Education: పిల్లల చదువుపై మనస్తత్వ నిపుణులు ఏం సూచిస్తున్నారంటే..!
ABN , First Publish Date - 2023-03-17T12:31:10+05:30 IST
చదవాలని చాలా మంది పిల్లల్ని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుంటారు. అయితే వారు చదవలేకపోవడానికి కారణాలను ఎప్పుడూ అన్వేషించరు. అటు వైపు ఆలోచించేందుకు

తల్లిదండ్రుల పాత్రే కీలకం
నివారణకు వైద్యుల సలహాలు
రన్వీర్.. ఆరో తరగతి చదువుతున్నాడు.. అందరిలాగే నిత్యం పుస్తకాల మోతతో అమ్మకు టాటా చెప్పి స్కూల్‌కి వెళతాడు. కానీ అందరి విద్యార్థుల్లా పరీక్షల్లో మార్కులు రావడం లేదు. ఎంత పోటీ పడినా పాత ర్యాంకును దాటడం లేదు.
రాహుల్.. స్కూల్లో చెప్పే పాఠాలు శ్రద్ధగా వింటాడు. అంతలోనే మరిచిపోతాడు. అందుకే ర్యాంకుల రేసులో వెనుకపడుతున్నాడు.
సాకేత్ తల్లి మంజు తన కుమారుడిని రోజూ చదువు.. చదువు అంటూ ఒకటే ఒత్తిడి చేస్తుంటుంది. అలా ఎన్ని గంటలు పుస్తకాలు పట్టినా ఫలితం మాత్రం ఆశించినంతగా ఉండటం లేదు.
ఇవిన్నీ ఉదాహరణలే.. చాలా మంది విద్యార్థుల పరిస్థితి ఇలానే ఉంటోంది. మన దేశంలో దాదాపు 40 శాతం మంది విద్యార్థులు ఇతర విద్యార్థులతో పోల్చుకుంటే చదువుల పోటీలో వెనుకబడి ఉంటున్నారు. అయితే దీనంతటికి కారణాలు వెతికితే... అటు పాఠశాలల్లో, ఇటు తల్లిదండ్రుల్లో పై లోపాలు స్పష్టంగా కనిస్తున్నాయి. ప్రధానంగా ఎలాంటి సమస్య లేకుండా ఉన్న వారిలోనే ఇలాంటి సమస్యలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. అదే లెర్నింగ్ డిజాబిలిటీస్. ఈ లెర్నింగ్ డిజాబిలిటీస్‌పైనగరంలో పలువురు సీనియర్ పీడియాట్రిక్, న్యూరాలజీ వైద్యులు, మనస్తత్వ నిపుణులు పలు సూచనలు చేస్తున్నారు.
హైదరాబాద్, బంజారాహిల్స్, మార్చి 16(ఆంధ్రజ్యోతి): చదవాలని చాలా మంది పిల్లల్ని తల్లిదండ్రులు ఒత్తిడి చేస్తుంటారు. అయితే వారు చదవలేకపోవడానికి కారణాలను ఎప్పుడూ అన్వేషించరు. అటు వైపు ఆలోచించేందుకు దృష్టి పెట్టకపోవడమే తప్పంటున్నారు ప్రముఖ చిన్నపిల్లల వైద్య నిపుణుడు నౌనిహాల్ సింగ్, విద్యార్థుల్లో చదువు విషయంలో రెండు రకాలుగా లోపం ఉంటుంది. ఒకటి జీన్స్ ప్రభావం కాగా మరొకటి ఎదుగుదల లోపం. ఇందులో సాధారణంగా జీన్స్ లోపం వల్ల విద్యార్థుల చదువులో ఎగుడుదిగుడులు ఉంటాయి. ఒకరికి మొత్తం గుర్తుంటే మరొకరికి ఉండే అవకాశం ఉండదు. మేనరికం వివాహాలు, ఉమ్మడి కుటుంబాల్లో ఉండే మాటతీరు ప్రభావం పిల్లలపై అధికంగా ఉంటుంది. అంతేకాకుండా పిల్లకు సరైన శిక్షణ ఇవ్వకపోవడం వారికి ఏం కావాలో సరిగ్గా సూచించకపోవడం, టీవీలకు అతుక్కుపోవడం, అతిగా స్పందించడం వంటివి సమస్యలుగా మారతాయి. ఈ విషయాల్లో తల్లిదండ్రుల పాత్ర క్రియాశీలకంగా ఉండాలని ఆయన చెబుతున్నారు. కొంతమంది చిన్నారుల్లో నరాల ఇబ్బంది వల్ల వినికిడి లోపం లాంటి సమస్యలు ఏర్పడవచ్చని పీడియాట్రిక్ డాక్టర్ సురేష్ అంటున్నారు. అంతేకాకుండా ప్రసవానికి ముందు సమయంలో ఏదైనా దెబ్బ తగిలినా, ముందుగా జన్మించినా పిల్లల్లో ఇలాంటి సమస్యలు వచ్చే ప్రమాదం అధికంగా ఉంటుంది. ఈ సమస్య శాతాన్ని పరిశీలిస్తే అమ్మాయిల్లో కన్నా అబ్బాయిల్లోనే అధికంగా ఉంటుందని చెబుతున్నారు.
పిల్లలతో ఎలా వ్యవహరించాలంటే..
పిల్లలకు సమయాన్ని కేటాయించాలి. వారు చెప్పేది కాస్త వినిపించుకోవాలి
పిల్లల మనసు తెలుసుకొని మెలగాలి. ప్రేమగా స్పృశించాలి. గుండెకు హత్తుకొని కబుర్లు చెప్పాలి.
