SAP: ఇప్పుడు ‘శాప్’ వంతు.. 3 వేల మంది ఉద్యోగులు ఇంటికి!

ABN , First Publish Date - 2023-01-26T17:27:13+05:30 IST

ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్న టెక్ కంపెనీల సరసన ఇప్పుడు

SAP: ఇప్పుడు ‘శాప్’ వంతు.. 3 వేల మంది ఉద్యోగులు ఇంటికి!

బెర్లిన్: ఉద్యోగులను ఎడాపెడా తొలగిస్తున్న టెక్ కంపెనీల సరసన ఇప్పుడు జర్మన్ సాఫ్ట్‌వేర్ దిగ్గజం శాప్ (SAP) చేరింది. ఈ ఏడాది 3 వేల మంది ఉద్యోగులను తొలగించాలని (Lay Off) నిర్ణయించింది. వాల్‌డోర్ఫ్ (Walldorf)కు చెందిన ఈ కంపెనీ సంప్రదాయ, క్లౌడ్ ఆధారిత కంప్యూటింగ్ సేవలు రెండింటినీ అందిస్తుంది. తమ ప్రధాన వ్యాపారాన్ని బలోపేతం చేయడంలో భాగంగా పునర్నిర్మాణ కార్యక్రమం చేపట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు ఈ సందర్భంగా శాప్ పేర్కొంది. అందులో భాగంగానే ఉద్యోగులపై వేటేస్తోంది.

సంస్థ తాజా నిర్ణయం కారణంగా సంస్థలోని మొత్తం వర్క్‌ఫోర్స్‌లో 2.5 శాతం మందిపై ప్రభావం పడే అవకాశం ఉందని తెలుస్తోంది. 2022కి సంబంధించి పూర్తి సంవత్సర ఆదాయ ఫలితాలను వెల్లడించిన నివేదికలో కంపెనీ ఈ మేరకు పేర్కొంది. శాప్‌లో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 1,20,000 మంది ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 3 వేల మందికి లేఆఫ్ ప్రకటించాలని నిర్ణయించింది.

ఉద్యోగుల తొలగింపు వల్ల ఈ త్రైమాసికంలో 250 నుంచి 300 మిలియన్ యూరోల ఖర్చు అవుతుందని కంపెనీ తెలిపింది. అయితే, పునర్నిర్మాణం వల్ల వచ్చే ఏడాది నుంచి సంవత్సరానికి 300 నుంచి 350 మిలియన్ యూరోలు ఆదా అవుతాయని వివరించింది. ఫలితంగా ఈ సొమ్మును వ్యూహాత్మక అభివృద్ధి ప్రాంతాల్లో పెట్టుబడులు పెట్టేందుకు వీలు చిక్కుతుందని తెలిపింది. కాగా, ఈ ఏడాది శాప్ 30.9 బిలియన్ యూరోల ఆదాయాన్ని ఆర్జించింది. గతేడాదితో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువ.

ఇటతీవలి కాలంలో టెక్ దిగ్గజాలు మెటా(Meta), అమెజాన్(Amazon), గూగుల్(Google), ఐబీఎం(IBM), మైక్రోసాఫ్ట్(Microsoft), సేల్స్‌ఫోర్స్(Salesforce) వంటి కంపెనీలు ఉద్యోగులను పెద్ద ఎత్తున తొలగించాయి. ఇప్పుడు శాప్ కూడా అలాంటి నిర్ణయమే ప్రకటించింది.

Updated Date - 2023-01-26T17:27:16+05:30 IST