Share News

India-Canada Row: నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో తారుమారు.. ఓ ఉన్నత స్థాయి అధికారి డ్యామేజ్ చేశాడన్న భారత హైకమిషనర్

ABN , First Publish Date - 2023-11-05T16:16:35+05:30 IST

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో.. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అతని హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో...

India-Canada Row: నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో తారుమారు.. ఓ ఉన్నత స్థాయి అధికారి డ్యామేజ్ చేశాడన్న భారత హైకమిషనర్

ఖలిస్తానీ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య కేసు విషయంలో.. భారత్, కెనడా మధ్య దౌత్యపరమైన ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. అతని హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో ఆరోపణలు చేయడం వల్లే.. ఇరు దేశాల మధ్య దౌత్య వివాదం నెలకొంది. రోజుల గడుస్తున్న కొద్దీ ఈ వివాదం మరింత ముదురుతుంటే తప్ప.. తగ్గుముఖం పట్టట్లేదు. ఇలాంటి తరుణంలో.. కెనడాలో ఉన్న భారత హైకమిషనర్ సంజీవ్ వర్మ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నిజ్జర్ హత్య కేసు దర్యాప్తులో తారుమారు జరిగిందని.. ఈ కేసుని ఒక కెనడా సీనియర్ అధికారి ఉద్దేశపూర్వకంగానే దెబ్బతీశాడని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు. ‘ది గ్లోబ్‌ అండ్‌ మెయిల్‌’ అనే పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన ఈ షాకింగ్ వ్యాఖ్యలు చేశారు.

ఇదే సమయంలో.. నిజ్జర్‌ హత్యలో భారత ఏజెంట్ల ప్రమేయం ఉందని జస్టిన్ ట్రూడో చేసిన ఆరోపణల్ని బలపర్చే ఆధారాలు ఉంటే, వాటిని వెంటనే సమర్పించాలని సంజీవ్ వర్మ కెనడా ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కేసు దర్యాప్తులో భారత్ సహకారం కావాలని కోరుతున్న కెనడా.. ఇప్పటివరకూ అవసరమై ఆధారాల్ని సమర్పించలేదని ఆయన మండిపడ్డారు. జూన్ 18న ఈ హత్య జరగ్గా.. ఇంతవరకూ జరిపిన దర్యాప్తులో ఏం తేలిందని ప్రశ్నించారు. భారత్‌పై చేసిన ఆరోపణలకు ఆధారాలు ఎక్కడున్నాయని నిలదీశారు. ఈ కేసు దర్యాప్తు మొత్తాన్ని తారుమారు చేశారని తాను ఓ అడుగు ముందుకేసి చెప్తున్నానన్నారు. ఈ హత్యలో భారత్‌, ఆ దేశ ఏజెంట్లు ఉన్నట్లు చెప్పాలని.. కెనడాలోని అత్యున్నత స్థాయి అధికారుల నుంచి సూచనలు జారీ అయ్యాయని ఆయన కుండబద్దలు కొట్టారు. అంతేకాదు.. తనతో పాటు కెనడాలో ఉంటున్న ఇతర భారత దౌత్యవేత్తలకు అక్కడ ప్రమాదం పొంచి ఉందని అనుమానాలు వ్యక్తం చేశారు. తమకు ఏదైనా జరిగితే ఆ భగవంతుడే కాపాడాలని సంజీవ్ వర్మ చెప్పుకొచ్చారు.


ఇంకా సంజీవ్ వర్మ మాట్లాడుతూ.. నిజ్జర్‌ హత్య కేసుకు సంబంధించి భారత దౌత్యవేత్తల మధ్య జరిగిన సంభాషణలను కెనడా ఇంటెలిజెన్స్‌ సర్వీసు సేకరించినట్లు వచ్చిన నివేదికల్ని కూడా తోసిపుచ్చారు. వైర్‌ట్యాపింగ్ అనేది చట్టవిరుద్ధమైనదని నొక్కి చెప్పిన ఆయన.. దౌత్యవేత్తల సంభాషణలు అంతర్జాతీయ చట్టలా ప్రకారం సురక్షితంగా ఉంటాయని వివరించారు. అసలు ఆ సంభాషణలను ఎలా సేకరించారో తనకు చూపించామని, ఆ వాయిస్‌ని ఎవరూ మిమిక్రీ చేయలేదని తనకు నిరూపించాలని గట్టిగా అడిగారు. ఈ కేసులో ఎవరైనా అనుమానితులను అప్పగించాలని కెనడా కోరిందా? అనే ప్రశ్న అడిగినప్పుడు.. ఆ చర్చలు రెండు దేశాల ప్రభుత్వాల మధ్య ఉన్నాయన్నారు. అయితే.. తాము గత ఐదారు సంవత్సరాల్లో ఒట్టావా (కెనడా)కు 26 అప్పగింత అభ్యర్థనలు చేశామని, కానీ ఇంతవరకూ ఏదీ ప్రాసెస్ చేయలేదని స్పష్టం చేశారు. రెండు దేశాల మధ్య ఏదైనా వివాదం చెలరేగితే.. నిర్దేశిత చర్చల ద్వారా దాన్ని పరిష్కరించుకోవాలని ఆయన సూచించారు.

కెనడాతో వాణిజ్య చర్చలను పునఃప్రారంభించేందుకు భారతదేశం ఎంతో ఆసక్తిగా ఉందని సంజీవ్ వర్మ తెలిపారు. ఈ ఒప్పందంపై సాధ్యమైనంత త్వరగా సంతకం చేస్తే బాగుంటుందని.. ఫలితంగా వ్యాపారులు, పెట్టుబడిదారులు ప్రయోజనం పొందగలని అన్నారు. కెనడియన్ వ్యాపారవేత్తల ప్రతినిధి బృందాన్ని న్యూ ఢిల్లీ సాదరంగా భారతదేశానికి స్వాగతిస్తుందని పేర్కొన్నారు. అయితే.. కెనడా, భారత్ మధ్య చిచ్చుపెట్టాలని ప్రయత్నిస్తున్న కొందరు కెనడియన్ పౌరుల సమూహానికి (ఖలిస్తానీ మద్దతుదారులను ఉద్దేశిస్తూ) ఎలాంటి సహకారాలు అందించొద్దని ఆయన కెనడాను సూచించారు.

Updated Date - 2023-11-05T16:16:36+05:30 IST