Pregnancy: ఇష్టానుసారం ఐపిల్స్‌ వాడితే..

ABN , First Publish Date - 2023-08-15T12:20:20+05:30 IST

ప్రసూతి వైద్యురాలిగా దశాబ్దాల అనుభవమున్న వైద్యురాలు డాక్టర్‌ బాలాంబ. ఆవిడ వైద్య ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు, అనుభూతులు. అలాంటి ఒక ప్రత్యేక అనుభవాన్ని ఆవిడ ‘నవ్య’తో ఇలా పంచుకున్నారు.

Pregnancy: ఇష్టానుసారం ఐపిల్స్‌ వాడితే..

ప్రసూతి వైద్యురాలిగా దశాబ్దాల అనుభవమున్న వైద్యురాలు డాక్టర్‌ బాలాంబ. ఆవిడ వైద్య ప్రయాణంలో ఎన్నో మరుపురాని జ్ఞాపకాలు, అనుభూతులు. అలాంటి ఒక ప్రత్యేక అనుభవాన్ని ఆవిడ ‘నవ్య’తో ఇలా పంచుకున్నారు.

అది లాక్‌డౌన్‌ కాలం. ఒక రోజు దూర ప్రాంతానికి చెందిన ఒక అత్యవసర కేసును నాకు రిఫర్‌ చేశారు. ఆవిడ గర్భాశయం లోపల ఒక మూలన గర్భం ఉంది అని నాకు తెలిసింది. దీన్ని యాంగ్యులర్‌ ప్రెగ్నెన్సీ అంటారు. అది ప్రమాదకరమైన పరిస్థితి. పేషెంట్‌ ఆరోగ్య పరిస్థితి కంటే ఆవిడ మానసిక పరిస్థితి మరింత దారుణంగా ఉంది. అప్పటికే ఆవిడకు పెళ్లై పదేళ్లు. లేక లేక వచ్చిన తొలి గర్భం అది. కాబట్టి ‘‘మీరేం చేస్తారో నాకు తెలియదు మేడమ్‌, ఆ పిండాన్ని ఎలాగోలా గర్భంలోకి ప్రవేశపెట్టండి. ఈ గర్భం నిలవకపోతే, నేను ఆత్మహత్య చేసుకుంటాను’’ అంటూ ఆవిడ ఏడ్వడం మొదలు పెట్టింది. జాగ్రత్తగా పరిశీలిస్తే, లోపం పిండంలో కాదు, గర్భాశయంలోనే ఉందనే విషయాన్ని నేను గ్రహించాను. సర్జరీ చేసి ఆ సమస్యను గుర్తించి, దాన్ని ఆవిడ భర్తకు చూపించి తిరిగి కుట్టు వేసేశాను. మర్నాడు స్కాన్‌ చేయిస్తే, లోపల బిడ్డ చనిపోయిందనే విషయం తేలింది. సాధారణంగా బిడ్డ... తల్లి గర్భంలో రూపం పోసుకునేటప్పుడు, కొబ్బరి చిప్పల్లా రెండు సగ భాగాలు దగ్గరకు చేరుకుని అతుక్కుంటాయి. అప్పుడు మధ్యలో ఉన్న గోడ కరిగిపోయి, ఒక గర్భసంచీలో పిండం పెరగడం మొదలు పెడుతుంది. ఈవిడ పరిస్థితిలో రెండు సగ భాగాలూ అతుక్కున్నప్పటికీ, మధ్యలో గోడ కరగలేదు. అందువల్లే పిల్లలు కలగడం లేదు. ఆ విషయాన్ని వాళ్లకు వివరించి, హిస్ట్రోస్కోపీ ద్వారా ఆ గోడను తొలగించాను. అలాగే ఆ పిండాన్ని కూడా తీసి పంపించేశాను. అలా ఆ కేసుతో ఆ రాత్రి నాకు నిద్ర లేకుండా పోయింది. తర్వాత అదే మహిళ మళ్లీ గర్భం దాల్చి నా దగ్గరకే వచ్చింది. డెలివరీ చేసి పంపించేశాను.

భయంతో నా దగ్గరకు వచ్చింది...

అదే మహిళ కొంత కాలం క్రితం మళ్లీ నన్ను కలిసింది. పండగలనీ, పెళ్ళిళ్లనీ ఐ పిల్స్‌ను ఎడా పెడా వాడేసింది. దాంతో నెలసరి రావడం ఆగిపోయింది. వైద్యులను కలిస్తే గర్భం దాల్చినట్టు చెప్పారు. మరి అన్ని ఐపిల్స్‌ వాడాను కాబట్టి లోపల పెరిగే బిడ్డ మీద వాటి ప్రభావం పడి ఉంటుందేమోననే భయంతో నా దగ్గరకు పరిగెత్తుకొచ్చింది. అప్పటికే ఆవిడకు మూడు నెలలు దాటిపోయాయి. ఒకానొక సమయంలో పిల్లలు పుట్టకపోతే ఆత్మహత్య చేసుకుంటాను అన్న అదే మహిళ, ఇప్పుడు నాకు ఈ గర్భం వద్దంటూ అడగడం నన్నెంతో ఆశ్చర్యానికి గురి చేసింది. ‘‘ఇప్పుడేం చేయాలి? ఇప్పుడేం చేయాలి?’’ అని కంగారు పడిపోతున్న ఆవిడతో నేనిలా చెప్పాను. ‘‘ఒకప్పుడు పిల్లలు లేరని ఏడ్చావు. ఇప్పుడు నువ్వు కోరుకోకుండానే గర్భం వచ్చింది. కాబట్టి దీన్ని ఇలాగే కొనసాగించు. బిడ్డలో ఏదైనా అవకారం ఏర్పడితే అప్పుడు ఆలోచిద్దాం!’’ అని చెప్పి గర్భాన్ని కొనసాగించేలా చేశాను. అదృష్టవశాత్తూ గర్భంలో పిండం ఆరోగ్యంగానే ఉంది. అయితే ఐపిల్స్‌ను ఇష్టారాజ్యంగా వాడేసి, కంగారుగా డాక్టర్ల దగ్గరకు పరిగెత్తుకొచ్చే బదులు, బాధ్యతాయుతంగా వ్యవహరించవచ్చు కదా? అని ఆవిడకు హితబోధ చేశాను. నిజానికి ఇది నేటి యువతులందరికీ వర్తిస్తుంది.

3w.jpg

డాక్టర్‌ బాలాంబ

ప్రసూతి వైద్యురాలు,

హైదరాబాద్‌.

Updated Date - 2023-08-15T12:22:49+05:30 IST