Hyderabad: మ్యాట్రీమొనీ పేరుతో మహిళలకు వల.. 27 తులాల బంగారంతో..
ABN , First Publish Date - 2023-11-17T10:46:23+05:30 IST
మ్యాట్రిమొుని పేరుతో మహిళల్ని మోసం చేయడమే గాకుండా నగల్ని కాజేస్తున్న నిందితుడ్ని మార్కెట్ పోలీసులు అరెస్టు

- పలు పోలీస్స్టేషన్లలో కేసులు
అడ్డగుట్ట(హైదరాబాద్), (ఆంధ్రజ్యోతి): మ్యాట్రిమొుని పేరుతో మహిళల్ని మోసం చేయడమే గాకుండా నగల్ని కాజేస్తున్న నిందితుడ్ని మార్కెట్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. అతడి నుంచి 27 తులాల బంగారు ఆభరణాలు, కొటక్ మహీంద్రా చెక్‌బుక్, హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డు, జోయాలుక్కాస్, లలితా జ్యూవెల్లరీ ఇన్వాయిస్ పత్రాలు, సెల్‌ఫోన్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నార్త్‌జోన్ కార్యాలయంలో గురువారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మహంకాళి ఏసీపీ రవీందర్ వివరాలు వెల్లడించారు. రంగారెడ్డి జిల్లా కందుకూరు(Kandukuru) మండలం నేదునూర్ గ్రామానికి చెందిన తుమ్మ మోహన్ రెడ్డి అలియాస్ శ్రీనాధ్ (38) రంగారెడ్డి జిల్లాలోని ఓ ప్రైవేట్ స్కూలులో టీచర్‌గా పనిచేసేవాడు. సులువుగా డబ్బు సంపాదించాలని భరత్ మ్యాట్రీమొని వెబ్‌సైట్‌ను ఏర్పాటుచేశాడు. పెళ్లి పేరుతో అనేకమంది యువతులను నమ్మించి మోసం చేశాడు. ఈ క్రమంలో శ్రీనాధ్‌కు ఓ యువతితో పరిచయమైంది. ఈనెల 8న సికింద్రాబాద్‌లోని ఓ లాడ్జికి వచ్చిన యువతి బ్యాగులోని 27 తులాల బంగారు ఆభరణాలు తీసుకుని శ్రీనాధ్ పారిపోయాడు. బాధితురాలి ఫిర్యాదుతో కేసు నమోదు చేసుకున్న మార్కెట్ పోలీసులు నిందితుడ్ని పట్టుకున్నారు.
విచారణలో పోలీసులకు ఆసక్తికరమైన విషయాలు తెలిశాయి. నిందితుడు 2011లో బాలికను వేధించిన కేసులో అరెస్టయి మూడు నెలలు జైలుశిక్ష అనుభవించాడు. విడుదలైన తరువాత మళ్లీ మోసాలు చేయడం మొదలుపెట్టాడు. బంధువుకు చెందిన కారును అతని తెలియకుండా విక్రయించాడు. ఈ కేసులో మళ్లీ జైలుకు వెళ్ళాడు. 2021లో మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఓ ఇంట్లో వస్తువులు, చైతన్యపురి పోలీ్‌సస్టేషన్ పరిధిలోని బాయ్స్ హాస్టల్లో రూ. 40 వేల విలువ చేసే ల్యాప్‌టాప్‌ను దొంగిలించాడు. విడాకులు తీసుకున్న మహిళతో పరిచయం ఏర్పరచుకుని ఆమె క్రెడిట్ కార్డుతో 2.20 లక్షల రూపాయల బంగారం కొనుగోలు చేశాడు. విజయవాడకు పారిపోయి పోలీసులకు చిక్కాడు. మియాపూర్ పోలీ్‌సస్టేషన్ పరిధిలో మరో మహిళను నమ్మించి ఆమె డబ్బు రూ. 6.20 లక్షలతో బంగారు నగల్ని కొనుగోలు చేసి విజయవాడలో విక్రయించాడు. ఇలా పలుచోట్ల మోసాలకు పాల్పడ్డాడు. గుంటూరు జిల్లా దిశ మహిళా పోలీస్ స్టేషన్లో ఇతడిపై కేసు నమోదైంది.