Actress Gauthami: నటి గౌతమిని మోసగించిన దంపతులకు లుక్‌అవుట్ నోటీసు
ABN , First Publish Date - 2023-11-23T10:10:58+05:30 IST
సినీ నటి గౌతమి(Actress Gauthami)కి చెందిన 25 కోట్ల రూపాయల విలువైన భూమిని నకిలీ పత్రాల ద్వారా మోసం
అడయార్(చెన్నై): సినీ నటి గౌతమి(Actress Gauthami)కి చెందిన 25 కోట్ల రూపాయల విలువైన భూమిని నకిలీ పత్రాల ద్వారా మోసం చేసిన కేసులో ప్రధాన నిందితుడు అళగప్పన్ కోసం పోలీసులు గత కొన్ని రోజులుగా గాలిస్తున్నారు. అయినప్పటికీ ఆయన ఆచూకీ తెలియలేదు. దీంతో ఆయనతో పాటు ఆయన భార్య నాచ్చల్‌కు పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు. అళగప్పన్ కుమారుడు ఆస్ట్రేలియాలో పని చేస్తున్నాడు. దీంతో ఈ దంపతులు అక్కడికి వెళ్లి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. అందుకే వారి కోసం సెంట్రల్ క్రైం విభాగం పోలీసులు లుకౌట్ నోటీసును జారీ చేశారు. అంతేకాకుండా, అళగప్పన్ కుటుంబ సభ్యులు, బంధువుల వద్ద కూడా విచారణ జరపాలని భావిస్తున్నారు. కాగా, నటి గౌతమి భూములకు పవర్ ఆఫ్ అటార్నీ తీసుకున్న అళగప్పన్ నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి, మోసం చేసిన విషయం తెల్సిందే. ఈ కేసు విచారణలో భాగంగా అళగప్పన్ కోసం పోలీసులు గాలిస్తూ తాజాగా లుకౌట్ నోటీసు జారీచేశారు.