Share News

Amma Odi: కోతకోసి కోతలా? అమ్మఒడిపై లేనిపోని గొప్పలు

ABN , First Publish Date - 2023-11-14T11:06:09+05:30 IST

ఎన్నికలకు ముందు అమ్మఒడి పథకం (Amma Odi) పేరుతో భారీగా ఓట్లు రాబట్టుకున్న జగన్‌ (Cm jagan), అధికారంలోకి వచ్చాక ఆ పథకం అమలులో పిల్లిమొగ్గలు వేస్తున్నారు.

Amma Odi: కోతకోసి కోతలా? అమ్మఒడిపై లేనిపోని గొప్పలు

  • ఒక్కో తల్లికి రూ.15 వేలు ఇస్తున్నారట

  • 2 వేలు తగ్గించి ఇస్తున్నది 13 వేలే

  • ఐదేళ్లలో నాలుగుసార్లే అమ్మఒడి

(అమరావతి-ఆంధ్రజ్యోతి): ఎన్నికలకు ముందు అమ్మఒడి పథకం (Amma Odi) పేరుతో భారీగా ఓట్లు రాబట్టుకున్న జగన్‌ (Cm jagan), అధికారంలోకి వచ్చాక ఆ పథకం అమలులో పిల్లిమొగ్గలు వేస్తున్నారు. మాట చెప్పినట్టు పథకం అమలు చేయకుండా ఓ ఏడాది కోత పెట్టారు. పైగా చెప్పిన మొత్తంలో కూడా కోత పెట్టారు. ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు ఇస్తామని గత ఎన్నికల ప్రచారంలో వైసీపీ ప్రకటించింది. సీఎం జగన్‌ సతీమణి భారతి స్వయంగా ఈ హామీని ప్రచారం చేశారు. ‘మీ ఇంట్లో ఇద్దరు పిల్లలుంటే రూ.30వేలు వస్తాయని చెప్పారు’. దీంతో నిజంగానే ప్రతి విద్యార్థికి నగదు ఇస్తారేమోనని తల్లిదండ్రులు ఆశపడ్డారు. కానీ అధికారంలోకి వచ్చేనాటికి విద్యార్థుల స్థానంలో తల్లులు అని మార్చారు. ప్రతి విద్యార్థికి అమ్మఒడి ఉండదని, ఎంతమంది పిల్లలను బడికి పంపినా తల్లికి రూ.15వేలు మాత్రమే ఇస్తామని తేల్చేశారు.

ఒక ఏడాది మిగులు

వైసీపీ ప్రభుత్వం (Ycp Government) ఏర్పాటుచేసిన నెల రోజులకు వేసవి సెలవుల అనంతరం బడులు తెరుచుకున్నాయి. అప్పుడు ఇవ్వాల్సిన అమ్మఒడిని ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా సంక్రాంతి పండగకు వాయిదా వేసింది. రెండేళ్ల పాటు అలాగే జనవరిలో అమ్మఒడి నగదు ఇచ్చారు. తర్వాత మళ్లీ అమ్మఒడి ఇచ్చే తేదీని మార్చేశారు. మొదట చెప్పిన దానికి విరుద్ధంగా మళ్లీ బడులు తెరిచే సమయంలోనే అమ్మఒడి విడుదల చేస్తోంది.

నగదు ఎగ్గొట్టే వ్యూహం

ముందుగా ఇచ్చిన ప్రకారం ఏటా జనవరిలోనే అమ్మఒడి ఇస్తే వచ్చే జనవరిలో ఇచ్చేది ఐదో విడత అయ్యేది. కానీ వ్యూహాత్మకంగా మధ్యలో తేదీ మార్చడం వల్ల, వచ్చే జూన్‌లో మళ్లీ అమ్మఒడి పడుతుంది. అంటే ఈ ఏడాది జూన్‌లో ఇచ్చిన నాలుగో విడత అమ్మఒడే ఈ ప్రభుత్వంలో చివరిది. దీనివల్ల ఒక ఏడాది అమ్మఒడి ఇవ్వకుండా ప్రభుత్వం ఎగ్గొట్టినట్లయింది. తద్వారా ప్రభుత్వానికి అక్షరాలా రూ.6,500 కోట్లు మిగులుతాయి. ఒక్కో తల్లికి రూ.15వేలు (ఖాతాలో పడేది రూ.13వేలు) నష్టం వాటిల్లుతుంది. ప్రభుత్వ విధానాలను పరిశీలిస్తే పక్కాగా ఇది నగదు ఎగ్గొటడానికేనని స్పష్టమవుతోంది.

తగ్గిపోతున్న తల్లులు

విద్యా రంగంపై ప్రభుత్వం తీసుకుంటున్న అస్తవ్యస్త నిర్ణయాల కారణంగా ప్రభుత్వ బడుల్లో విద్యార్థుల సంఖ్య దారుణంగా పడిపోతోంది. అయితే విద్యార్థులు ఎక్కడ చదివినా అమ్మఒడి నగదు అందాలి. కానీ లబ్ధిదారుల సంఖ్య ఏటా తగ్గుతూ వస్తోంది. 2020-21 విద్యా సంవత్సరంలో 44,48,865 మంది తల్లులు లబ్ధి పొందారు. 2021-22లో వారి సంఖ్య 43,96,402కు తగ్గింది. 2022-23లోనూ 43.96 లక్షల మందికి అమ్మఒడి ఇచ్చినట్లు ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. 2023-24లో లబ్ధిదారులు 42,61,695కు తగ్గిపోయారు. అమ్మఒడిలో తల్లులు ఎందుకు తగ్గుతున్నారో ప్రభుత్వానికే తెలియాలి.

15 వేలు ఇస్తున్నారట!

అమ్మఒడి పథకం కింద 75 శాతం హాజరు ఉన్న 1వ తరగతి నుంచి 12వ తరగతి చదివే పిల్లల తల్లుల ఖాతాల్లో ప్రతి ఏటా రూ.15 వేలు జమ చేస్తున్నాం. ఇప్పటి వరకూ ఈ పథకం ద్వారా 84 లక్షల మంది విద్యార్థులు లబ్ధి పొందారు.

వాస్తవం ఇదీ

వైసీపీ అధికారంలోకొచ్చాక మొదటి ఏడాదే రూ.15 వేలు ఇచ్చారు. రెండో ఏడాది మరుగుదొడ్ల నిర్వహణ పేరిట వెయ్యి, మూడో ఏడాది పాఠశాలల నిర్వహణ అంటూ మరో వెయ్యి కోత పెట్టారు. దీంతో అమ్మఒడి లబ్ధి రూ.13వేలకు తగ్గింది. ఐదేళ్లలో ఐదుసార్లు ఇస్తామన్న హామీ ఇప్పుడు నాలుగు విడతలకే పరిమితమైంది.

Updated Date - 2023-11-14T11:06:26+05:30 IST