Inter colleges: సమస్యల సుడిలో ‘ఇంటర్‌’!

ABN , First Publish Date - 2023-06-01T11:36:04+05:30 IST

ప్రభుత్వ ఇంటర్మీడియెట్‌ కాలేజీలు సమస్యలకు నిలయాలుగా మారాయి. అటు అధ్యాపకుల కొరత, ఇటు వసతుల లేమి ఫలితాలపై

Inter colleges: సమస్యల సుడిలో ‘ఇంటర్‌’!
Inter colleges

ప్రభుత్వ కాలేజీల్లో అధ్యాపకుల కొరత

210 కళాశాలల్లో రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు లేరు

ఇన్‌చార్జ్‌లకు బోధనతో పాటు ‘నాడు–నేడు’

ఆర్‌ఐవోలు, డీవీఈవోలుగానూ ఇన్‌చార్జ్‌లు

అడ్మిషన్లు, సిలబస్‌పై కొరవడిన పర్యవేక్షణ

గతేడాది ఇంటర్‌లో 36 శాతమే ఉత్తీర్ణత

ఫలితంగా ప్రైవేటు బాటలో విద్యార్థులు

ఈ ఏడాది రెండంకెలు దాటని అడ్మిషన్లు

(అమరావతి–ఆంధ్రజ్యోతి): ప్రభుత్వ ఇంటర్మీడియెట్‌ కాలేజీలు (Inter colleges) సమస్యలకు నిలయాలుగా మారాయి. అటు అధ్యాపకుల కొరత, ఇటు వసతుల లేమి ఫలితాలపై తీవ్ర ప్రభావం చూపుతున్నాయి. గురువారం నుంచి ఇంటర్‌ తరగతులు ప్రారంభమవుతున్న నేపథ్యంలో ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు సమస్యలతో స్వాగతం పలుకుతున్నాయి. రాష్ట్రంలో 472 ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలుంటే, 210 కాలేజీలకు రెగ్యులర్‌ ప్రిన్సిపాళ్లు లేరు. దీంతో జూనియర్‌ లెక్చరర్లలోనే సీనియర్‌కు ఇన్‌చార్జ్‌ బాధ్యతలు అప్పగిస్తున్నారు. వారు సబ్జెక్టులు బోధించడంతో పాటు ‘నాడు– నేడు’ పనులు, ప్రిన్సిపాల్‌ బాధ్యతలు చూసుకోవాలి. దీంతో బోధనకు సమయం చాలావరకు తగ్గిపోతోంది. ఇక జిల్లాకొకరు చొప్పున 26 మంది జిల్లా ఇంటర్‌ విద్య అధికారులు (డీవీఈవో) ఉండాలి. కానీ రాష్ట్రంలో ఒక్క రెగ్యులర్‌ డీవీఈవో కూడా లేరు. దీంతో కాలేజీల్లో అకడమిక్‌ పర్యవేక్షణ పూర్తిగా దెబ్బతింటోంది. ఇన్‌చార్జ్‌లుగా ఉన్నవారు పూర్తిస్థాయిలో దృష్టి పెట్టలేకపోవడంతో విద్యార్థుల అడ్మిషన్లపై, సిలబస్‌పై పర్యవేక్షణ తూతూమంత్రంగా సాగుతోంది. ఇక ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన 13మంది రీజినల్‌ ఇన్‌స్పెక్టింగ్‌ అధికారులు(ఆర్‌ఐవో)లు ఉండాలి. వీరు కూడా ఒక్క రెగ్యులర్‌ అధికారి లేరు. దీంతో ప్రైవేటు కాలేజీలకు అనుమతులు, వాటిపై పర్యవేక్షణ లేకుండా పోయింది. ఫలితంగా ల్యాబ్‌లు ఉన్నా, లేకపోయినా వాటికి అనుమతులు జారీ అవుతున్నాయి. అలాగే 50ఏళ్ల క్రితం కట్టిన అనేక భవనాల్లోనే ఇప్పటికీ ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలు నడుస్తున్నాయి. నాడు– నేడు పనులు ప్రారంభించినా అవి ఇప్పట్లో పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. కొన్నిచోట్ల భవనాల కొరతతో డిగ్రీ, ఇంటర్‌ తరగతులను షిఫ్టుల పద్ధతిలో నడపాల్సిన దుస్థితి నెలకొంది. నాలుగేళ్లుగా ఇన్‌చార్జ్‌ అలవెన్సులు ఇవ్వకపోవడంతో ఎఫ్‌ఏసీలు రద్దు చేయాలని ఇన్‌చార్జ్‌ ప్రిన్సిపాళ్లు డిమాండ్‌ చేస్తున్నారు. ప్రభుత్వం మాత్రం బలవంతంగా వారికి బాధ్యతలు అప్పగిస్తోంది.

