Woman: మహిళల్లో ఈ లక్షణాలెందుకుంటాయి? బయటపడడం ఎలా..!?

ABN , First Publish Date - 2023-10-10T17:07:07+05:30 IST

గడ్డాలూ, మీసాలూ పురుషుల లక్షణాలు. కానీ ఇవే లక్షణాలు కొందరు మహిళలను కూడా వేధిస్తూ ఉంటాయి. అయితే అంతర్గత ఆరోగ్య సమస్యకు సంకేతాలైన ఈ అవాంఛిత రోమాల మూలాలను సరిదిద్దుకోకుండా, సౌందర్య చికిత్సలను ఆశ్రయించడం సరి కాదు అంటున్నారు వైద్యులు.

Woman: మహిళల్లో ఈ లక్షణాలెందుకుంటాయి? బయటపడడం ఎలా..!?

గడ్డాలూ, మీసాలూ పురుషుల లక్షణాలు. కానీ ఇవే లక్షణాలు కొందరు మహిళలను కూడా వేధిస్తూ ఉంటాయి. అయితే అంతర్గత ఆరోగ్య సమస్యకు సంకేతాలైన ఈ అవాంఛిత రోమాల మూలాలను సరిదిద్దుకోకుండా, సౌందర్య చికిత్సలను ఆశ్రయించడం సరి కాదు అంటున్నారు వైద్యులు.

గడ్డం మీద, పై పెదవి పైన వెంట్రుకలు పెరిగితే, బ్యూటీ పార్లర్‌కు వెళ్లి వ్యాక్సింగ్‌ లేదా త్రెడింగ్‌ చేయించుకోవడం పరిపాటి. కానీ ముందెప్పుడూ కనిపించని ఈ వెంట్రుకలు అకస్మాత్తుగా ఎందుకు పెరగడం మొదలుపెట్టాయో ఆలోచించడం అవసరం. 14 ఏళ్ల వయసు ఆడపిల్లలు మొదలు, 35 ఏళ్ల మధ్య వయస్కుల వరకూ ‘హిర్సుటిజం’ అనే ఈ సమస్య వేధిస్తూ ఉంటుంది. మరీ ముఖ్యంగా ఇటీవలి కాలంలో యుక్తవయసు ఆడపిల్లల్లో ఈ సమస్య పెరుగుతోంది. అందుకు ఎన్నో కారణాలున్నాయి.

ఆ కారణాల వల్లే....

మహిళల శరీరంలో పురుష హార్మోన్‌ ‘టెస్టోస్టెరాన్‌’ మోతాదు పెరగడం వల్ల అవాంఛిత రోమాలు పెరగడం మొదలు పెడతాయి. గడ్డం, పై పెదవి మీద వెంట్రుకలు పెరగడంతో పాటు, ఛాతీ, కాళ్లూ, చేతుల మీద కూడా రోమాలు అవసరానికి మించి పెరుగుతూ ఉంటాయి. అలాగే మధ్య వయసు మహిళల్లో నుదుటి దగ్గరి వెంట్రుకలు ఊడిపోయి, బాల్డ్‌నెస్‌ మొదలవుతుంది. కొందరు టీనేజర్లు, మహిళల్లో పాలీ సిస్టిక్‌ ఒవేరియన్‌ సిండ్రోమ్‌ (పిసిఒడి) సమస్య ఉంటుంది. దీన్లో యాండ్రోజన్లు (పురుష హార్మోన్లు) మోతాదు పెరుగుతుంది. ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ (ఇన్సులిన్‌ పని చేయకపోవడం) పెరుగుతుంది. దాంతో బరువు పెరిగిపోతారు. నెలసరి కూడా క్రమం తప్పుతుంది. అలాగే అవాంఛిత రోమాలు కూడా పెరుగుతాయి. క్రమం తప్పిన నెలసరి, ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌, అధిక యాండ్రోజన్లు... ఈ మూడింటి వల్ల విపరీతంగా బరువు పెరిగిపోతారు.

మొటిమలు, అవాంఛిత రోమాలు మొదలవుతాయి. అలాగే కొందరిలో అడ్రెనలిన్‌ గ్లాండ్‌లో, శరీరంలోని ఇతర ప్రదేశాల్లో యాండ్రోజన్స్‌ పెరిగినా అవాంఛిత రోమాలు వేధిస్తాయి.

ఇలా కనిపెట్టాలి

అవాంఛిత రోమాలు అంతర్గత అనారోగ్యానికి సూచలనలని తేలికగానే గ్రహించవచ్చు. వారం రోజుల్లోగా మునుపు కనిపించని రోమాలు వేగంగా పెరిగినా, అసాధారణ ప్రదేశాల్లో కొత్త రోమాలు పెరగడం మొదలు పెట్టినా, మందంగా, పొడవుగా పెరుగుతున్నా అనుమానించాలి.

మూల కారణాలను వెతికి...

పిసిఒడి మూలంగా అవాంఛిత రోమాలు పెరుగుతున్నప్పుడు, వాటిని తొలగించుకోవడం కోసం లేజర్‌ చికిత్సను ఎంచుకోవడం సరి కాదు. ఆ చికిత్సతో రోమాలు తొలగిపోయినా, అంతర్గత ఆరోగ్య సమస్య అలాగే ఉండిపోతుంది. కాబట్టి సమస్యకు మూల కారణాన్ని తెలుసుకోవడం కోసం వైద్యులను సంప్రతించడం తప్పనిసరి. చికిత్సతో పిసిఒడిని అదుపులోకి తెచ్చుకోవడంతో పాటు, తిరిగి బరువు పెరగకుండా సమతులాహారం తీసుకుంటూ, వ్యాయామం చేస్తూ ఉంటే, అవాంఛిత రోమాలు తగ్గుముఖం పడతాయి. అలాగే ఇన్సులిన్‌ రెసిస్టెన్స్‌ను దారిలోకి తెచ్చుకోవడం కోసం కూడా ఇవే నియమాలు పాటించాలి. ఈ జాగ్రత్తలు తీసుకుంటూ లేజర్‌ చికిత్స తీసుకుంటే, ఫలితం కూడా మెరుగ్గా ఉంటుంది. ఒకవేళ అవసరానికి మించిన యాండ్రోజన్ల మూలంగా అవాంఛిత రోమాలు పెరుగుతూ ఉంటే, యాంటీ ఆండ్రోజన్‌ మందులు తీసుకోవలసి ఉంటుంది.

-డాక్టర్‌ కె. శిల్పి రెడ్డి

అబ్‌స్టెట్రీషియన్‌ అండ్‌ గైనకాలజిస్ట్‌,

క్లినికల్‌ డైరెక్టర్‌, హెఒడి,

కిమ్స్‌ కడిల్స్‌ మదర్‌ అండ్‌ చైల్డ్‌ సెంటర్‌,

కొండాపూర్‌, హైదరాబాద్‌.

Updated Date - 2023-10-10T17:07:07+05:30 IST