Medicines: చుక్కల్లోకి మందుల ధరలు! 12 శాతం పెంపు.. 1 నుంచే అమలు

ABN , First Publish Date - 2023-03-29T12:22:51+05:30 IST

నిత్యావసర మందుల ధరలు ఒక్కసారిగా 12% పెరగనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచే ఈ పెంపు అమలులోకి రానుంది. ధరలు పెరిగే వాటిలో జ్వరం, ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, బీపీ, చర్మ వ్యాధులు, అనీమియా తదితర చికిత్సల్లో

Medicines: చుక్కల్లోకి మందుల ధరలు! 12 శాతం పెంపు.. 1 నుంచే అమలు
Medicines

800కు పైగా ఔషధాల రేట్లపై ప్రభావం

విదేశీ ముడిపదార్థాల ధర పెరుగుదలతోనే?

18 ఫార్మా సంస్థల లైసెన్సులు రద్దు

నకిలీ ఔషధాల తయారీయే కారణం

‘సీలన్‌’ కేన్సర్‌ మందులో హానికర బ్యాక్టీరియా

హైదరాబాద్‌ సంస్థ ఉత్పత్తి నిలిపివేతకు ఆదేశం

న్యూఢిల్లీ, మార్చి 28: నిత్యావసర మందుల ధరలు ఒక్కసారిగా 12% పెరగనున్నాయి. ఏప్రిల్‌ 1 నుంచే ఈ పెంపు అమలులోకి రానుంది. ధరలు పెరిగే వాటిలో జ్వరం, ఇన్ఫెక్షన్లు, గుండె జబ్బులు, బీపీ, చర్మ వ్యాధులు, అనీమియా తదితర చికిత్సల్లో వినియోగించే మందులతోపాటు పెయిన్‌ కిల్లర్లు, యాంటీబయాటిక్స్‌, యాంటీఇన్ఫెక్టివ్స్‌ కూడా ఉన్నాయి. తాజా పెంపు ప్రభావం జాతీయ నిత్యావసర మందుల జాబితాలోని 800కుపైగా మందులపై పడనుంది. 27 చికిత్సలకు సంబంధించిన సుమారు 900 మిశ్రమాలలో వినియోగించే 384 పదార్థాల ధరలు 12 శాతం పెరిగినట్టు ఓ ఆంగ్ల పత్రిక ప్రచురించింది. కాగా, విదేశాల నుంచి దిగుమతి చేసుకొనే ముడి పదార్థాలే ప్రధానంగా ఈ ధరల పెంపునకు కారణమని భిలాయ్‌కి చెందిన కెమిస్ట్‌ రాజేశ్‌ గౌర్‌ తెలిపారు. ఔషధాల్లో వినియోగించే ముడిపదార్థాలు, ఏపీఐ(యాక్టివ్‌ ఫార్మాస్యూటికల్‌ ఇంగ్రెడియంట్స్‌) ధరలు బాగా పెరిగాయని, దీంతోపాటు సరకు రవాణా, ప్యాకింగ్‌ ధరలు కూడా పెరిగాయని చెప్పారు. ఫలితంగా మందుల గరిష్ఠ అమ్మకం ధర(ఎంఆర్‌పీ) 12 శాతం పెరగనున్నట్టు తెలిపారు.

18 ఫార్మా కంపెనీల లైసెన్సులు రద్దు

నకిలీ మందులు తయారు చేస్తున్న 18 ఫార్మాస్యూటికల్‌ కంపెనీల లైసెన్సులను కేంద్ర ప్రభుత్వం మంగళవారం రద్దు చేసింది. గతేడాది అక్టోబరు నుంచి గాంబియా, ఉజ్బెకిస్థాన్‌, అమెరికా దేశాల్లో భారత కంపెనీల నకిలీ మందుల వ్యవహారం వెలుగులోకి వచ్చిన అనంతరం ప్రభుత్వం తొలిసారిగా ఈ చర్యలు చేపట్టింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబసంక్షేమశాఖ పరిధిలోని కేంద్ర ఔషధ ప్రమాణాల నియంత్రణ సంస్థ(సీడీఎస్‌సీవో) దేశవ్యాప్తంగా 20 రాష్ట్రాల్లోని ఫార్మా కంపెనీల్లో తనిఖీలు నిర్వహించింది. వీటిలో ఏపీ, తెలంగాణ, బిహార్‌, ఢిల్లీ, గోవా, గుజరాత్‌, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్‌, జమ్మూకశ్మీర్‌, మధ్యప్రదేశ్‌, ఉత్తరాఖండ్‌, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలు ఉన్నాయి. అత్యధికంగా హిమాచల్‌ప్రదేశ్‌లో 70, ఉత్తరాఖండ్‌లో 45, మధ్యప్రదేశ్‌లో 23 కంపెనీలలో తనిఖీలు చేపట్టినట్టు ఓ ఆంగ్ల వార్తాసంస్థ తెలిపింది. తొలిదశలో 76 కంపెనీలపై ప్రభుత్వం చర్యలు చేపట్టిందని, వాటిలో 18 కంపెనీల లైసెన్సులు రద్దు చేసిందని ఒక అధికారి తెలిపారు.

Updated Date - 2023-03-29T12:26:02+05:30 IST