Britain : మేఘన్‌‌ను పెళ్లి చేసుకున్న ప్రిన్స్ హ్యారీ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-01-03T12:16:24+05:30 IST

ఇది ఇలా జరగవలసిన అవసరం లేదు. రాజీ పడటానికి వారు ఎంత మాత్రం ఇష్టపడలేదు.

Britain : మేఘన్‌‌ను పెళ్లి చేసుకున్న ప్రిన్స్ హ్యారీ సంచలన వ్యాఖ్యలు
Prince Harry

లండన్ : బ్రిటన్ దేశపు ప్రిన్స్ హ్యారీ తన తండ్రి, సోదరులపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆయన మేఘన్ మార్క్‌లే (Meghan Markle)ను వివాహం చేసుకోవడంతో రాజ వంశంలో అభిప్రాయ భేదాలు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితులు ఈ విధంగా కొనసాగవలసిన అవసరం లేదని హ్యారీ తాజాగా వ్యాఖ్యానించారు. తన తండ్రి కింగ్ ఛార్లెస్ (King Charles), సోదరుడు ప్రిన్స్ విలియం (Prince William) తనతో కలవాలని తాను కోరుకుంటున్నానని చెప్పారు. ఓ మీడియా సంస్థకు ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ ఇంటర్యూలో కొంత భాగం (ప్రోమో) సోమవారం ప్రసారమైంది.

‘‘ఇది ఇలా జరగవలసిన అవసరం లేదు. రాజీ పడటానికి వారు ఎంత మాత్రం ఇష్టపడలేదు. నా తండ్రిని తిరిగి కలవాలని, నా సోదరుడిని తిరిగి కలవాలని నేను కోరుకుంటున్నాను’’ అని ప్రిన్స్ హ్యారీ చెప్పారు.

ప్రిన్స్ హ్యారీ, ఆయన సతీమణి మేఘన్‌లను అధికారికంగా డ్యూక్ అండ్ డచెస్ ఆఫ్ ససెక్స్ అంటారు. వీరు తమ రాజవంశీక కార్యకలాపాలు, విధుల నుంచి 2020 మార్చిలో వైదొలగిన సంగతి తెలిసిందే. మీడియా వేధింపులకు దూరంగా ఉండాలని, అమెరికాలో తమ నూతన జీవితాలను ప్రారంభించాలని తాము కోరుకుంటున్నామని అప్పట్లో వీరు ప్రకటించారు.

ఆ తర్వాత వీరిద్దరూ తాము రాజ కుటుంబంలో ఎదుర్కొన్న పరిస్థితులను వివరిస్తూ, కొన్ని ఆరోపణలు కూడా చేశారు. రాజ కుటుంబీకులు తమను అవమానకరంగా చూసేవారని కూడా ఆరోపించారు. తన భవిష్యత్తు గురించి చర్చించేందుకు ఏర్పాటైన సమావేశంలో తనపై తన సోదరుడు ప్రిన్స్ విలియం బిగ్గరగా కేకలు వేశారని హ్యారీ ఆరోపించారు.

ప్రిన్స్ హ్యారీ తాజాగా ఓ అమెరికన్ మీడియా సంస్థకు ఇచ్చిన మరో ఇంటర్వ్యూలో మాట్లాడుతూ, తనకు, తన భార్యకు బహిరంగంగా మద్దతిచ్చేందుకు రాజ వంశం తిరస్కరించిందని చెప్పారు. తమకు వ్యతిరేకంగా వార్తలు ప్రచారం చేసిందని కూడా ఆరోపించారు. మౌనంగా ఉండటమే ద్రోహం చేయడమనే విషయం కనిపిస్తోందని ఆరోపించారు. దీనిని మరింత వివరిస్తూ, గత ఆరు సంవత్సరాల నుంచి రాజ కుటుంబీకులు తనతో , ‘‘నిన్ను కాపాడటానికి మేం ప్రకటన చేయలేం, కానీ కుటుంబంలోని ఇతర సభ్యుల కోసం నువ్వు ప్రకటన ఇవ్వాలి’’ అని చెప్తున్నారన్నారు.

ప్రిన్స్ హ్యారీ జీవిత చరిత్ర పుస్తకం ‘‘స్పేర్’’ (Spare) ఆవిష్కరణకు రెండు రోజుల ముందు అంటే, జనవరి 8న ఈ రెండు ఇంటర్వ్యూలు ప్రసారమవుతాయి.

Updated Date - 2023-01-03T12:52:28+05:30 IST