Israel vs Palestine: ఇజ్రాయెల్-పాలస్తీనా మధ్య వివాదం ఏంటి? మూడు మతాల మధ్య ఆ భూమి ఎలా చిచ్చు పెట్టింది?
ABN , First Publish Date - 2023-10-07T16:43:52+05:30 IST
ఇజ్రాయెల్ vs పాలస్తీనా.. ఈ రెండింటి మధ్య వివాదం కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతోంది. కేవలం భూభాగం కోసమే ఈ రెండూ తలపడుతూ వస్తున్నాయి. చివరిసారిగా 2021లో వీరి మధ్య యుద్ధం జరిగింది. ఇప్పుడు మళ్లీ...
ఇజ్రాయెల్ vs పాలస్తీనా.. ఈ రెండింటి మధ్య వివాదం కొన్ని దశాబ్దాల నుంచి జరుగుతోంది. కేవలం భూభాగం కోసమే ఈ రెండూ తలపడుతూ వస్తున్నాయి. చివరిసారిగా 2021లో వీరి మధ్య యుద్ధం జరిగింది. ఇప్పుడు మళ్లీ వీటి మధ్య మరోసారి ఘర్షణ మొదలైంది. గాజా స్ట్రిప్ నుండి ఇజ్రాయెల్‌పై 5000 రాకెట్లను ప్రయోగించినట్లు హమాస్ (పాలస్తీనా ఉగ్రవాద సంస్థ) ప్రకటించింది. ఈ నేపథ్యంలో ఇజ్రాయెల్ కూడా హమాస్‌ను హెచ్చరించింది. తమపై రాకెట్లను ప్రయోగించడంతో.. ఇజ్రాయిల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు రంగంలోకి దిగారు. తాము యుద్ధంలో ఉన్నామని, ఈ వార్‌లో తామే తప్పకుండా గెలుస్తామని, హమాస్ తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని తీవ్రంగా హెచ్చరించారు. ప్రస్తుతం గాజీ స్ట్రిప్ వద్ద ఇజ్రాయెల్ సైనికులు, హమాస్ యోధుల మధ్య ఎన్‌కౌంటర్ జరుగుతోంది.
అసలు ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఏంటి?
ఇజ్రాయెల్-పాలస్తీనా వివాదం ఇప్పటిది కాదు. ఈ వివాదానికి వందేళ్లకు పైగా చరిత్ర ఉంది. మొదటి ప్రపంచ యుద్ధంలో ఒట్టోమన్ సామ్రాజ్యం ఓడిపోయిన తర్వాత పాలస్తీనా అని పిలువబడే భూభాగాన్ని బ్రిటన్ స్వాధీనం చేసుకుంది. అప్పట్లో ఇజ్రాయెల్ అనే దేశమే లేదు. ఇజ్రాయెల్ నుండి వెస్ట్ బ్యాంక్ వరకు ఉన్న ప్రాంతాన్ని పాలస్తీనా భూభాగం అని పిలిచేవారు. ఆ ప్రాంతంలో అరబ్బులు అధిక శాతంలోనూ, యూదులు కొద్దిమంది మాత్రమే ఉండేవారు. అయితే.. పాలస్తీనా స్థానిక ప్రజలు మాత్రం తమ భూభాగంలో నివసిస్తున్న అరబ్బులు, యూదులు బయటి నుంచి వచ్చిన వ్యక్తులని చెప్తారు. బయటి వాళ్లు తమ భూభాగానికి వచ్చారన్న అసంతృప్తి అప్పట్లో స్థానిక ప్రజల్లో ఉండేదని సమాచారం.
అసలు వివాదం ఎప్పుడు మొదలైందంటే.. యూదుల కోసం పాలస్తీనాను ‘జాతీయ నివాసం’గా ఏర్పాటు చేయాలని బ్రిటన్‌ని అంతర్జాతీయ సమాజం కోరింది. ఇదే పాలస్తీనియన్లు, యూదుల మధ్య వివాదానికి బీజం వేసింది. ఓవైపు.. ఇది తమ పూర్వీకుల ఇల్లు అని యూదులు విశ్వసించేవారు, ఆ ప్రాంతంపై తమకే హక్కు ఉందని దశాబ్దాల తరబడి వాదిస్తున్నారు. మరోవైపు.. పాలస్తీనియన్ అరబ్బులు కూడా ఇది తమ మాతృభూమి అని, ‘పాలస్తీనా’ అనే పేరుతో ఒక కొత్త దేశం సృష్టించాలని కూడా అనుకున్నారు. యూదుల కోసం ప్రత్యేక రాజ్యం ఏర్పాటు చేయాలనే బ్రిటన్ ఎత్తుగడను ఈ పాలస్తీనియన్ అరబ్బులు తీవ్రంగా వ్యతిరేకించారు. ఈ విధంగా పాలస్తీనా-ఇజ్రాయెల్ వివాదం మొదలైంది.
