Hyderabad: కోట్లలో ముంచేసిన నేరగాడి అరెస్ట్.. ఇతడి ఖాతాలో మీరుగానీ ఉన్నారా?

ABN , First Publish Date - 2023-03-23T20:21:28+05:30 IST

నాలుగేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్థుడు

Hyderabad: కోట్లలో ముంచేసిన నేరగాడి అరెస్ట్.. ఇతడి ఖాతాలో మీరుగానీ ఉన్నారా?

హైదరాబాద్: నాలుగేళ్లుగా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకు తిరుగుతున్న కరుడుగట్టిన నేరస్థుడు రంజిత్ తివారీ అలియాస్ రాజీవ్ సక్సేనా అలియాస్ హిమాన్సు ఉపాధ్యాయ అలియాస్ రంజిత్ తివారీ అలియాస్ రంజిత్ కుమార్ తివారీని హైదరాబాద్ పోలీసులు హర్యానా(Haryana)లోని గురుగ్రామ్(Gurugram) జిల్లాలో అరెస్ట్ చేశారు. 2019లో మిరిక్ బయోటెక్ లిమిటెడ్ పేరుతో పేపర్లపైనే ఓ కంపెనీని స్థాపించిన నిందితుడు తెలంగాణ రీజనల్ సేల్స్ మేనేజర్‌గా ఓ వ్యక్తిని నియమించుకున్నాడు.

తమ కంపెనీకి ఉత్తర భారతదేశంలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయని, స్కిన్ కేర్, ఆయుర్వేద ఉత్పత్తులను తయారుచేస్తుందని సేల్స్ మేనేజర్ ఆకర్షణీయమైన బ్రోచర్లు చూపించాడు. ఇప్పుడు తమ సంస్థను దక్షిణ భారతదేశంలోనూ విస్తరించాలనుకుంటున్నట్టు చెప్పి డిస్ట్రిబ్యటూర్లను సంపాదించాడు. అతడు చెప్పిన మాటలు నిజమని నమ్మని సింధూర ట్రేడర్స్ అనే సంస్థ రూ. 6 లక్షలు డిపాజిట్‌గా చెల్లించింది. మెటీరియల్ సరఫరా కోసం అదనంగా మరో రూ. 36 లక్షలు రంజిత్ తివారీకి చెల్లించింది. ఈ సొమ్ము చేతికందాక రంజిత్ తన మొబైల్ ఫోన్లను ఆఫ్ చేసేశాడు.

బాధితుడి ఫిర్యాదుపై కేసు నమోదు చేసుకున్న తెలంగాణ సీఐడీ పోలీసులు తప్పించుకు తిరుగుతున్న నిందితుడి కోసం గాలింపు మొదలు పెట్టారు. అతడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రత్యేకంగా ఓ బృందాన్ని ఏర్పాటు చేశారు. నాలుగేళ్లుగా తప్పించుకు తిరుగుతున్న నిందితుడు తాజాగా గురుగ్రామ్‌లో ఉన్నట్టు పక్కా సమాచారం అందుకున్న పోలీసు బృందం ఈ నెల 20న రంజిత్ తివారీని అరెస్ట్ చేసింది. అనంతరం పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చింది.

నిందితుడి విచారణ సందర్భంగా మరిన్ని షాకింగ్ విషయాలు వెలుగులోకి వచ్చాయి. గురుగ్రామ్‌కు చెందిన వీరేంద్రకుమార్, యశోద ఎంపెర్సాకు చెందిన నిమ్మ నిఖిత రెడ్డిలను కూడా ఇలానే మోసం చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. అలాగే, ఏడాది వ్యవధిలో ప్రజలను మోసం చేసి 1,26,00,000 రూపాలయలు కొల్లగొట్టిన విషయాన్ని పోలీసులు గుర్తించారు. వారందరికీ ఆకర్షణీయమైన రంగురంగుల బ్రోచర్లు చూపించడం ద్వారా నిందితుడు వారిని బుట్టలో పడేసినట్టు పోలీసులు తెలిపారు. బ్రోచర్లను చూసి బాధితులు గుడ్డిగా నమ్మేశారని పోలీసులు తెలిపారు. నిందితుడిని జుడీషియల్ కస్టడీకి పంపినట్టు పేర్కొన్నారు. నిందితుడు రంజిత్ తివారిని పట్టుకున్న పోలీసు బృందాన్ని సీఐడీ అదనపు డీజీపీ మహేశ్ ఎం.భగవత్ తెలిపారు.

Updated Date - 2023-03-23T20:21:28+05:30 IST