ఒడిలో పడుకోబెట్టుకొని వారికి ఏం ఇష్టమో కనుక్కోవాలి. వారి ఆలోచనలను గమనించాలి. వారి ఇష్టాలు, అలవాట్లను గుర్తించాలి.
బయటి వ్యక్తులతో పాఠశాలలో ఎలా మసలుకోవాలో వారికి తెలపాలి.
కుటుంబ పరమైన బంధాలు, అనుబంధాల గురించి తెలియజెప్పాలి.
తప్పు చేస్తే సరిదిద్ది వారికి ఏది సరైందో తెలియచెప్పాలి..
ఒంటరితనాన్ని వారి దరి చేరనివ్వొద్దు.
ఏ విషయాన్ని కూడా పిల్లల ముందు సాగదీయకండి.
ఇంటి బాధ్యతల గురించి చెప్పాలి.
చదువులో రాణించేందుకు అప్పుడప్పుడు చిన్నచిన్న బహుమతులు అందజేయాలి. అది కూడా వారికి ఇష్టమైనవే ఇవ్వాలి.
పిల్లలు ఆసక్తి కనబర్చే కథలు వారికి చెప్పాలి. అందులో చదువును మేళవించాలి. చదుకోవడం వల్ల ప్రయోజనాలను వివరించాలి.
లైబ్రరీలకు తీసుకువెళ్లి వారికి ఇష్టమైన పుస్తకాలను చదువుకునేలా చూడాలి.
చిన్నారుల్లో కనిపించే ఇబ్బందులివే..
బృంద పరీక్షల్లో వెనుకబడటం
సరిగ్గారంగుల్ని, వ్యాసాలను గుర్తించ లేకపోవడం.
పోటీ పరీక్షల్లో నెమ్మదిగా వ్యవహరించడం
నైపుణ్యాలను త్వరగా ఒంటబట్టించుకోకపోవడం.
ఆధారాలిచ్చినప్పటికీ సరిగా గుర్తించలేకపోవడం. ఆ దిశగా ప్రయత్నం చేయలేకపోవడం.
షార్ట్‌టర్మ్ లేదంటే లాంగ్‌టర్మ్ జ్ఞాపకశక్తి లోపాలు కలిగి ఉండటం.
నలుగురితో కలిసిమెలిసి ఉండలేకపోవడం.
వాతావరణం మార్పులకు అనుగుణంగా తన మనస్తత్వం సర్దుకోలేకపోవడం.
ఆహారం.. నిద్ర..
చిన్నారులు ఎదుర్కొంటున్న ఈ డిజియబులిటీస్‌కు ఆహారం, నిద్ర, ప్రధాన కారణాలవుతున్నాయి. పిల్లలకు అందించే ఆహారంలో దాన్యాలు, పండ్లు, పచ్చటి కూరగాయలు, లీన్ ప్రోటీన్స్ ఉండేలా చేసుకోవాలి. అంతేకాకుండా వారికి కావాల్సిన ఆహారాన్ని వారే ఎంచుకొనేలా సూచించాలి. నిద్ర విషయంలో పిల్లల తల్లిదండ్రులు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. సరైన నిద్ర ఉంటేనే చదువు బుర్రకెక్కుతుంది. అందుకే పిల్లలు పడుకొనే సమయాన్ని కచ్చితంగా వారికి తెలియచెప్పాలి. ఆ సమయానికి వారు బెడ్‌పై చేరేలా చూడాలి. టీవీలకు అతుక్కుపోకుండా చూడటం నయం.
తల్లిదండ్రులూ ఇలా చేయండి..
పిల్లల చదువు తీరును ఎప్పటికప్పుడు గమనించాలి.
పిల్లలకు సంబంధించి వ్యక్తిగత చదువు ప్రణాళికను ఏర్పాటు చేసుకోవాలి.
అప్పుడప్పుడు పిల్లల మానసిక స్థితిని గమనిస్తూ అవసరమైతే పీడియాట్రిషియన్‌తో పూర్తి పరీక్షలు చేయించాలి.
తక్కువగా చదవడం తప్పు కాదని గుర్తించాలి. వారిని ప్రోత్సహించాలి.
ఏదైనా విషయం అర్థం అయ్యేందుకు ఉదాహరణలతో చెప్పండి. అది త్వరగా వారి మెదడులోకి చేరుతుంది.
ప్రోత్సహించాలి.. కించ పరిచేలా మాట్లాడకండి
పిల్లలకు కొన్ని విషయాలు అర్థం కావు. వాటిని విడమరిచి చెప్పాలి. అర్థం కాకపోతే మరోసారి వివరించాలి. అంతేకానీ వారిని కించపరిచేలా మాట్లాడటం వల్ల నెగటివ్ మెంటాలిటీ పెరుగుతోంది. సక్సెస్ అన్నది ఏకాగ్రత మీద ఆధారపడి ఉంటుంది. పిల్లలను జాగ్రత్తగా చూసుకుంటూ వారు అనుకున్న లక్ష్యాన్ని చేరుకునేందుకు ధ్యానం వంటి వాటిని అలవాటు చేయాలి. పరీక్షలు రాగానే కొంత మంది తల్లిదండ్రులు హడావిడి చేస్తుంటారు. ఇది మంచి పద్ధతి కాదు. ఒత్తిడి లేకుండా పిల్లలు స్వేచ్ఛగా చదివేలా చూసుకోవాలి.
- డాక్టర్ నౌనిహాల్ సింగ్, చిన్నపిల్లల నిపుణుడు