Railway track theft: ఘరానా దొంగల నిర్వాకం

ABN , First Publish Date - 2023-02-06T16:19:33+05:30 IST

దొంగల్లో ఘరానా దొంగలు వేరయా అన్నట్టు...దొంగల స్వైరవిహారంపై బీహార్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిన్న కాక మొన్నే మొబైల్ టవర్, రైల్ ఇంజన్‌ను ఎత్తుకుపోయిన దొంగలు..

Railway track theft: ఘరానా దొంగల నిర్వాకం

పాట్నా: దొంగల్లో ఘరానా దొంగలు వేరయా అన్నట్టు...దొంగల స్వైరవిహారంపై బీహార్ పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. నిన్న కాక మొన్నే మొబైల్ టవర్, రైల్ ఇంజన్‌ను ఎత్తుకుపోయిన దొంగలు ఈసారి ఏకంగా రైల్వే ట్రాక్‌నే ఎత్తుకుపోయారు. దీంతో బిత్తరపోవడం పోలీసుల వంతయింది. బీహార్‌లోరి సమస్టిపూర్ జిల్లాలో సుమారు 2 కిలోమీటర్ల పొడవైన రైల్వే ట్రాక్‌ను దొంగలు మాయం చేశారు.

సంఘటన వివరాల ప్రకారం... పాండైల్ రైల్వే స్టేషన్ నుంచి లోహత్ షుగర్ ఫ్యాక్టరీకి అనుసంధానంగా ఈ 2 కిలోమీటర్ల రైల్వే ట్రాక్‌ను ఉపయోగిస్తున్నారు. అయితే, షుగర్ మిల్లు పనిచేయకపోవడంతో కొద్ది సంవత్సరాలుగా ఈ ట్రాక్ వినియోగంలో లేదు. ఇదే అదనుగా భావించిన దొంగలు రైల్వే ట్రాక్‌ను అమాంతం మాయం చేసి, దానిని స్క్రాప్ డీలర్లకు అమ్మేశారు. రైల్వే స్క్రాప్ దొంగతాలు బీహార్‌లో కొత్తేమీ కాననప్పటికీ, ఎకాఎకిన రెండు కిలోమీటర్ల ట్రాక్‌ను ఎత్తుకుపోవడమే ఇటు స్థానికులను, ర్వైల్వే అధికారులను దిగ్భ్రాంతికి గురిచేసింది. కాగా, ఈ నేరంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ సిబ్బంది ప్రమేయం ఉన్నట్టు అనుమానిస్తున్న రైల్వే ఉన్నతాధికారులు ఇద్దరు ఆర్‌పీఎఫ్ ఉద్యోగులను సస్పెండ్ చేశారు. ఎఫ్ఐఆర్‌ను ఆర్పీఎఫ్ నమోదు చేసింది. ఘటనపై పూర్తి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చర్యలు తీసుకుంటామని రైల్వే అధికారులు చెబుతున్నారు.

కాగా, గత ఏడాది నవంబర్‌లోనూ దొంగలు మొబైల్ టవర్‌ను ఎత్తుకెళ్లిన సంఘటన సంచలనమైంది. మొబైల్ కంపెనీ అధికారులమని నమ్మించి 19 లక్షల రూపాయల విలువైన మొబైల్ టవర్‌ను దొంగలు ఎత్తుకెళ్లారు. దొంగలు మొబైల్ టవర్‌ను కూల్చివేస్తుండగా స్థానికులు ప్రశ్నించగా దొంగలు ఏమాత్రం తొణక్కుండా తాము మొబైల్ టవర్ ఉద్యోగులమని చెప్పి, నమ్మించారు. మొబైల్ టవర్ ను కూల్చివేసి ఆ తర్వాత తాపీగా మెటీరియల్‌ను లారీలో ఎక్కించుకుని ఉడాయించారు. పాట్నాలోని గార్డినీబాగ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని యార్పూర్ రాజ్‌పుతానా ప్రాంతంలో ఈ ఘటన జరిగింది.

Updated Date - 2023-02-06T16:19:34+05:30 IST