German City Evacuated: రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ.. ఆ ఒక్క కారణమే జనాల్ని పరుగులు పెట్టించింది

ABN , First Publish Date - 2023-08-08T15:43:27+05:30 IST

అప్పటివరకూ ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఉంది. అక్కడున్న ప్రజలందరూ తమతమ కుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడుపుతున్నారు. ఓవైపు పెద్దలందరూ తమతమ పనుల్లో నిమగ్నమైతే, పిల్లలు జాలీగా ఆడుకుంటున్నారు. అలాంటి ప్రాంతం..

German City Evacuated: రాత్రికి రాత్రే ఊరంతా ఖాళీ.. ఆ ఒక్క కారణమే జనాల్ని పరుగులు పెట్టించింది

అప్పటివరకూ ఆ ప్రాంతంలో ప్రశాంత వాతావరణం ఉంది. అక్కడున్న ప్రజలందరూ తమతమ కుటుంబ సభ్యులతో హాయిగా కాలం గడుపుతున్నారు. ఓవైపు పెద్దలందరూ తమతమ పనుల్లో నిమగ్నమైతే, పిల్లలు జాలీగా ఆడుకుంటున్నారు. అలాంటి ప్రాంతం.. ఉన్నట్లుండి ఒక్కసారిగా ఖాళీ అయిపోయింది. రాత్రికి రాత్రే 13వేల మంది జనం తట్టాబుట్టా సర్దుకొని అక్కడి నుంచి వెళ్లిపోవాల్సి వచ్చింది. ఒకప్పుడు ప్రజలతో కిటకిటలాడిన ఆ ప్రదేశం.. ఇప్పుడు నిర్మానుష్యంగా మారింది. ఇలా ఒక్కసారిగా ఆ ప్రాంతం జనసంచారం లేకుండా మారిపోవడానికి కారణం.. అక్కడ వరల్డ్ వార్-2 కాలం నాటి బాంబు దొరకడమే! పూర్తి వివరాల్లోకి వెళ్తే..

అది జర్మనీలోని డ్యూసెల్‌డార్ఫ్‌ ప్రాంతం. ఆగస్టు 7వ తేదీన సిటీ జూ సమీపంలో ఒక టన్ను బరువు గల షెల్ కనుగొనబడింది. ఇది అనుమానాస్పదంగా కనిపించడంతో.. స్థానికులు వెంటనే దీని గురించి అధికారులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి.. దాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. అప్పుడే.. ఇది వరల్డ్ వార్-2 కాలం నాటికి చెందిన బాంబ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన అధికారులు.. ఆ ప్రదేశానికి బాంబ్ స్క్వాడ్‌ని పిలిచి, ఆపరేషన్ నిర్వహించారు. రెండో ప్రపంచ యుద్ధం కోసం సిద్ధం చేసిన వేలాది బాంబులు మిగిలిపోవడంతో.. జర్మనీలో వాటిని పాతిపెట్టడం జరిగింది. వాటిల్లో ఇది ఒకటి అని అధికారులు తేల్చారు.


ఈ బాంబ్ వల్ల ఎప్పుడైనా సమస్య రావొచ్చన్న ఉద్దేశంతో.. ఆ ప్రాంతం నుంచి దాన్ని తరలించేందుకు అధికారులు ఒక ప్రత్యేక ఆపరేషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏదైనా జరగరాని ప్రమాదం జరగొచ్చన్న అనుమానంతో.. 500 మీటర్ల వ్యాసార్థంలో ఉన్న ప్రజలను ఆ ప్రాంతాన్ని తాత్కాలికంగా ఖాళీ చేయమని అధికారులు ఆదేశించారు. ఈ ఆదేశాల నేపథ్యంలో.. 13,000 మంది నివాసితులు తమ పెంపుడు జంతువులతో సహా తమ ఇళ్లను విడిచిపెట్టి, అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఈ బాంబ్ తరలింపు జోన్ పరిధిలోని రహదారుల్ని సైతం అధికారులు తాత్కాలికంగా మూసివేయడం జరిగింది. అయితే.. ఆ బాంబ్‌ని తరలించే ఆపరేషన్ ఇంకా పూర్తి అయ్యిందా? లేదా? అన్నది ఇంకా తెలియాలి.

ఇలా బాంబ్ దొరకడం ఇదే మొదటిసారి కాదు. 2017లో కూడా ఫ్రాంక్‌ఫర్ట్‌లో 1.4 టన్నుల బాంబును కనుగొనబడింది. అప్పుడు దాన్ని తరలించే ఆపరేషన్‌లో భాగంగా.. ఆ ప్రాంతంలో నివసించే 65,000 మందిని ఖాళీ చేయించాల్సి వచ్చింది. అలాగే.. 2021 డిసెంబర్‌లోనూ మ్యూనిక్ స్టేషన్ సమీపంలోని ఒక నిర్మాణ స్థలంలో రెండో ప్రపంచ యుద్ధానికి చెందిన బాంబ్ ఉన్నట్లుండి పేలింది. ఈ ప్రమాదంలో నలుగురు వ్యక్తులు గాయపడగా.. రైల్లే ట్రాఫిక్‌కు అంతరాయం కలిగింది.

Updated Date - 2023-08-08T15:43:27+05:30 IST