Scrub Typhus: ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. కొత్తగా 11 కేసులు నమోదు.. మొత్తంగా 180 కేసులు

ABN , First Publish Date - 2023-09-17T22:08:04+05:30 IST

ఇటు కేరళలో నిపా వైరస్ తీవ్ర కలకలం సృష్టిస్తుంటే.. అటు ఒడిశాను ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి వణికిస్తోంది. రోజురోజుకి ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా..

Scrub Typhus: ఒడిశాలో స్క్రబ్ టైఫస్ కలకలం.. కొత్తగా 11 కేసులు నమోదు.. మొత్తంగా 180 కేసులు

ఇటు కేరళలో నిపా వైరస్ తీవ్ర కలకలం సృష్టిస్తుంటే.. అటు ఒడిశాను ప్రాణాంతక స్క్రబ్ టైఫస్ వ్యాధి వణికిస్తోంది. రోజురోజుకి ఒడిశా రాష్ట్రంలో స్క్రబ్ టైఫస్ కేసులు పెరుగుతున్నాయి. తాజాగా ఒక్క ఆదివారం రోజే సుందర్‌గఢ్ జిల్లాలో కొత్తగా 11 కేసులు నమోదయ్యాయి. దీంతో.. జిల్లాలో ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి బారిన పడిన వారి సంఖ్య 180కి చేరుకుందని ఓ ఆరోగ్య అధికారి తెలిపారు. ఆదివారం మొత్తం 59 శాంపిల్స్‌ని పరీక్షల కోసం పంపగా.. అందులో 11 మందికి స్క్రబ్‌ టైఫస్‌ పాజిటివ్‌గా తేలిందని ఆయన పేర్కొన్నారు. ఈ వ్యాధి సోకిన 180 మందిలో.. 10 మంది ఇతర రాష్ట్రాలకు, మరో 9 మంది ఇతర జిల్లాలకు, మిగిలిన వారంతా సుందర్‌గఢ్ జిల్లాకు చెందిన వారని జిల్లా వైద్యాధికారి కన్హుచరణ్ నాయక్ వెల్లడించారు.


ఈ స్క్రబ్ టైఫస్ వ్యాధి అనేది.. ఇన్ఫెక్షన్ సోకిన కీటకాల (లార్వా మైట్స్) కాటు ద్వారా వ్యాపిస్తుంది. మూడు రోజులకు మించి జ్వరం ఉంటే.. వెంటనే వైద్యులను సంప్రదించాలని ప్రజలకు సూచించారు. ఇప్పటివరకూ ఈ వ్యాధి కారణంగా 7 మంది మృతి చెందారు. వ్యవసాయ భూములు, అడువులను తరుచుగా సందర్శించే వ్యక్తులు ఈ వ్యాధి బారిన పడుతున్నట్టు తేలింది. ఈ వ్యాధి సోకి వెంటనే వైద్య చికిత్స తీసుకోకపోతే.. ఇది ప్రాణాంతకంగా మారే ప్రమాదం ఉందని, మల్టీ ఆర్గాన్ ఫెయిల్యూర్‌కి దారి తీస్తుందని వైద్యులు చెప్తున్నారు. క్రిమి కాటు వల్ల ఏర్పడే మచ్చ.. ఈ వ్యాధికి ఒక సంకేతం అని, అది గుర్తించిన వెంటనే ఆసుపత్రులకు వెళ్లాలని నిపుణులు చెప్తున్నారు. అటు.. ఈ వ్యాధిపై అవగాహన కల్పించేందుకు ఆరోగ్య శాఖ అక్రెడిటెడ్ సోషల్ హెల్త్ యాక్టివిస్ట్స్ (ఆశా), ఆగ్జిలరీ నర్సులు, మిడ్‌వైఫ్ వాలంటీర్లను నియమిస్తోంది.

అటు.. క్రమంగా ఈ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం అయ్యింది. ఈ స్క్రబ్ టైఫస్‌ వ్యాధికి అరికట్టేందుకు కావాల్సిన అన్ని చర్యలు తీసుకోవాలని వైద్యాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఈ నేపథ్యంలోనే.. సుందర్‌గఢ్ జిల్లాకు వైద్య బృందాలను పంపించారు. మందులు, వైద్య సేవలను అందుబాటులో ఉంచారు. ఈ వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండాలని అవగాహన కల్పించేందుకు.. వాలంటీర్లు తమవంతు సహకారం అందిస్తున్నారు. ఇదిలావుండగా.. ఈ వ్యాధి బారిన పడిని వారికి శరీరంపై దద్దర్లు వస్తాయి. జీర్ణ సమస్యలు, జ్వరం, శ్వాస సమస్యలు తలెత్తుతాయి. ఈ లక్షణాలు చూసిన వెంటనే.. వైద్యుల్ని సంప్రదించడం శ్రేయస్కరం.

Updated Date - 2023-09-17T22:08:04+05:30 IST