Virus: వైద్య నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..!

ABN , First Publish Date - 2023-03-15T13:14:17+05:30 IST

కరోనా కాలం (Corona period)లో మాస్కుల వాడకం, ఇతర జాగ్రత్తల వల్ల.. మిగతా వైరస్‌ల (Virus) నుంచీ ప్రజలకు రక్షణ లభించింది! కానీ, మళ్లీ

Virus: వైద్య నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..!
ఏటా టీకాలు తీసుకోవాలని

పదేపదే వైరల్‌ దాడులు

తరచుగా జబ్బున పడుతున్న జనం.. భవిష్యత్తులో వైర్‌సలు మరింత విజృంభించే ముప్పు

ఏటా టీకాలు తీసుకోవాలని వైద్య నిపుణుల సూచన

హైదరాబాద్‌, మార్చి 14 (ఆంధ్రజ్యోతి): కరోనా కాలం (Corona period)లో మాస్కుల వాడకం, ఇతర జాగ్రత్తల వల్ల.. మిగతా వైరస్‌ల (Virus) నుంచీ ప్రజలకు రక్షణ లభించింది! కానీ, మళ్లీ కరోనా పూర్వ పరిస్థితులు ఏర్పడ్డాక రకరకాల వైర్‌సలు పంజా విసురుతున్నాయి. జనాలపై పదేపదే దాడి చేస్తున్నాయి. దాంతో చాలామందిలో తరచుగా జ్వరం, జలుబు, దగ్గు బారిన పడడం సాధారణంగా మారింది. మందులు వాడితే తగ్గిపోవడం.. మళ్లీ పది-పదిహేను రోజులకోసారో, నెలకొకసారో.. అనారోగ్య సమస్యలు తలెత్తడం. ఇదీ పరిస్థితి. ఒకవైపు వైర్‌సలు, మరోవైపు బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్స్‌ విజృంభణతో జనం అల్లాడిపోతున్నారు. చిన్నారుల్లో స్వైన్‌ప్లూ కేసులు పెరుగుతున్నాయి.

భవిష్యత్తులోనూ..

వైరస్‌లలో మ్యుటేషన్లు(జన్యుమార్పులు) సహజం. సాధారణంగా మ్యుటేషన్ల వల్ల అవి బలహీనపడతాయి. అరుదైన సందర్భాల్లో మాత్రమే బలాన్ని సంతరించుకుని మరింత ప్రమాదకరంగా తయారవుతాయి. ఏ వైరస్‌ ఎప్పుడు ఎలా మారుతుందో చెప్పలేం కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి మహమ్మారుల దాడిని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని వైరాలజీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. వాతావారణంలో మార్పులు, పట్టణీకరణ, ప్రజల్లో ఊబకాయం పెరగడం, దీర్ఘకాలిక వ్యాధుల ప్రభావం, ఆహారపుటలవాట్లు, నిద్రలేమి.. రకరకాల కారణాలవల్ల ప్రజల్లో రోగనిరోధకశక్తి తగ్గిపోతోందని, కాబట్టి వైర్‌సల విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు.

అర్థంకాని లక్షణాలు

గతంలో ఫ్లూ వస్తే లక్షణాలు తెలిసేవని.. ఇప్పుడు రకరకాల లక్షణాలు కనిపిస్తున్నాయని వైద్యులు చెబుతున్నారు. ఉదాహరణకు.. ఫ్లూ బారిన పడితే గతంలో ఎగువ శ్వాసకోశ సమస్యలతోపాటు, జలుబు, పొడిదగ్గు, జ్వరం, ఒళ్లునొప్పులు ఉండేవి. కానీ ఇప్పుడు ఫ్లూ వస్తే విరేచనాల వంటి లక్షణాలు కూడా కనిపిస్తున్నట్లు చెబుతున్నారు. ఒకేసారి 2-3 రకాల వైర్‌సలతో పాటు బ్యాక్టీరియాలు కూడా దాడి చేయడం వల్ల వ్యాధి లక్షణాలను వెంటనే నిర్ధారించలేకపోతున్నామని డాక్టర్స్‌ అంటున్నారు. గతంలో 90 శాతం వ్యాధిలక్షణాల ఆధారంగా జబ్బేంటో గుర్తించి చికిత్స అందించేవారు. తగ్గకపోతే ఆ తర్వాత టెస్టులు చేసేవారు. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదని అంటున్నారు.

