APలో ఉన్నత విద్య తిరోగమనం!

ABN , First Publish Date - 2023-01-31T12:45:27+05:30 IST

ఉన్నత విద్య (higher education)లో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోంది. అన్ని రాష్ర్టాల్లో ఏటా అడ్మిషన్లు పెరుగుతుంటే ఏపీ (AP) లో మాత్రం

APలో ఉన్నత విద్య తిరోగమనం!
‘పీజీ’ పరేషాన్‌!

‘పీజీ’ పరేషాన్‌!

ఫీజు రీయింబర్స్‌మెంట్‌ రద్దుతో ఏటా తగ్గిపోతున్న విద్యార్థులు

2016-17లో 2,54,650 మంది

2020-21 నాటికి 1,95,814 మందే

బిహార్‌ కన్నా ఏపీలోనే దారుణస్థితి

ఉన్నత విద్యపై కేంద్రం సర్వేలో వెల్లడి

అమరావతి, జనవరి 30(ఆంధ్రజ్యోతి): ఉన్నత విద్య (higher education)లో రాష్ట్రం తిరోగమనంలో సాగుతోంది. అన్ని రాష్ర్టాల్లో ఏటా అడ్మిషన్లు పెరుగుతుంటే ఏపీ (AP) లో మాత్రం విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. (Post Graduation) పోస్ట్‌ గ్రాడ్యుయేషన్‌ (పీజీ) కోర్సుల్లో చేరేవారి సంఖ్య నానాటికీ తీసికట్టుగా మారుతోంది. కేంద్ర విద్యా మంత్రిత్వశాఖ విడుదల చేసిన ‘ఉన్నత విద్యపై జాతీయ సర్వే-2020-21’లో ఈ విషయం బహిర్గతమైంది. కర్నాటక, తమిళనాడు, తెలంగాణ, ఒడిసా, కేరళ, పుదుచ్చేరి రాష్ర్టాల్లో పీజీ విద్యార్థుల సంఖ్య పెరుగుతుంటే, మొత్తం దక్షిణాదిలో ఒక్క ఏపీలోనే వీరి సంఖ్య తగ్గిపోతోంది. వైసీపీ అధికారం (Ycp government)లోకి వచ్చాక పీజీ కోర్సులకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌ (Fees Reimbursement)ను రద్దు చేసింది. ఈ ప్రభావంతో గత మూడేళ్లలో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. టీడీపీ (TDP) హయాంలో ప్రభుత్వం రీయింబర్స్‌మెంట్‌ను అమలు చేయడంతో విద్యార్థులు పెద్దఎత్తున పీజీలో చేరారు. జగన్‌ అధికారంలోకి వచ్చాక రీయింబర్స్‌మెంట్‌ను ఎత్తేయడంతో పేద విద్యార్థులు ఉన్నత విద్యకు దూరమవుతున్నారు. 2016-17లో 2,54,650 మంది విద్యార్థులు రాష్ట్రంలో పీజీ చదవగా, 2020-21 నాటికి ఆ సంఖ్య 1,95,814కు తగ్గిపోయింది. ఇక గతేడాది, ఈ విద్యా సంవత్సరంలో ఈ సంఖ్య దారుణంగా పడిపోయినట్లు తెలుస్తోంది. అనేక కాలేజీల్లో అసలు పీజీ కోర్సుల్లో విద్యార్థులు చేరడం లేదని యాజమాన్యాలు చెబుతున్నాయి. భవిష్యత్తులో పీజీ కోర్సుల పరిస్థితి మరింత దయనీయంగా మారే అవకాశం ఉందని భావిస్తున్నాయి. చాలా మంది విద్యార్థులు పక్క రాష్ర్టాలకు వెళ్తున్నారని, ఫీజులు కట్టలేనివారు డిగ్రీ (Degree)తోనే చదువును ఆపేస్తున్నారని యాజమాన్యాలు చెబుతుండడం గమనార్హం.

