Share News

Education: పాఠ్యపుస్తకాల్లోకి రామాయణం, భారతం!

ABN , First Publish Date - 2023-11-22T11:49:37+05:30 IST

మన దేశ చరిత్ర వర్గీకరణకు సంబంధించి కూడా కమిటీ కొత్త సిఫారసులు చేసింది. ఇప్పటి వరకూ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగాలుగా భారతదేశ చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నారు.

Education: పాఠ్యపుస్తకాల్లోకి రామాయణం, భారతం!

  • వేదాలు, ఆయుర్వేదానికీ చోటు

  • క్లాసికల్‌, మధ్యయుగ, బ్రిటిష్‌, ఆధునిక యుగాలుగా భారతదేశ చరిత్ర విభజన

  • ఎన్‌సీఈఆర్‌టీ కమిటీ సిఫారసులు

  • పాఠ్యప్రణాళికలో మార్పులపై కసరత్తు

  • దేశభక్తి లేకనే యువత విదేశాలకు వెళ్తున్నారని కమిటీ చైర్మన్‌ వ్యాఖ్య

న్యూఢిల్లీ, నవంబరు 21: రామాయణం (Ramayana), మహాభారతం (Mahabharata) ఇతిహాసాలను పాఠశాల స్థాయి చరిత్ర పాఠ్యపుస్తకాల్లో చేర్చాలని ఎన్‌సీఈఆర్‌టీ నియమించిన ఉన్నత స్థాయి కమిటీ సిఫారసు చేసింది. నూతన విద్యా విధానం-2020 ప్రకారం పాఠశాల పాఠ్య ప్రణాళికలను సవరించే కసరత్తును ఎన్‌సీఈఆర్‌టీ చేపట్టింది. దీంట్లో భాగంగా సామాజిక శాస్త్రాలకు సంబంధించి చేయాల్సిన మార్పులు, చేర్పులపై ఏడుగురు సభ్యులతో ఒక ఉన్నతస్థాయి కమిటీని గత ఏడాది ఏర్పాటు చేసింది. కేరళకు చెందిన విద్యావేత్త సీఐ ఐజాక్‌ ఈ కమిటీకి చైర్మన్‌గా నేతృత్వం వహిస్తున్నారు. సదరు కమిటీ తన తుది నివేదికలో పలు సిఫారసులు చేసింది.

వీటిలో కొన్నింటిని ఐజాక్‌ మంగళవారం మీడియాకు వెల్లడించారు. ‘7వ తరగతి నుంచి 12వ తరగతి వరకు విద్యార్థులకు రామాయణం, మహాభారతాలను బోధించటం అవసరం. దీనివల్ల టీనేజీ వయసులోనే విద్యార్థులకు ఆత్మగౌరవం, దేశభక్తి కలుగుతాయి. దేశభక్తి లేకపోవటం వల్లనే వేలాదిమంది విద్యార్థులు ఏటా విదేశాలకు వెళ్లిపోతున్నారు, విద్యార్థులు తమ మూలాలను అర్థం చేసుకోవాల్సి ఉంది. దేశం పట్ల, తమ సంస్కృతి పట్ల ప్రేమను అలవర్చుకోవాల్సి ఉంది’ అని ఐజాక్‌ పేర్కొన్నారు. ఇప్పటికే కొన్ని బోర్డులు రామాయణాన్ని విద్యార్థులకు బోధిస్తున్నాయి కానీ దానినొక పుక్కిటి పురాణంగా అభివర్ణిస్తున్నాయని తెలిపారు. రామాయణం వంటి ఇతిహాసాలను విద్యార్థులకు బోధించకపోతే అసలు విద్యావ్యవస్థకే అర్థం లేదని, దేశానికి ఏ విధంగానూ ఇది తోడ్పడదని చెప్పారు.

రామాయణ మహాభారతాలను పాఠ్యపుస్తకాల్లో ప్రవేశపెట్టాలని గతంలోనే సిఫారసులు వచ్చాయని, ఇండియా అనే పేరు బదులుగా భారత్‌ అని వాడాలని కూడా కమిటీ సిఫారసు చేసిందని ఐజాక్‌ వెల్లడించారు. మన దేశ చరిత్ర వర్గీకరణకు సంబంధించి కూడా కమిటీ కొత్త సిఫారసులు చేసింది. ఇప్పటి వరకూ ప్రాచీన, మధ్యయుగ, ఆధునిక యుగాలుగా భారతదేశ చరిత్రను విద్యార్థులకు బోధిస్తున్నారు. వీటిని ఇక నుంచి అత్యుత్తమ (క్లాసికల్‌), మధ్యయుగ, బ్రిటీష్‌, ఆధునిక యుగాలుగా వర్గీకరించాలని, క్లాసికల్‌ యుగం చరిత్రలో రామాయణ, భారతాలను ప్రవేశపెట్టాలని కమిటీ సిఫారసు చేసినట్లు ఐజాక్‌ తెలిపారు. వేదాలను, ఆయుర్వేదాన్ని కూడా విద్యార్థులకు బోధించాలని సిఫారసు చేసినట్లు వెల్లడించారు.

తరగతి గది గోడలపై రాజ్యాంగం ప్రవేశిక

పాఠశాలల్లో తరగతి గదుల గోడలపై రాజ్యాంగం ప్రవేశికను స్థానిక భాషల్లో రాయించాలని, నేతాజీ సుభాష్‌ చంద్రబోస్‌ తదితర జాతీయ నాయకుల గురించి మరింతగా విద్యార్థులకు తెలియజేయాలని కూడా కమిటీ సిఫారసు చేసింది. కమిటీ సిఫారసులను 19 మంది సభ్యులతో కూడిన ‘జాతీయ పాఠ్యప్రణాళిక, బోధన అభ్యసన ఉపకరణాల కమిటీ’ (ఎన్‌ఎ్‌సటీసీ) పరిశీలిస్తుంది. కొత్త పుస్తకాలు వచ్చే విద్యా సంవత్సరం అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

యూజీసీ నెట్‌ సిలబస్‌లో మార్పులు!

జేఆర్‌ఎఫ్‌కు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాల కోసం నిర్వహించే నెట్‌(నేషనల్‌ ఎలిజిబిలీటి టెస్ట్‌) పరీక్ష సిలబ్‌సలో మార్పులకు రంగం సిద్ధమైంది. సిలబస్‌ మార్పుల కోసం అతి త్వరలో ఓ నిపుణుల కమిటీని ఏర్పాటు చేస్తామని యూజీసీ చైర్మన్‌ జగదీశ్‌ కుమార్‌ మంగళవారం ప్రకటించారు. కొత్త సిలబ్‌సకు అనుగుణంగా విద్యార్థులు పరీక్షకు సిద్ధమయ్యేందుకు వీలుగా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. ఎన్‌టీఏ ఆధ్వర్యంలో యూజీసీ-నెట్‌ పరీక్ష ప్రతీ ఏడాది జూన్‌, డిసెంబరులో జరుగుతుంది.

మరిన్ని ఎడ్యుకేషనల్ వార్తల కోసం క్లిక్ చేయండి

Updated Date - 2023-11-22T11:54:14+05:30 IST