Nepal plane crash: చివరి నిమిషంలో మనసు మార్చుకుని మృత్యు ఒడికి!

ABN , First Publish Date - 2023-01-16T17:52:01+05:30 IST

నేపాల్‌లోని పొఖారా (Pokhara)లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం (Plane Crash)లో అందులో

Nepal plane crash: చివరి నిమిషంలో మనసు మార్చుకుని మృత్యు ఒడికి!

న్యూఢిల్లీ: నేపాల్‌లోని పొఖారా (Pokhara)లో ఆదివారం జరిగిన విమాన ప్రమాదం (Plane Crash)లో అందులో ఉన్న 72 మంది మరణించారు. వీరిలో ఐదుగురు భారతీయులు కూడా ఉన్నారు. వీరిలో నలుగురిని ఉత్తరప్రదేశ్‌లోని ఘజీపూర్‌(Ghazipur)కు చెందిన విశాల్ శర్మ, సోను జైశ్వాల్, అనిల్ రాజ్‌భర్, అభిషేక్ కుష్వాహాగా గుర్తించారు. వీరందరూ స్నేహితులు. హాలీడే కోసం నేపాల్ వెళ్లారు. మనసు మార్చుకోవడం కారణంగా వీరంతా మృత్యు ఒడికి చేరారు.

నేపాల్‌(Nepal)లో ల్యాండ్ అయిన తర్వాత అందరూ కలిసి కఠ్మాండులోని పశుపతినాథ్ ఆలయాన్ని (Pashupatinath temple) సందర్శించుకున్నారు. అక్కడి నుంచి వారంతా బస్సులో పోఖరా వెళ్లాల్సి ఉంది. ఇదే విషయాన్ని ఘజీపూర్‌లోని తమ ఉమ్మడి స్నేహితుడైన దిలీప్ వర్మకు వీడియో కాల్ చేసి చెప్పారు. ఇప్పుడే పశుపతినాథ్ ఆలయాన్ని దర్శించుకున్నామని, బస్సులో పోఖరా బయలుదేరుతున్నట్టు చెప్పారు.

స్నేహితుడితో వీడియో కాల్ మాట్లాడిన తర్వాత వీరు మనసు మార్చుకున్నారు. బస్సుకు బదులుగా విమానంలో ఫోఖరా వెళ్దామని నిర్ణయించుకున్నారు. ఆ నిర్ణయమే వారి ప్రాణాలు తీసింది. విమాన ప్రమాదంలో వీరంతా మరణించారు. ప్రమాదానికి ముందు సోను జైశ్వాల్ ఫేస్‌బుక్‌(Facebook)లో లైవ్ కూడా చేశాడు. వైన్ షాప్ నిర్వహిస్తున్న సోనూకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు.

స్థానికులు చెబుతున్న ప్రకారం.. అనిల్ కుమార్ రాజ్‌భర్ (28) జన్ సేవా కేంద్ర (పబ్లిక్ సర్వీస్ సెంటర్) నిర్వహిస్తున్నాడు. అభిషేక్ కుష్వాహా (25)కు ఓ షాప్ ఉంది. విశాల్ శర్మ (23) ద్విచక్ర వాహన షోరూమ్‌లో ఫైనాన్స్ విభాగంలో పనిచేస్తున్నాడు. స్నేహితులందరిలో ఆయనే చిన్నవాడు. ఈ నలుగురు కాకుండా బీహార్‌లోని సీతామర్హికి చెందిన సంజయ్ జైశ్వాల్ (26) పోఖరాలోని తన సోదరిని కలిసేందుకు వెళ్లి ప్రమాదంలో మృతి చెందారు.

ప్రమాదానికి గురైన విమానంలో మొత్తం 68 మంది ప్రయాణికులు ఉన్నారు. వీరిలో 15 మంది విదేశీయులు. అలాగే, నలుగురు సిబ్బంది కూడా ఉన్నారు. విమాన శిథిలాల నుంచి ఇప్పటి వరకు 68 మృతదేహాలను వెలికి తీశారు. మిగతా నలుగురికి కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Updated Date - 2023-01-16T17:59:06+05:30 IST