450 కోట్ల బకాయిలు

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఫీజుల భారం తగ్గించుకునేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. సంపూర్ణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పేరుతో ఫీజులను భారీగా తగ్గించేసింది. ఫలితంగా ఇంజనీరింగ్‌ (Engineering)లో పక్క రాష్ర్టాలకు వెళ్లే పరిస్థితి ఏర్పడింది. అనంతరం పీజీ కోర్సుల్లో అక్రమాలు జరుగుతున్నాయని ఫీజులు చెల్లించబోమని స్పష్టంచేసింది. అక్రమాలను నిగ్గు తేలుస్తామంటూ విచారణకు ఆదేశించింది. కానీ దీనిపై మూడు నాలుగుసార్లు విచారణ జరిపినా ఇంతవరకూ నిర్ణయం తీసుకోలేదు. విచారణను సాకుగా చూపి గత ప్రభుత్వంలో 2017-18 నుంచి ఉన్న పీజీ ఫీజు రీయింబర్స్‌మెంట్‌ బకాయిలు రూ.450 కోట్లను కాలేజీలకు నిలిపివేసింది. గత ప్రభుత్వం పీజీ కోర్సులకు గరిష్ఠంగా రూ.35 వేలు రీయింబర్స్‌ చేసింది. ఇంజనీరింగ్‌తో పోలిస్తే పీజీ కోర్సుల ఫీజులు తక్కువగానే ఉండటంతో విద్యార్థులు ఎలాంటి ఇబ్బందీ లేకుండా రీయింబర్స్‌మెంట్‌తోనే చదువుకున్నారు. కానీ, ఈ ప్రభుత్వం చదివితే ప్రభుత్వ కాలేజీల్లోనే చదవాలని మెలిక పెట్టింది. ప్రభుత్వ కాలేజీల్లో సౌకర్యాలు, ఫ్యాకల్టీ కొరత వంటి కారణాలు ఇబ్బందిగా మారాయి. గతంలో సమీపంలో ఉన్న ఏదో ఒక కాలేజీలో పీజీ చదువుకునే అవకాశం ఉండేది. కానీ, ఇప్పుడు ఆ అవకాశాన్ని జగన్‌ ప్రభుత్వం తొలగించింది. ఎంబీఏ (MBA), ఎంసీఏ (MCA), ఎంటెక్‌ లాంటి ఉపాధి అవకాశాలు మెరుగ్గా ఉండే కోర్సులను విద్యార్థులకు పూర్తిగా దూరం చేసింది.

బిహార్‌లోనూ పెరిగారు

పీజీ కోర్సుల విషయంలో బిహార్‌ (Bihar) కంటే కూడా ఏపీ వెనుకబడింది. బిహార్‌లో 2016-17లో 1,39,949 మంది విద్యార్థులుంటే 2020-21 నాటికి ఆ సంఖ్య 1,83,619కి పెరిగింది. కర్ణాటకలో 2016-17లో 2,03,889 మంది ఉంటే, 2020-21లో 2,79,188 మందికి పెరిగారు. కేరళలో 2016-17లో 1,07,374 మంది ఉంటే, 2020-21కి 1,66,519కి చేరారు. ఒడిసాలో 2016-17లో 66,305 మంది చదివితే, 2020-21 నాటికి 99,218 మందికి చేరారు. పుదిచ్చేరిలో 17,071 మంది ఉంటే 2020-21 నాటికి 26,224కు పెరిగారు. తమిళనాడులో 2016-17లో 4,43,997మంది ఉంటే, 2020-21 నాటికి 4,64,655కు పెరిగారు. ఇలా అన్ని రాష్ర్టాల్లో సంఖ్య పెరుగుతుంటే ఏపీలో మాత్రం సంఖ్య తగ్గిపోవడం ఆందోళనకరంగా మారింది.

pg.jpg

Updated Date - 2023-02-01T11:24:18+05:30 IST