1920 - 1940 మధ్యకాలంలో యూరప్‌లో ఉండే యూదులపై దురాగతాలు జరిగాయి. దాంతో యూదులు అక్కడి నుంచి పారిపోయి, మాతృభూమిని వెతుక్కుంటూ పాలస్తీనాకు రావడం మొదలుపెట్టారు. ఇది తమ మాతృభూమి అని, ఇక్కడే తమ సొంత దేశాన్ని సృష్టిస్తామని యూదులు విశ్వసించారు. ఆ సమయంలో యూదులు, పాలస్తీనియన్ల (అరబ్బుల) మధ్య హింసాత్మక ఘర్షణలు జరిగాయి. అదే టైంలో బ్రిటీష్ పాలనకు వ్యతిరేకంగా పోరాటం కూడా పెరుగుతూ వచ్చింది. అప్పుడు యూదులు, అరబ్బుల మధ్య వివాదానికి చెక్ పెట్టేందుకు గాను 1947లో ఐక్యరాజ్య సమితి ఒక ప్రతిపాదన చేసింది. పాలస్తీనాను రెండుగా విభజించి యూదులకు, అరబ్బులకు పంచి ఇవ్వాలని.. జెరూసలెంను అంతర్జాతీయ నగరంగా ప్రకటించాలని యూఎన్ సిఫారసు చేసింది.
ఈ ప్రతిపాదనకు యూదులు అంగీకారం తెలిపారు కానీ.. అరబ్బులు మాత్రం వ్యతిరేకించారు. తద్వారా.. ఆ ప్రతిపాదన ఎప్పుడూ అమలు కాలేదు. ఈ సమస్యను బ్రిటన్ సైతం పరిష్కరించలేక.. అక్కడి నుంచి వెళ్లిపోయింది. 1948లో బ్రిటన్‌లు వెళ్లిపోయాక.. యూదులు ‘ఇజ్రాయెల్’ దేశాన్ని సృష్టిస్తున్నట్టు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని అనేకమంది పాలస్తీనియన్లు వ్యతిరేకించడంతో.. ఇరుపక్షాల మధ్య యుద్ధం అనివార్యం అయ్యింది. ఈ యుద్ధ సమయంలో లక్షల మంది పాలస్తీనియన్లు అక్కడి నుంచి పారిపోయారు. మొదటి యుద్ధం ముగిసే సమయానికి.. ఇజ్రాయెల్ అతిపెద్ద మొత్తంలో భూభాగాన్ని స్వాధీనం చేసుకుంది. జోర్డాన్, ఈజిప్ట్ వంటి అరబ్ దేశాలు పాలస్తీనా ప్రజల కోసం పోరాడాయి కానీ.. వాళ్లు ఓడిపోవడంతో పాలస్తీనా స్వల్ప భూభాగానికే పరిమితమైంది.
జోర్డాన్ ఆధీనం చేసుకున్న భూభాగానికి ‘వెస్ట్ బ్యాంక్’ అని పేరు పెట్టారు. అటు.. ఈజిప్టు ఆక్రమించిన ప్రాంతానికి ‘గాజా స్ట్రిప్’ అని పేరు ఖరారు చేశారు. జెరూసలెంను రెండుగా విభజించి.. పశ్చిమ వైపు ఇజ్రాయెల్ దళాలు, తూర్పు వైపు జోర్డానియన్ దళాలు పంచుకున్నాయి. కొన్ని సంవత్సరాల వరకు ప్రశాంత వాతావరణం నెలకొంది. కానీ.. 1967లో మళ్లీ యుద్ధం ప్రారంభమైంది. ఈ యుద్ధంలో ఇజ్రాయెల్.. తూర్పు జెరూసలేంతో పాటు వెస్ట్ బ్యాంక్, గాజా స్ట్రిప్‌ను స్వాధీనం చేసుకుంది. 2005లో గాజా నుంచి ఇజ్రాయిల్ వైదొలిగింది కానీ.. వెస్ట్ బ్యాంక్‌ని నియంత్రిస్తూనే ఉంది. తూర్పు జెరూసలేంను ఇజ్రాయెల్ తన రాజధానిగా పేర్కొంది. అటు.. పాలస్తీనియన్లు సైతం దాన్ని తమ భవిష్యత్తు రాజధానిగా పేర్కొన్నారు.
