Share News

Indonesia Volcano: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలు.. పెరిగిన మృతుల సంఖ్య.. ఇతరుల కోసం గాలింపు

ABN , First Publish Date - 2023-12-05T16:15:58+05:30 IST

ఇండోనేషియాలో ఒక ఘోర విపత్తు సంభవించింది. అక్కడి మౌంట్‌ మెరపి అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. దీంతో.. ఆ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లిన పర్వతారోహకుల్లో 13 మంది మృతి చెందారు. ఇంకా 10 మంది ఆచూకీ గల్లంతైంది.

Indonesia Volcano: ఇండోనేషియాలో అగ్నిపర్వతం బద్దలు.. పెరిగిన మృతుల సంఖ్య.. ఇతరుల కోసం గాలింపు

Indonesia Volcano Erruption: ఇండోనేషియాలో ఒక ఘోర విపత్తు సంభవించింది. అక్కడి మౌంట్‌ మెరపి అగ్నిపర్వతం ఒక్కసారిగా బద్దలైంది. దీంతో.. ఆ ప్రాంతంలో పర్యటించేందుకు వెళ్లిన పర్వతారోహకుల్లో 13 మంది మృతి చెందారు. ఇంకా 10 మంది ఆచూకీ గల్లంతైంది. పశ్చిమ సమత్రా దీవిలో ఉండే ఈ మౌంట్‌ మెరపి అగ్నిపర్వతం.. ఆదివారం విస్ఫోటనం చెందింది. తద్వారా.. మూడు వేల మీటర్ల ఎత్తుకు బూడిద వ్యాపించింది. ఈ ప్రకృతి విపత్తు గురించి తెలుసుకున్న సహాయక బృందాలు వెంటనే సహాయక బృందాలు రంగంలోకి దిగాయి. ఇప్పటిదాకా 53 మందిని రక్షించాయి.

ఈ ఘటన గురించి పడాంగ్‌ సెర్చ్‌ అండ్‌ రెస్క్యూ ఏజెన్సీ అధిపతి అబ్దుల్‌ మాలిక్‌ మాట్లాడుతూ.. ‘‘విస్ఫోటనం జరిగే సమయంలో ఆ అగ్నిపర్వత ప్రాంతంలో మొత్తం 75 మంది పర్వతారోహకులు ఉన్నట్లు మా వద్ద సమాచారం ఉంది. వీరిలో 13 మంది మృతి చెందారు. తొలుత ఆదివారం నాడు 11 మంది మృతదేహాలు లభ్యమవ్వగా.. సోమవారం మరో ఇద్దరి డెడ్ బాడీలు దొరికాయి. మేము 53 మందిని రక్షించగలిగాం. అయితే.. మరో 10 మంది ఆచూకీ తెలియాల్సి ఉంది. మేము కాపాడిన పర్వతారోహకుల్లో కొందరికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి.. చికిత్స అందిస్తున్నాం. గల్లంతైన వారి ఆచూకీ కోసం సహాయ బృందాలు తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి’’ అని తెలిపారు.


అగ్నిపర్వత బూడిద కొండ దిగువ భాగానికి చేరుకుందని.. దీంతో సహాయక బృందాలకు సవాలుగా మారిందని అబ్దుల్ మాలిక్ పేర్కొన్నారు. కొండ పై భాగానికి చేరుకోవడానికి రెండు మార్గాలు ఉన్నాయని.. అయితే అవి నీటారుగా, స్లిప్పరీగా ఉన్నాయని అన్నారు. వోల్గానిక్ యాక్టివిటీ, చెడు వాతావరణం కారణంగా.. రెస్క్యూ మిషన్‌కు ఆటంకం కలుగుతోందని ఆయన చెప్పారు. మరోవైపు.. విస్ఫోటనం సంభవించిన ఈ మౌంట్‌ మెరపి ప్రాంతంలో అధికారులు రెండో ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. అటువైపుకు ఎవ్వరూ రావొద్దని హెచ్చరించారు. పర్వతారోహకులు ట్రెక్కింగ్‌ చేసే సమయంలో ఈ విస్ఫోటనం చోటు చేసుకోవడంతో ప్రాణనష్టం జరిగిందని అధికారులు స్పష్టం చేశారు.

ఇదిలావుండగా.. మౌంట్ మెరపి అంటే మౌంటైన్ ఆఫ్ ఫైర్. అంటే.. ఇది ఎల్లప్పుడూ యాక్టివ్‌గానే ఉంటుంది. ఇక్కడ ఎప్పుడు, ఏం జరుగుతుందో ఎవ్వరూ ఊహించలేరు. అందుకే.. దీనిని అత్యంత ప్రమాదకరమైన ప్రాంతంగా పరిగణిస్తారు. అలాగే.. టెక్టోనిక్ ప్లేట్లు ఢీకొట్టుకునే పసిఫిక్ రింగ్ ఆఫ్ ఫైర్ ప్రాంతానికి చేరువలోనే ఇండోనేషియా ఉంటుంది కాబట్టి ఇక్కడ తరచూ భూకంపాలు, అగ్నిపర్వత విస్ఫోటనాలు చోటు చేసుకుంటుంటాయి.

Updated Date - 2023-12-05T16:15:59+05:30 IST