ఫలితాలపై ప్రభావం

ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో రెగ్యులర్‌ కంటే కాంట్రాక్టు, గెస్ట్‌ ఫ్యాకల్టీనే ఎక్కువమంది ఉన్నారు. 3,600 మంది కాంట్రాక్టు జూనియర్‌ లెక్చరర్లు, 1,200 మంది గెస్ట్‌ ఫ్యాకల్టీ కాలేజీల్లో పనిచేస్తుంటే, రెగ్యులర్‌ జూనియర్‌ లెక్చరర్లు 1,400 మంది మాత్రమే ఉన్నారు. 2,500కు పైగా రెగ్యులర్‌ జూనియర్‌ లెక్చరర్‌ పోస్టులు ఖాళీ ఉన్నాయి. సరైన పర్యవేక్షణ లేకపోవడంతో గత విద్యాసంవత్సరంలో కేవలం 36శాతం మంది విద్యార్థులే ప్రభుత్వ కాలేజీల్లో చదివి ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటుతో కలిపి వచ్చిన ఫలితాల్లో ఇది దాదాపుగా సగం మాత్రమే. మరోవైపు గతేడాది ప్రారంభించిన హైస్కూల్‌ ప్లస్‌లలో 12శాతం మంది మాత్రమే పాస్‌ కావడం, అక్కడ రెగ్యులర్‌ లెక్చరర్లు లేరనే ప్రచారం ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలపైనా పడింది. ఇక్కడ కూడా అంతా ఇన్‌చార్జ్‌లతో నడుస్తోందనే కారణంతో ఎక్కువ మంది విద్యార్థులు ప్రైవేటుకు వెళ్లిపోతున్నారు. ఐదారు కాలేజీలు మినహా ఇప్పటివరకూ ఎక్కడా రెండంకెల్లో కూడా అడ్మిషన్లు రాలేదంటే పరిస్థితి ఎంత దారుణంగా ఉందో అర్థంచేసుకోవచ్చు. మరోవైపు పెద్ద సంఖ్యలో ఉన్నప్పటికీ ప్రైవేటు ఇంటర్‌ కాలేజీల్లో అడ్మిషన్లు పూర్తయ్యాయంటూ బోర్డులు పెడుతున్నారు.

ఉచిత పుస్తకాలపై డైలమా

విద్యారంగంపై రూ.వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న ప్రభుత్వం పేద విద్యార్థులకు ఉచిత పుస్తకాలు కూడా ఇవ్వలేకపోతోంది. ఈ ఏడాది ఉచిత పుస్తకాలు ఇవ్వడంపై ఇప్పటివరకూ నిర్ణయం తీసుకోలేదు. పుస్తక ప్రసాదం పథకం కింద ఇవ్వాలంటూ ఇంటర్‌ విద్యామండలి కోరినా టీటీడీ స్పందించకపోవడంతో గతేడాది ఉచిత పుస్తకాలు ఇవ్వలేదు. ఇంటర్‌ బోర్డు నిధులను ప్రభుత్వం నాడు– నేడుకు మళ్లించకపోయి ఉంటే ఉచిత పుస్తకాలు ఇవ్వడం పెద్ద భారమయ్యేది కాదు.

Updated Date - 2023-06-01T11:36:04+05:30 IST