Pakistan : ఉగ్రవాద బీజాలను మనమే నాటాం : పాకిస్థాన్ రక్షణ మంత్రి

ABN , First Publish Date - 2023-02-01T15:49:07+05:30 IST

పాకిస్థాన్ నేతలు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభం ముదరడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ

Pakistan : ఉగ్రవాద బీజాలను మనమే నాటాం : పాకిస్థాన్ రక్షణ మంత్రి
Pakistan

ఇస్లామాబాద్ : పాకిస్థాన్ నేతలు అనుభవాల నుంచి పాఠాలు నేర్చుకుంటున్నారు. ఆర్థిక సంక్షోభం ముదరడంతో పాక్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ మాట్లాడుతూ భారత్‌తో యుద్ధాలు చేయడం వల్ల గుణపాఠం నేర్చుకున్నామన్నారు. తాజాగా ఆ దేశ రక్షణ మంత్రి ఖవాజా అసిఫ్ (Khawaja Asif) వంతు వచ్చింది. పెషావర్‌లోని మసీదులో ఆత్మాహుతి దాడి తర్వాత ఆయన మేలుకున్నారు. ఉగ్రవాద బీజాలను మనమే నాటామని వాపోతున్నారు. ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఏకం కావాలని ప్రజలకు పిలుపునిస్తున్నారు.

పాకిస్థాన్‌లోని కైబర్ పఖ్తూన్‌క్వా ప్రావిన్స్ రాజధాని నగరం పెషావర్‌లో సోమవారం దారుణం జరిగింది. ఓ మసీదులో దాదాపు 400 మంది ప్రార్థనలు చేస్తున్న సమయంలో ఆత్మాహుతి దాడి జరిగింది. ఈ దుర్ఘటనలో సుమారు 100 మంది ప్రాణాలు కోల్పోగా, సుమారు 170 మంది వరకు గాయపడ్డారు.

పాకిస్థానీ మీడియా తెలిపిన వివరాల ప్రకారం, ఖవాజా అసిఫ్ పాకిస్థాన్ నేషనల్ అసెంబ్లీలో మాట్లాడుతూ, ఉగ్రవాద బీజాలను పాకిస్థానే నాటిందని చెప్పారు. ‘‘నేను ఎక్కువగా మాట్లాడను, క్లుప్తంగానే మాట్లాడతాను. మొట్టమొదటిది, ఉగ్రవాద బీజాలను మనమే నాటాం. పెషావర్‌లోని మసీదు ప్రాంగణంలో ఆత్మాహుతికి పాల్పడిన బాంబర్ జుహ్ర్ ప్రేయర్స్‌లో ముందు వరుసలో నిల్చున్నాడు. ప్రార్థన చేసుకునేవారు కనీసం భారత దేశం లేదా ఇజ్రాయిల్‌లోనైనా అమరులుకాలేదు, కానీ అది పాకిస్థాన్‌లో జరిగింది. ఈ పేలుడుకు ఎవరిని జవాబుదారీ చేయాలి? ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశమంతా ఏకమవ్వాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే దానిని ఓడించవచ్చు. ఉగ్రవాదం ఏదైనా మతం లేదా వర్గం మధ్య తేడాను చూపించదు. విలువైన ప్రాణాలను తీసేందుకు మతం పేరుతో ఉగ్రవాదాన్ని ఉపయోగిస్తున్నారు’’ అని చెప్పారు.

పాకిస్థాన్ తన ఇంటిని తాను చక్కదిద్దుకోవలసిన అవసరం ఉందన్నారు. గతంలో ఆఫ్ఘనిస్థాన్‌పై రష్యా దాడి చేసినపుడు పాకిస్థాన్ తన సేవలను అమెరికాకు అద్దెకు ఇచ్చిందన్నారు. ఈ ఒప్పందం దాదాపు ఎనిమిది నుంచి తొమ్మిదేళ్ళపాటు అమలైందన్నారు. ఆ తర్వాత అమెరికా తిరిగి వెళ్లిపోయిందని, రష్యా ఓడిపోయిందని సంతోషించిందని చెప్పారు. ఆ తదనంతర పరిణామాలను పాకిస్థాన్ పదేళ్ళపాటు భరించవలసి వచ్చిందన్నారు. ఆ పదేళ్ల తర్వాత 2001 సెప్టెంబరు 11న అమెరికాలో దాడులు జరిగాయన్నారు. అక్కడి నుంచి బెదిరింపు వచ్చిందని, ఆ తర్వాత మరో యుద్ధంలో చేరవలసి వచ్చిందని చెప్పారు. ఈ రెండు యుద్ధాల్లో పాకిస్థాన్ ప్రమేయం వల్ల ఫలితాలు మన ఇళ్లు, మన బజార్లు, మన పాఠశాలలు, బహిరంగ ప్రదేశాల్లోకి చొచ్చుకెళ్లినట్లు తెలిపారు.

ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో ఉన్న పెషావర్ నగరంలో భద్రతపరమైన ఆందోళన తీవ్రంగా ఉంటుంది. అందుకే పోలీసులు ఇతర ప్రాంతాలకు వెళ్ళకుండా పోలీస్ లైన్స్‌లోనే ప్రార్థనలు చేసుకోవడానికి వీలుగా మసీదును నిర్మించారు. ఆత్మాహుతి బాంబర్ సోమవారం ప్రార్థనల సమయంలో ఈ మసీదులోకి ఎలా రాగలిగాడనే అంశంపై పోలీసు ఉన్నతాధికారులు దర్యాప్తు చేస్తున్నారు. ఈ దాడికి తమదే బాధ్యత అని ఇప్పటి వరకు ఎవరూ ప్రకటించలేదు.

Updated Date - 2023-02-01T15:49:13+05:30 IST