ప్రస్తుతం జరుగుతున్న వివాదం ఏంటి?
చాలామంది పాలస్తీనియన్లు ఇప్పటికీ తూర్పు జెరూసెలం, గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో నివసిస్తున్నారు. వీరికి ఇజ్రాయెల్‌కు మధ్య కొన్ని విషయాల్లో తరచూ వివాదాలు జరుగుతూనే ఉన్నాయి. గాజా ప్రాంతం ‘హమాస్’ పాలనలో ఉంది. ఈ సంస్థ ఎన్నోసార్లు ఇజ్రాయెల్‌తో పోరాడింది. దీంతో.. హమాస్‌కు ఆయుధాలు చేరకుండా ఇజ్రాయెల్, ఈజిప్ట్ దేశాలు గాజా సరిహద్దుల్లో కాపలా కాస్తున్నాయి. అయితే.. ఇజ్రాయెల్ చేపడుతున్న చర్యలు, ఆంక్షల వల్ల తాము కష్టాలపాలవుతున్నామని గాజా, వెస్ట్ బ్యాంక్ ప్రాంతాల్లో ఉన్న పాలస్తీనియన్లు ఆరోపిస్తున్నారు. కానీ.. ఇజ్రాయెల్ ఈ ఆరోపణల్ని తోసిపుచ్చింది. పాలస్తీనియన్లు సృష్టిస్తున్న హింస నుంచి తమని తాము రక్షించుకోవడం కోసమే తాము ప్రతిఘటిస్తున్నామని తెలిపింది.
మరోవైపు.. జెరూసలేం నగరం జుడాయిజం, ఇస్లాం, క్రిస్టియానిటీ మతాలకు చాలా ముఖ్యమైంది. జెరూసలేంలో అల్-అక్సా మసీదు ఉంది. ఇది ఇస్లాంలోని అత్యంత పవిత్రమైన మసీదుల్లో ఒకటి. అలాగే ఈ నగరంలో టెంపుల్ మౌంట్ ఉంది. యూదు మతానికి చెందినవారు ఇక్కడ ప్రార్థన చేస్తారు. దీంతో పాటు ‘చర్చ్ ఆఫ్ ది హోలీ స్పిరిట్’ కూడా ఇక్కడ ఉంది. ఇది క్రైస్తవుల ప్రధాన ప్రదేశం. ఇది యేసు క్రీస్తు మరణం, ఆయన శిలువ వేయడం, పునరుత్థానం కథకు ప్రధానమైంది. ఇలా మూడు మతాలకు సంబంధించిన పవిత్ర స్థలాలు ఉన్న నేపథ్యంలో.. ఆ మతాల ప్రజల మధ్య ఘర్షణలు జరుగుతూనే ఉన్నాయి.
ఇది చాలదన్నట్టు.. ఇజ్రాయెల్, పాలస్తీనియన్ల మధ్య అనేక అంశాల్లో ఏమాత్రం అంగీకారం కుదరడం లేదు. పాలస్తీనియన్ శరణార్థుల భవిష్యత్తు ఏంటి? వెస్ట్ బ్యాంక్‌లో యూదుల నివాసాలను ఉంచాలా లేకపోతే తొలగించాలా? ప్రధాన నగరమైన జెరూసలెంను ఇరు వర్గాలు పంచుకోవాలా, వద్దా? ఇజ్రాయెల్‌తో పాటూ పాలస్తీనా రాజ్యం కూడా ఏర్పాటు చేయాలా, వద్దా? ఇలా పలు అంశాల్లో ఇరు వర్గాలకు రాజీ కుదరడం లేదు. గత 25 ఏళ్లుగా ఎన్నోసార్లు శాంతి చర్చలు జరిగాయి. అయినా వివాదాలు పరిష్కారం కాలేదు. ఈ క్రమంలోనే హమాస్ తాజాగా ఇజ్రాయెల్‌పై దాడి చేయడంతో.. ఇర ప్రాంతాల మధ్య మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.