Share News

Humaira Himu: బంగ్లాదేశీ నటి హుమైరా హిము అనుమానాస్పద మృతి.. ఆసుపత్రి నుంచి అతడు పరార్!

ABN , First Publish Date - 2023-11-04T18:09:37+05:30 IST

బంగ్లాదేశ్ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటి హుమైరా హిము (37) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎప్పుడూ ఆరోగ్యంగా, చురుకుగా ఉండే హమైరా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది.

Humaira Himu: బంగ్లాదేశీ నటి హుమైరా హిము అనుమానాస్పద మృతి.. ఆసుపత్రి నుంచి అతడు పరార్!

బంగ్లాదేశ్ సినీ పరిశ్రమలో విషాదం చోటు చేసుకుంది. ప్రముఖ సినీ నటి హుమైరా హిము (37) మంగళవారం అనుమానాస్పదంగా మృతి చెందారు. ఎప్పుడూ ఆరోగ్యంగా, చురుకుగా ఉండే హమైరా ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. దీంతో ఆమెను హుటాహుటినా ఢాకాలోని ఉత్తరా మోడ్రన్ మెడికల్ కాలేజీ ఆసుపత్రికి తరలించారు. కానీ.. అప్పటికే ఆలస్యం అయిపోయింది. ఆమె మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. ఆమె మృతికి గల కారణాలేంటో ఇంకా తెలియరాలేదు. అయితే.. నటి మెడపై గాయం ఉండటాన్ని గుర్తించిన వైద్యులు, వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఇంతవరకూ బాగానే ఉంది కానీ.. ఇంతలోనే ఒక ఊహించని పరిణామం చోటు చేసుకుంది.


హుమైరాను ఆసుపత్రిలో చేర్పించి, అక్కడ కాసేపటి వరకు ఉన్న ఆమె స్నేహితుడు ఒకడు.. పోలీసులు వచ్చే సమయంలోనే అక్కడి నుంచి పరారయ్యాడు. వైద్యులతో మాటలు కలిపి.. వాళ్ల కళ్లు గప్పి ఆ ప్రాంతం నుంచి ఒక్కసారిగా మాయమవ్వడం అనుమానాలకు తావిస్తోంది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ప్రాథమిక విచారణలో భాగంగా.. ఆసుపత్రి నుంచి వెళ్లిపోయిన ఆ వ్యక్తి హుమైరా ప్రియుడని తెలుస్తోంది. వీరి మధ్య కొంతకాలం నుంచి గొడవలు జరుగుతున్నాయని కూడా వెలుగులోకి వచ్చింది. బహుశా హుమైరా మృతికి ముందు ఇద్దరి మధ్య గొడవ జరిగి ఉండొచ్చని, దాంతో ఆమె ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని పోలీసులు భావిస్తున్నారు. అయితే.. పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చేదాకా హుమైరా మృతికి గల కారణాలేంటో తెలుస్తాయని, ప్రస్తుతం ఈ విషయంపై దర్యాప్తు చేస్తున్నామని అధికారులు తెలిపారు.

కాగా.. 2006 నుంచి హుమైరా తన కెరీర్‌ను సీరియల్ నటిగా ప్రారంభించింది. అనేక బంగ్లాదేశ్ సీరియల్స్‌లో నటించిన ఆమె.. ‘ఛాయాబితి’ అనే టీవీ సిరీయల్ ద్వారా పాపులారిటీ గడించింది. ఆ పాపులారిటీనే ఆమెకు ‘అమర్ బంధు రషీద్’ అనే సినిమాలో నటించే అవకాశం కల్పించింది. అందులో ఆమె నటనకు గాను తారాస్థాయిలో ప్రశంసలు వచ్చిపడ్డాయి. ఇంతలోనే హుమైరా ఆకస్మికంగా మృతి చెందడంతో.. బంగ్లా సినీ ఇండస్ట్రీతో పాటు కుటుంబ సభ్యులు, ఆమె అభిమానులు షాక్‌కు గురయ్యారు.

Updated Date - 2023-11-04T18:09:39+05:30 IST