Chennai: కడలూరులో కుటుంబ కలహం.. ముగ్గురి సజీవ దహనం
ABN , First Publish Date - 2023-02-09T08:45:39+05:30 IST
కుటుంబ తగాదాల నేపథ్యంలో సోదరి ఇంటిలో తన భార్య ఉంటుందన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురిపై పెట్రోల్ పోసి
- మరో ముగ్గురి పరిస్థితి విషమం
పెరంబూర్(చెన్నై), ఫిబ్రవరి 8: కుటుంబ తగాదాల నేపథ్యంలో సోదరి ఇంటిలో తన భార్య ఉంటుందన్న కోపంతో ఓ ప్రబుద్ధుడు ఇద్దరు చిన్నారులు సహా ముగ్గురిపై పెట్రోల్ పోసి దహనం చేసిన సంఘటన కడలూరు(Cuddalore)లో తీవ్ర కలకలం సృష్టించింది. ఈ ఘటనలో మరో ముగ్గురు తీవ్రగాయాలతో చికిత్స పొందుతున్నారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు... కడలూరు సెల్లంకుప్పం వెల్లిపిళ్లయార్ ఆలయ వీధిలో ప్రకాష్-తమిళరసి (31) దంపతులు నివసిస్తున్నారు. వీరికి హాసిని అనే నాలుగు నెలల కుమార్తె ఉంది. కడలూరు దేవనాంపట్టి ప్రాంతంలో తమిళరసి సోదరి ధనలక్ష్మి ఆమె భర్త సర్గురు నివశిస్తున్నారు. ఈ దంపతులకు ఆరు నెలల కుమారుడున్నాడు. ఇటీవల సర్గురు-ధనలక్ష్మి మధ్య మనస్పర్థలు ఏర్పడి గొడవపడ్డారు. దానికి సంబంధించిన కేసు కోర్టులో విచారణలో ఉంది. మంగళవారం రాత్రి ధనలక్ష్మి సోదరి తమిళరసి ఇంటికెళ్ళింది.. బుధవారం ఉదయం ప్రకాష్ పనులకు వెళ్లాడు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ధనలక్ష్మికి ఆమె భర్త సర్గురు ఫోన్ చేశాడు. తమ మధ్యనున్న సమస్యలు పరిష్కరించుకోవాలని తెలిపిన సర్గురు, నేరుగా ప్రకాష్ ఇంటికొచ్చాడు. ఇద్దరూ మాట్లాడుతుండగా సర్గురు ఉన్నట్టుండి కోపగించుకున్నాడు. వెంటనే తాను వచ్చిన మోటార్ బైక్ నుంచి పెట్రోల్ తీసి ఓ సీసాలో నింపుకొచ్చి ఇంటి చుట్టూ చల్లి నిప్పంటించాడు. తన వంటిపై కూడా పెట్రోలు పోసుకుని నిప్పంటించుకున్నాడు. క్షణాల్లో ఇల్లంతా మంటలు వ్యాపించింది. తమిళరసి, ఇద్దరు పిల్లలకు నిప్పంటుకుంది. ఇంటి నుంచి మంటలు రావడం గమనించిన చుట్టుపక్కల వారు ముదునగర్ పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులు, అగ్నిమాపక సిబ్బందితో అక్కడకు చేరుకొని మంటలు అదుపుచేశారు. అప్పటికే మంటల్లో కాలి తమిళరసి, హాసిని, ఆరు నెలల మగబిడ్డ సజీవదహనం కాగా, సర్గురు, ధనలక్ష్మి, ఆమె తల్లి సెల్వి తీవ్రంగా గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ముగ్గురి ఆరోగ్యపరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని జిల్లా ఎస్పీ శక్తిగణేశన్ పరిశీలించారు. ముదునగర్ పోలీసులు కేసు నమోదుచేసుకొని దర్యాప్తు జరుపుతున్నారు.
ఇదికూడా చదవడి: ‘పుదుమైపెణ్’తో పెరిగిన అడ్మిషన్లు