మనమేం చేయాలంటే..

వైద్యులు చెబుతున్నదాని ప్రకారం.. 3-5 సంవత్సరాలకొకసారి ఫ్లూ తీవ్రత పెరుగుతుంది. వాతావారణం మారినప్పుడు.. అంటే చలి కాలం ముగిసి ఎండాకాలం వచ్చే సమయంలో దీని ముప్పు ఎక్కువగా ఉంటుంది. దాన్ని దీటుగా ఎదుర్కోవాలంటే మన జీవనశైలిలో మార్పులు చేసుకోవాలని, రోగనిరోధకశక్తిని పెంచుకోవాలని వైద్యనిపుణులు సూచిస్తున్నారు. క్రమపద్ధతి లేని జీవనశైలి వల్ల ఇమ్యూనిటీ స్థాయులు తగ్గుతాయని.. అప్పుడు చిన్నపాటి వైర్‌సలు, బ్యాక్టీరియా దాడి చేసినా జబ్బుపడే ప్రమాదం ఉంటుందని వారు హెచ్చరిస్తున్నారు. దీన్ని ఎదుర్కోవాలంటే.. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని, ఫ్లూ బారిన పడ్డవారు విధిగా మాస్క్‌ వాడాలని, బహిరంగ ప్రదేశాలకు వెళ్లినప్పుడు అందరూ మాస్క్‌ ధరించడం మంచిదని సూచిస్తున్నారు.

తప్పనిసరి..

దేశంలో బీపీ, షుగర్‌తో పాటు క్యాన్సర్‌, దీర్ఘకాలిక మూత్రపిండవ్యాధుల బారిన పడేవారి సంఖ్య పెరుగుతోంది. సహజంగానే చాలామందిలో యాభై దాటాక రోగనిరోధకశక్తి తగ్గుతుంది. ఈ వ్యాధుల బారిన పడితే మరింత తగ్గిపోతుంది. ఇటువంటి వారిపై వైరస్‌లు, బ్యాక్టీరియా దాడి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, 50 దాటిన వారంతా ఫ్లూ వ్యాక్సిన్‌ తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతోపాటు న్యూమోకోకల్‌ వ్యాక్సిన్‌ కూడా తప్పనిసరని హెచ్చరిస్తున్నారు. ఫ్లూ వ్యాక్సిన్స్‌ అన్ని వయసుల వారూ తీసుకోవచ్చని చెబుతున్నారు.

dld.jpg

నిరోధంపైనే దృష్టి పెట్టాలి

ఇటీవల వైరస్‌లు విజృంభిస్తున్నాయి. మున్ముందు వాటి దాడి మరింత పెరిగే ప్రమాదం లేకపోలేదు. ప్రజలు జీవనశైలిని మార్చుకోవడంతో పాటు జాగ్రత్తలు పాటించి, ఇమ్యూనిటీ లెవల్స్‌ను పెంచుకోవాలి. జబ్బు వచ్చాక చికిత్స చేయడం ఖరీదైన వ్యవహారం. కాబట్టి ప్రభుత్వాలు కూడా రోగనిరోధంపైనే దృష్టి సారించి.. ఆరోగ్యసంరక్షణకు సంబంధించిన నిధుల్లో 90% దాని కోసమే ఖర్చుపెట్టాలి. అప్పుడు మిగతా నిధులను చికిత్సకు వెచ్చిస్తే సరిపోతుంది.

- డాక్టర్‌ బుర్రి రంగారెడ్డి, ప్రెసిడెంట్‌, ఇన్ఫెక్షన్‌ కంట్రోల్‌ అకాడమీ ఆఫ్‌ ఇండియా

Updated Date - 2023-03-15T13:14:17+05:30 IST