిర్వహించేందుకు సౌలభ్యంగా పెరుందురై రోడ్డులో అన్నాడీఎంకే ఎన్నికల కార్యాలయాన్ని ప్రారంభించింది. ప్రారంభం రోజున ఎన్‌డీఏ కూటమి పేరుతో బ్యానర్‌ ఏర్పాటు చేశారు. ఆ రోజు సాయంత్రానికే జాతీయ ప్రజాస్వామ్య కూటమి అని పేరు మార్చి మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. దీనిపై బీజేపీ నేతల్లో కొంతమంది ఆగ్రహం వ్యక్తం చేయడంతో మరుసటి రోజు ఉదయం ఆ ఫ్లెక్సీని కూడా తొలగించి ఆలిండియా అన్నాడీఎంకే కూటమి అభ్యర్థి ఫొటోతో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అప్పటివరకు ఏర్పాటైన నాలుగు బ్యానర్లలో దివంగత ముఖ్యమంత్రులు ఎంజీఆర్‌, జయలలిత, మాజీ ముఖ్యమంత్రి ఎడప్పాడి పళనిస్వామి ఫొటోలతో పాటు మిత్రపక్షాలైన టీఎంసీ అధ్యక్షుడు జీకే వాసన్‌, పుదియతమిళగం వ్యవస్థాపకుడు కృష్ణస్వామి ఫొటోలను అందులో పొందుపరిచారు. కాగా 5వసారి కొత్తగా మరో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. అందులో అన్నాడీఎంకే నేతృత్వంలోని కూట మి విజయం సాధిస్తుందని తెలుపుతూ ప్రధాని మోదీ, తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై ఫొటోలతో పాటు మిగిలిన నేతల ఫొటోలను కూడా ముద్రించారు.

ఇదికూడా చదవండి: అభివృద్ధికి బాటలు వేసిన బీజేపీ సర్కార్: మోదీ

Updated Date - 2023-02-12T10:19:27+05:30 IST