Remedy: నోటి పుండ్లతో బాధపడుతున్నారా? అయితే ఇలా చేయండి!
ABN , First Publish Date - 2023-11-07T12:04:48+05:30 IST
నోటి పుండ్లతో తినడం కష్టమవుతుంది. అయితే రోజుల తరబడి వీటితో బాధపడే బదులు ఇవిగో ఈ సహజసిద్ధమైన చిట్కాలతో

నోటి పుండ్లతో తినడం కష్టమవుతుంది. అయితే రోజుల తరబడి వీటితో బాధపడే బదులు ఇవిగో ఈ సహజసిద్ధమైన చిట్కాలతో వాటిని తగ్గించే ప్రయత్నం చేయండి.
తేనె: తేనెలో ఔషధగుణాలు నోటి పుండ్లనూ తగ్గిస్తాయి. కాబట్టి తేనెను నేరుగా పుండ్ల మీద పూయాలి. నోట్లో తేనెను ఉమ్మితో కలిపి మింగేస్తూ ఉంటాం. కాబట్టి ప్రతి రెండు గంటలకొకసారి తేనెను పూస్తూ ఉండాలి. తేనెలోని ఔషధగుణాలు పుండును త్వరితంగా మాన్పుతాయి. అలాగే తేనె పుండు మీద ఒక పొరలాగా ఏర్పడి, ఆహారం తినేటప్పుడు పుండు మరింత బాధ పెట్టకుండా అడ్డు పడుతుంది. ఇలా తేనెను వాడడం వల్ల రెండు రోజుల్లోనే పుండ్లు మానతాయి.
సోడా ఉప్పు: ఒక గిన్నెలో సమపాళ్లలో సోడా ఉప్పు, నీళ్లు కలుపుకోవాలి. ఇలా చిక్కటి మిశ్రమం తయారుచేసుకుని, పుండు మీద, దాని చుట్టూ పూసుకోవాలి. తర్వాత ఆరేవరకూ ఆగాలి. ఆరిన తర్వాత నీటితో నోరు పుక్కిలించుకోవాలి. ఇలా రోజు మ్తొతంలో మూడు నుంచి నాలుగు సార్లు చేయాలి. సోడాఉప్పు క్షారతత్వం కలిగి ఉంటుంది కాబట్టి నోట్లోని ఆమ్లం తీవ్రత తగ్గుతుంది. దాంతో పుండు మానుతుంది.
కొబ్బరినూనె: రాత్రి నిద్రకు ముందు కొబ్బరినూనెను పుండు మీద పూసుకోవాలి. కొబ్బరినూనెలోని యాంటీమైక్రోబియల్ గుణాలు పుండును మాన్పుతాయి.
ఉప్పు నీళ్లు: గ్లాసు గోరువెచ్చని నీళ్లలో చెంచా ఉప్పు కలపాలి. ఈ నీటితో నిమిషం పాటు నోరు పుక్కిలించాలి. తర్వాత ఉప్పదనం తగ్గడం కోసం మామూలు నీటితో పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండు నుంచి మూడు సార్లు చొప్పున మూడు రోజుల పాటు చేయాలి. ఉప్పు యాంటీసెప్టిక్‌లా పని చేస్తుంది. కాబట్టి పుండు త్వరగా మానుతుంది.
టూత్‌పే్‌స్ట: వేలితో టూత్‌పే్‌స్ట తీసుకుని పుండు మీద, దాని చుట్టూ పూసుకోవాలి. అది ఆరేవరకూ ఐదు నిమిషాల పాటు ఆగాలి. తర్వాత నీటితో పుక్కిలించాలి. ఇలా రోజుకు రెండుసార్లు చేస్తే నోటి పుండ్లు తగ్గుతాయి.
లవంగ నూనె: దూది ఉండను లవంగ నూనెలో ముంచి, పుండు మీద ఉంచాలి. నూనెను పుండు పీల్చుకునే వరకూ ఆగి, దూదిని తీసేయాలి. లవంగ నూనెలో ‘యూజెనాల్’ పుండును త్వరగా మాన్పుతుంది. నొప్పినీ తగ్గిస్తుంది. అయితే లవంగ నూనె తగిలిన వెంటనే మంట పుడుతుంది. అయితే ఆ కొద్దిసేపు ఓర్చుకుంటే నోటి పుండ్లు త్వరగా మానతాయి.
కొబ్బరిపాలు: రోజుకు మూడు సార్లు చొప్పున మూడు రోజుల పాటు కొబ్బరిపాలతో నోరు పుక్కిలించాలి. లేదంటే నోటి నిండా కొబ్బరి పాలను తీసుకుని, ఆ బుగ్గ నుంచి ఈ బుగ్గకు మారుస్తూ నిమిషంపాటు ఇలా చేసి, ఉమ్మేయాలి. కొబ్బరిపాలలోని యాంటీ మైక్రోబియల్, యాంటీ వైరల్ గుణాలు నోటి పుండ్లను మాన్పుతాయి.