Share News

PM Modi: దుబాయి పర్యటనలో మోదీ... కీలక సమ్మిట్‌లలో ప్రసంగించనున్న ప్రధాని

ABN , First Publish Date - 2023-12-01T09:37:12+05:30 IST

దుబాయి పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గత రాత్రి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ చేంజింగ్ టెక్నాలజీ బదిలీ చేయాలని పిలుపునిచ్చారు.

PM Modi: దుబాయి పర్యటనలో మోదీ... కీలక సమ్మిట్‌లలో ప్రసంగించనున్న ప్రధాని

ఢిల్లీ : దుబాయి పర్యటన నిమిత్తం ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ(PM Modi) గత రాత్రి అక్కడికి చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయన పర్యావరణ మార్పుల వల్ల ఎదురవుతున్న సవాళ్లను సమర్థంగా ఎదుర్కునేందుకు అభివృద్ధి చెందుతున్న దేశాలకు క్లైమేట్ చేంజింగ్ టెక్నాలజీ బదిలీ చేయాలని పిలుపునిచ్చారు. యునైటెడ్ నేషన్స్ క్లైమేట్ చేంజ్ కాన్ఫరెన్స్ - 2023 జరిగిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లో దాదాపు 200 దేశాలు గ్లోబల్ వార్మింగ్ ప్రభావాలతో పోరాడుతున్న దేశాలకు సహాయం చేయడానికి ఒక నిధిని స్థాపించే ఒప్పందంపై సంతకాలు చేశాయి.

COP-28 సమ్మిట్‌ లో తీసుకునే నిర్ణయాలతో పర్యావరణాన్ని మెరుగుపరిచేందుకు కృషి చేస్తామని మోదీ X లో పోస్ట్ చేసారు. COP28 చరిత్రలో అతిపెద్ద వాతావరణ సదస్సుగా మారనుంది. వాతావరణ మార్పులపై UN పార్టీల కాన్ఫరెన్స్ (COP - 28) సందర్భంగా నేడు ప్రపంచ వాతావరణ కార్యాచరణ సదస్సుకు ప్రధాని హాజరుకానున్నారు.

మొత్తంగా ఆయన 3 సమ్మిట్ లలో ప్రసంగించనున్నారు. UAE ప్రెసిడెన్సీలో COP28 సదస్సు నవంబర్ 30 నుండి డిసెంబర్ 12 వరకు కొనసాగుతుంది. ప్యారిస్ ఒప్పందం ప్రకారం పర్యావరణం మెరుగుపడటానికి తీసుకున్న చర్యలు.. భవిష్యత్ కార్యచరణకు వేదికగా ఈ సదస్సు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు.


ప్రపంచవ్యాప్తంగా గ్రీన్ హౌస్ ఉద్గారాలు పెరుగుతున్నందున దుబాయ్‌లో జరుగుతున్న వాతావరణ చర్చలు కీలక దశలో ఉన్నాయి. భూమిపై 2023 ఏడాదిలో రికార్డు స్థాయిలో వేడిగాలులు వీచాయని UN ప్రకటించింది. పర్యవరణాన్ని పరిరక్షించేందుకు తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.

COP28, చరిత్రలో అతిపెద్ద వాతావరణ సదస్సుగా నిలవనుంది. ఇందులో 140 మంది దేశాధినేతలు, ప్రభుత్వాధినేతలు పాల్గొననున్నారు. గతేడాది నిర్వహించిన COP27 కంటే రెట్టింపు సంఖ్యలో హాజరుకానున్నారు. ప్రతి ఒక్కరు సదస్సుల్లో ప్రసంగించనున్నారు. బ్రిటన్ రాజు చార్లెస్ III ప్రసంగంతో కార్యక్రమాన్ని ప్రారంభిస్తారు. సమావేశం ప్రారంభం కాగానే, గాజాలో ప్రాణాలు కోల్పోయిన వారికి నేతలు నివాళులు అర్పించనున్నారు.

పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్ COP28కి హాజరు కావాల్సి ఉండగా.. ఆయనకు బదులుగా పాలస్తీనా విదేశాంగ మంత్రి సదస్సులో పాల్గొంటారని కార్యాలయం తెలిపింది.

ప్రపంచంలో అత్యంత కాలుష్యానికి కారణమయ్యే మొదటి రెండు దేశాలైన చైనా, అమెరికా COP28కి హాజరుకావడం లేదు.

Updated Date - 2023-12-01T09:38:44+05:30 IST