Justin Trudeau: మేము భారత్‌ని రెచ్చగొట్టడం లేదు, కానీ సమాధానాలు కావాలి.. తన వ్యాఖ్యలపై జస్టిన్ ట్రూడో వివరణ

ABN , First Publish Date - 2023-09-19T21:28:41+05:30 IST

ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ వ్యవహారానికి సంబంధించి ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను..

Justin Trudeau: మేము భారత్‌ని రెచ్చగొట్టడం లేదు, కానీ సమాధానాలు కావాలి.. తన వ్యాఖ్యలపై జస్టిన్ ట్రూడో వివరణ

ఖలిస్తానీ ఉగ్రవాది హర్‌దీప్‌ సింగ్‌ నిజ్జర్‌ హత్య వెనుక భారత్‌ హస్తం ఉండొచ్చని కెనడా ప్రధాని ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అంతేకాదు.. ఈ వ్యవహారానికి సంబంధించి ఒట్టావాలోని ఒక భారతీయ దౌత్యవేత్తను బహిష్కరిస్తున్నట్టు కూడా ఆయన ప్రకటించారు. దీంతో.. భారత్, కెనడా మధ్య విభేదాలు తీవ్రంగా ముదిరాయి. దెబ్బకు దెబ్బ అన్నట్టుగా.. భారత్ సైతం రివర్స్‌లో కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రూడో చేసిన ఆరోపణల్లో వాస్తవం లేదని ఖండించిన భారత్.. కెనడా దౌత్యాధికారిని బహిష్కరిస్తూ ఆదేశాలు జారీ చేసింది.


ఇలా తాను చేసిన వ్యాఖ్యలు ఇరుదేశాల మధ్య తీవ్ర పరిణామాలకు దారి తీసిన నేపథ్యంలో.. ఈ విషయంపై జస్టిన్ ట్రూడో మంగళవారం మరోసారి స్పందించారు. తాము భారత్‌ని రెచ్చగొట్టాలని లేదో ఇరుదేశాల మధ్య ఉద్రిక్తతలు పెంచాలని చూడటం లేదని.. అయితే ఈ సమస్యను (నిజ్జర్ హత్యను) సరిగ్గా పరిష్కరించాలని భారత్‌ని కోరుతున్నామని అన్నారు. ప్రతి విషయం స్పష్టంగానే ఉందని, సరైన ప్రక్రియలో సాగుతోందని నిర్ధరించుకునేందుకు భారత్‌తో కలిసి పనిచేయాలని అనుకుంటున్నామని తెలిపారు. ‘‘నిజ్జర్ హత్య విషయాన్ని భారత ప్రభుత్వం అత్యంత సీరియస్‌గా తీసుకోవాల్సిన అవసరం ఉంది. మేము కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకున్నాం. మేము భారత్‌ని రెచ్చగొట్టాలనో లేదా ఉద్రిక్తతలు పెంచాలనో చూడటం లేదు’’ అని విలేకరులతో చెప్పారు.

ఇదిలావుండగా.. హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉండొచ్చని అనడానికి తమ ప్రభుత్వం వద్ద విశ్వసనీయమైన సమాచారం ఉందని సోమవారం ట్రూడో ఆరోపించారు. భారత ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందిస్తూ.. ఈ ఆరోపణలు అసంబద్ధమైనవని తిరస్కరించింది. అనంతరం.. ఈ ఇష్యూలో ఇరుదేశాలు పరస్పర దౌత్యాధికారుల్ని బహిష్కరించాయి. అసలే ఇరుదేశాల మధ్య అంతంత మాత్రం సంబంధాలు ఉండగా.. ఈ వివాదంతో విభేదాలు మరింత పెరిగాయి. పలితంగా.. దౌత్య సంబధాలకు దెబ్బ తగలడంతో పాటు వాణిజ్య ఒప్పందం ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - 2023-09-19T21:28:41+05:30 IST