Vivek Ramaswamy: భారతీయులపై బాంబ్ పేల్చిన వివేక్ రామస్వామి.. H-1B వీసా ప్రోగ్రామ్‌ను ముగించేస్తానంటూ వాగ్ధానం

ABN , First Publish Date - 2023-09-17T15:56:56+05:30 IST

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల మాటలు కోటలు దాటుతాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఓటర్లను ఆకర్షించడం కోసం.. వాళ్లు చేసే వాగ్ధానాలు అన్నీ ఇన్నీ...

Vivek Ramaswamy: భారతీయులపై బాంబ్ పేల్చిన వివేక్ రామస్వామి.. H-1B వీసా ప్రోగ్రామ్‌ను ముగించేస్తానంటూ వాగ్ధానం

ఎన్నికల సమయంలో రాజకీయ నాయకుల మాటలు కోటలు దాటుతాయన్న విషయం ప్రత్యేకంగా చెప్పుకోనవసరం లేదు. ఓటర్లను ఆకర్షించడం కోసం.. వాళ్లు చేసే వాగ్ధానాలు అన్నీ ఇన్నీ కావు. ప్రజల అభిప్రాయాలు, అభిరుచుల్ని ముందుగానే పసిగట్టి.. అందుకు తగినట్టే హామీలు ఇచ్చేస్తుంటారు. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేస్తారా? లేదా? అన్న సంగతి పక్కనపెడితే.. పొలిటీషియన్స్ మాత్రం ఎన్నికలకు ముందు నోటికొచ్చిన వాగ్ధానాలు చేసేస్తుంటారు. ఇప్పుడు రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష పదవి రేసులో ఉన్న వివేక్ రామస్వామి సైతం అలాంటి హామీలే ఇచ్చేస్తున్నాడు. ఇంతవరకూ ఇతర నాయకులు ఇవ్వని, ప్రజలు ఊహించని వాగ్ధానాల వర్షాన్ని అతడు కురిపిస్తున్నాడు. లేటెస్ట్‌గా అతను H-1B వీసా విషయంలో కీలక వ్యాఖ్యలు చేసి, భారతీయులకు పెద్ద షాకే ఇచ్చాడు.

H-1B వీసా ప్రోగ్రామ్‌ను ‘ఒప్పంద దాస్యం’గా పేర్కొన్న వివేక్ రామస్వామి.. తాను 2024లో వైట్ హౌస్‌లో అడుగుపెడితే మాత్రం, ఈ ప్రోగ్రామ్‌ను ముగించేస్తానని కుండబద్దలు కొట్టాడు. ఈ ప్రోగ్రామ్‌ను మెరిటోక్రాటిక్ అడ్మిషన్‌తో భర్తీ చేస్తానని ప్రమాణం చేశాడు. ‘‘ఈ లాటరీ వ్యవస్థను నిజమైన మెరిటోక్రాటిక్ అడ్మిషన్ ద్వారా భర్తీ చేయాల్సిన అవసరం ఉంది. ఇదొక విధమైన ఒప్పంద దాస్యం. ఇది H-1B వలసదారునికి స్పాన్సర్ చేసిన కంపెనీకి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుంది. నేను ఈ ప్రోగ్రామ్‌ని ముగించేస్తా’’ అని చెప్పుకొచ్చాడు. చైన్-బేస్ట్ వలసలను తొలగించాల్సిన అవసరం అమెరికాకు ఉందని పేర్కొన్నాడు. అమెరికాకు ఫ్యామిలీ మెంబర్స్‌గా వచ్చే వ్యక్తులు.. మెరిటోక్రాటిక్ వలసదారులు కాదని తెలిపాడు. ఈ విధంగా H-1B వీసాపై వివేక్ రామస్వామి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి.


ఎందుకంటే.. వివేక్ రామస్వామి స్వయంగా ఈ H-1B వీసా ప్రోగ్రామ్‌ను 29 సార్లు వినియోగించాడు. 2018 నుంచి 2023 వరకు.. యూఎస్ సిటిజన్‌షిప్ & ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్.. H-1B వీసాల కింద ఉద్యోగులను నియమించుకోవడానికి గాను రామస్వామి మాజీ కంపెనీ రోవాంట్ సైన్సెస్ 29 దరఖాస్తులను ఆమోదించింది. అయినప్పటికీ.. ఇందులో ప్రమేయం ఉన్న ప్రతిఒక్కరికీ ఈ వ్యవస్థ చెడ్డదంటూ రామస్వామి పేర్కొనడం ఆశ్చర్యకరంగా అనిపిస్తోంది. నిజానికి.. ఈ H-1B వీసాపై భారత్, చైనాకు చెందిన ఐటీ ఉద్యోగులే ఎక్కువగా అమెరికాకు వెళ్తారు. సాంకేతిక నైపుణ్యం ఉన్న టెక్కీలను అమెరికాలో నియమించుకునేందుకు యూఎస్ కంపెనీలకు ఈ H-1B వీసా అనుమతి ఇస్తుంది. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్‌ని మూసివేస్తే.. భారత్, చైనా టెక్కీలకు కోలుకోలేని దెబ్బ పడినట్టే!

ఇదిలావుండగా.. అమెరికా ప్రతీ సంవత్సరం 65,000 H-1B వీసాలను అందజేస్తుంది. అధునాతన యూఎస్ డిగ్రీలు ఉన్నవారికి 20,000 వీసాలు అందుతాయి. అయితే.. జులై నెలలో భారతీయ-అమెరికన్ కాంగ్రెస్ సభ్యుడు రాజా కృష్ణమూర్తి.. ఈ H-1B వర్కింగ్ వీసాలను రెట్టింపు చేయాలని ప్రతిపాదిస్తూ ఒక బిల్లును ప్రవేశపెట్టారు. ప్రస్తుతం.. H-1B వీసాలలో దాదాపు నాలుగింట మూడు వంతులు ఇండియన్ ప్రొఫెషనల్స్‌కే అందుతున్నాయి. అయితే.. స్వతహాగా వలసదారుల సంతానం అయిన రామస్వామి, పరిమిత ఇమ్మిగ్రేషన్ పాలసీ ఎజెండా వ్యాఖ్యలతో ముఖ్యాంశాల్లోకి వచ్చేశాడు.

Updated Date - 2023-09-17T15:56:56+05:30 IST